Megastar Chiranjeevi: ‘పర్సంటేజీ’ లొల్లి.. మెగాస్టార్ చెంతకు చేరిన థియేటర్ల వివాదం!
Megastar Chiranjeevi: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యాల (ఎగ్జిబిటర్లు) మధ్య నడుస్తున్న అద్దె వర్సెస్ పర్సంటేజీ షేరింగ్ వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది.
Megastar Chiranjeevi: ‘పర్సంటేజీ’ లొల్లి.. మెగాస్టార్ చెంతకు చేరిన థియేటర్ల వివాదం!
Megastar Chiranjeevi: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యాల (ఎగ్జిబిటర్లు) మధ్య నడుస్తున్న అద్దె వర్సెస్ పర్సంటేజీ షేరింగ్ వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, రెవెన్యూ షేరింగ్ వివాదానికి ముగింపు పలికేందుకు ఎగ్జిబిటర్లు రంగంలోకి దిగారు. ఈ సమస్య తీవ్రతరం కావడంతో, పరిష్కారం కోసం పరిశ్రమ పెద్ద, మెగాస్టార్ చిరంజీవిని ఎగ్జిబిటర్ల ప్రతినిధుల బృందం ఆశ్రయించింది.
మెగాస్టార్ నివాసంలో అత్యంత కీలకమైన భేటీ
హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో జరిగిన ఈ అత్యవసర సమావేశానికి పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) అధ్యక్షుడు సురేష్ బాబు, సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణలతో పాటు ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సునీల్ నారంగ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఎగ్జిబిటర్ల పక్షాన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ జువ్వాడి శేఖర్, ప్రముఖ థియేటర్ల ప్రతినిధులు శ్రీధర్, అనుపమ్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, బాల గోవింద్ తదితరులు చిరంజీవితో మాట్లాడారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ సాగించాలంటే కొత్త ఆదాయ పద్ధతి ఎంత అవసరమో వారు వివరించారు.
‘పెద్ది’ సినిమా నుంచే అమలు చేయాలని ఎగ్జిబిటర్ల పట్టు!
తెలంగాణలో థియేటర్ల అద్దె పద్ధతికి బదులుగా వసూళ్లలో పర్సంటేజీ (శాతాల వారీగా) పంచుకునే విధానాన్ని పర్యవేక్షించేందుకు ఫిల్మ్ ఛాంబర్ ఇప్పటికే ఒక ఉపసంఘాన్ని (సబ్ కమిటీ) ఏర్పాటు చేసింది. అయితే, రాబోయే భారీ బడ్జెట్ చిత్రం, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని ఫిల్మ్ ఛాంబర్ ఇదివరకే ఒక తీర్మానం చేసింది. కానీ ఎగ్జిబిటర్లు మాత్రం ఈ నిర్ణయంతో విభేదిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచే ఈ కొత్త పర్సంటేజీ షేరింగ్ మోడల్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఖచ్చితంగా అమలు చేయాలని వారు గట్టి పట్టుబడుతున్నారు.
వివాదం నేపథ్యం
ప్రస్తుతం థియేటర్ల యాజమాన్యాలు స్థిరమైన అద్దె (ఫిక్స్‌డ్ రెంట్లు) చెల్లించాల్సి వస్తోంది. అయితే పెద్ద సినిమాలు లేని సమయంలో థియేటర్లు ఖాళీగా ఉండి నష్టాలు వస్తున్నాయని, అందుకే సినిమాకు వచ్చే వసూళ్లలోనే శాతాల వారీగా (పర్సంటేజీ సిస్టమ్) వాటాలు పంచుకునే విధానం రావాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు.
జూన్ మొదటి వారంలో ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ లోపే ఈ సమస్యను సద్దుమణిగేలా చేసి, ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలని మెగాస్టార్ చిరణ్జీవికి ఇరు పక్షాలు విజ్ఞప్తి చేశాయి. పరిశ్రమలో అందరికీ ఆమోదయోగ్యమైన పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి జోక్యంతో ఈ పర్సంటేజీ వివాదానికి త్వరలోనే తెరపడుతుందని ట్రేడ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.




