నెటిజన్ల ట్రోలింగ్‌తో ఫరియా ఆవేదన.. వీడియో వైరల్
బోనాల వేడుకల్లో పాల్గొన్నందుకు వచ్చిన ట్రోలింగ్‌పై ఫరియా అబ్దుల్లా స్పందించారు. లైవ్‌లో భావోద్వేగానికి గురయ్యారు.
Faria Abdullah
టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొన్న ఆమెపై కొందరు నెటిజన్లు మతపరమైన వ్యాఖ్యలతో ట్రోల్ చేశారు. దీంతో ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనపై వస్తున్న కామెంట్లపై మాట్లాడుతున్న సమయంలో ఆమె భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తోంది.
ఫరియా అబ్దుల్లా ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలో నిర్వహించిన బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సందడి చేసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే బోనాల వేడుకల్లో ఆమె పాల్గొనడాన్ని కొందరు నెటిజన్లు తప్పుబట్టారు. మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ కామెంట్లు చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ట్రోలింగ్‌పై ఫరియా ఘాటు స్పందన
తనను ట్రోల్ చేస్తున్న వారికి ఫరియా అబ్దుల్లా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో దేవుడిని చూడటమే నిజమైన భక్తి అని ఆమె పేర్కొన్నారు. మనసులో ద్వేషాన్ని పెంచుకుంటూ దేవుడిని వెతకడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు.
దేవుడు ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదని ఫరియా అన్నారు. ప్రతి చోటా ఉండే దివ్యమైన వెలుగే దేవుడని పేర్కొన్నారు. అలాంటి విశాలమైన భావనను సంకుచితమైన ఆలోచనలతో ఎలా పరిమితం చేస్తారని ఆమె ప్రశ్నించారు.
ద్వేషానికి ప్రేమతోనే సమాధానం
తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా వాటికి ద్వేషంతో స్పందించనని ఫరియా స్పష్టం చేశారు. తనను ద్వేషించే వారికి కూడా ప్రేమను పంచుతానని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
2021లో జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఫరియా అబ్దుల్లా.. ఆ సినిమాలో ‘చిట్టి’ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సినిమాలతో పాటు డ్యాన్స్, తన ప్రత్యేకమైన స్టైల్‌తో సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు.
ప్రస్తుతం బోనాల వేడుకల్లో పాల్గొనడం, ఆ తర్వాత వచ్చిన ట్రోలింగ్‌పై స్పందించడం కారణంగా ఫరియా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె స్పందించిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఫరియా వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి.




