ENE: బాక్సాఫీస్ వద్ద ‘ఈఎన్‌ఈ రిపీట్’ విధ్వంసం.. 14 ఏళ్ల నాగార్జున ఆల్-టైమ్ రికార్డు బద్దలు.!

ENE: తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం నటించిన ‘ఈఎన్‌ఈ రిపీట్’ (ఈ నగరానికి ఏమైంది 2) ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

Gagan kumar
Published on: 28 Nov 2026 8:18 AM IST
ENE
X

ENE: బాక్సాఫీస్ వద్ద ‘ఈఎన్‌ఈ రిపీట్’ విధ్వంసం.. 14 ఏళ్ల నాగార్జున ఆల్-టైమ్ రికార్డు బద్దలు.!

Ee Nagaraniki Emaindi 2: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి గ్యాంగ్ మరోసారి తమ మ్యాజిక్‌ను రిపీట్ చేసింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్‌ఈ రిపీట్’ (ఈ నగరానికి ఏమైంది 2) థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నవంబర్ 19న విడుదలైన ఈ చిత్రం, కేవలం కొద్ది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలో 14 ఏళ్లుగా అక్కినేని నాగార్జున పేరిట ఉన్న ఒక అరుదైన బాక్సాఫీస్ రికార్డును ఈ సినిమా తిరగరాసింది.

2012 నవంబర్ 23న విడుదలైన నాగార్జున సోషియో ఫాంటసీ చిత్రం ‘ఢమరుకం’, అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రూ.48 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. గత 14 ఏళ్లుగా తెలుగు సినీ చరిత్రలో నవంబర్ నెలలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా ‘ఢమరుకం’ అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చింది. ఎన్నో భారీ సినిమాలు నవంబర్‌లో వచ్చినా ఈ రికార్డును చేరుకోలేకపోయాయి. కానీ, ఇప్పుడు ‘ఈఎన్‌ఈ రిపీట్’ రూ.50 కోట్ల మార్కును దాటి ఆ 14 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.

ఈ చారిత్రక విజయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. నవంబర్‌లో బిగ్గెస్ట్ తెలుగు బ్లాక్‌బస్టర్ వచ్చేసింది. 14 ఏళ్ల రికార్డు బద్దలైంది. అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ పూర్తయింది అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం, ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడంతో ఇకపై వచ్చే ప్రతి రూపాయి లాభాలేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు ఓవర్సీస్‌లోనూ ఈ గ్యాంగ్ హవా మామూలుగా లేదు. ముఖ్యంగా ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద 1.55 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తోంది. వివేక్ సాగర్ సంగీతం, తరుణ్ భాస్కర్ మార్క్ కామెడీ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ‘ఈఎన్‌ఈ రిపీట్’ విడుదలైన మరుసటి రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తోంది. పవన్ సాధినేని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా నిర్మించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. మొదటి వారం కంటే రెండో వారంలో ఈ సినిమాకు వసూళ్లు పెరుగుతుండటం విశేషం. మొత్తానికి నవంబర్ బాక్సాఫీస్ వద్ద ‘ఈఎన్‌ఈ రిపీట్’ సృష్టించిన ఈ రికార్డు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఫైనల్ రన్‌లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో, అలాగే ‘ఆకాశంలో ఒక తార’ వసూళ్లు ఎక్కడి వరకు వెళ్తాయో చూడాలి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.