Akshay Kumar: ఫేక్‌ మీసాలతో వందకోట్లు నష్టం... అక్షయ్‌ ఊహించని తప్పిదం

Akshay Kumar: సినిమాల్లో చారిత్రక పాత్రను పోషించే సమయంలో దానికి తగ్గట్టుగా మేకోవర్‌ కావలసి ఉంటుంది. అంకితభావంతో పనిచేయాలి.

Balachander
Published on: 24 April 2026 12:45 PM IST
Akshay Kumar
X

Akshay Kumar

Akshay Kumar: సినిమాల్లో చారిత్రక పాత్రను పోషించే సమయంలో దానికి తగ్గట్టుగా మేకోవర్‌ కావలసి ఉంటుంది. అంకితభావంతో పనిచేయాలి. ఈ విషయంలో ఏమాత్రం చిన్న తప్పు జరిగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఫలితం తారుమారైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. సామ్రాట్‌ పుథ్విరాజ్‌ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్‌ నకిలీ మీసాలు వాడటం వలన సినిమా ఫలితం తారుమారైంది. ప్రేక్షకులను నొప్పించినందుకు అక్షయ్‌ కుమార్‌ బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

అసలు ఏం జరిగింది?

సాధారణ కథలతో పోలిస్తే చారిత్ర అంశాలున్న కథలతో సినిమా తెరకెక్కించడం వలన నిర్మాతలకు భారీ లాభాలు వస్తాయి. అందులోనూ దేశభక్తి అంశాలు ఉంటే ఇక చెప్పక్కర్లేదు. అయితే, చారిత్రక వీరుల పాత్రలు కాలమాన పరిస్థితులకు తగిన విధంగా ఉండాలి. మేకోవర్‌ దానికి తగ్గట్టుగా చేసుకోవాలి. రాజులకు మీసాలే అందం. అంతకు మించి గర్వం కూడా. మీసాలు సహజసిద్దంగా ఉంటే తెరపై అందంగా, ఉగ్రరూపంలో కనిపిస్తారు. శతృవులతో పోరాడిన ధైర్యశాలి పృథ్వీరాజ్‌ చౌహాన్‌ అటువంటి రాజే. ఆయన కథాంశంతో వచ్చిన సినిమాలో అక్షయ్‌ కుమార్‌ టైటిల్‌ రోల్‌ పోషించారు. దీనికోసం ఆయన స్వయంగా మీసాలు పెంచాలి. కానీ, ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తున్నందువలన, ఇతర సినిమాల షెడ్యూల్స్‌ కారణంగా మీసాలు పెంచలేకపోయాడు. దీంతో పృథ్వీరాజ్‌ చౌహాన్‌ కోసం నకిలీ మీసాలు పెట్టుకొని షూటింగ్‌ చేయవలసి వచ్చింది. దీనిని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్‌ చేశారు. పాత్ర పట్ల గౌరవం లేదని విమర్శించారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజుల్లో మీసాలు గడ్డాలు, జట్టుకోసం విగ్గులు, నకిలీ మీసాలు వాడినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడంతా కలర్‌ఫుల్‌ ప్రపంచం. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా వెంటనే పసిగట్టేస్తారు. సోషల్‌ మీడియాలో ఒకసారి ట్రోల్‌ అయింది అంటే రికవరీ కావడం చాలా కష్టం.

భారీ నష్టం

నకిలీ మీసం ఫలితం భారీ నష్టం. సుమారు 220 కోట్ల రూపాయలతో నిర్మించిన పృథ్విరాజ్‌ చౌహాన్‌ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కేవలం రూ. 90 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నిర్మాతలకు సుమారు రూ. 130 కోట్లు నష్టం వాటిల్లింది. ఒక సినిమాకు ఈ స్థాయిలో నష్టం అంటే ఊహించడం కష్టం. స్టార్‌ హోదా హీరో సినిమా 220 కోట్లు వసూలు పెద్ద కష్టమేమి కాదు. పైగా బాలీవుడ్‌ సినిమా అంటే మనదేశంతో పాటు విదేశాల్లోనూ విడుదల అవుతుంది. కానీ, కేవలం రూ. 90 కోట్లు మాత్రమే వసూలయ్యాయి అంటే ఏ స్థాయిలో విమర్శలు వచ్చాయో అర్ధం చేసుకోవచ్చు.

నాలుగేళ్ల తర్వాత అక్షయ్ వివరణ

ఇంతటి నష్టాన్ని నిర్మాతలు మొయగలరా.. ఎవరూ ఏం చెప్పలేరు. అయితే, నాలుగేళ్ల తరువాత అక్షయ్‌ కుమార్‌ ఆ తప్పు గురించి మాట్లాడారు. భూత్‌ బంగ్లా అనే సినిమా ప్రమోషన్లో భాగంగా పాత తప్పును గుర్తు చేసుకున్నారు. పృథ్విరాజ్‌ పాత్రకు ఒక ప్రత్యేకమైన మీసం ఉండాలి. కానీ, బిజీ షెడ్యూల్‌ కారణంగా సహజంగా పెంచడం సాధ్యం కాదు. తన లుక్‌ వల్ల ఎవరైనా నొచ్చుకుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని అన్నాడు. ప్రస్తుతం గ్రాఫిక్స్‌, మేకప్‌ విధానాల్లో భారీగా మార్పులొచ్చినప్పటికీ.. ప్రేక్షకులు సహజత్వాన్నే కోరుకుంటున్నారు అని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story