First Telugu Film in China: 75 ఏళ్ల క్రితమే చైనాలో అడుగుపెట్టి అదరగొట్టిన ఎన్టీఆర్‌ మూవీ

75 ఏళ్ల క్రితమే ఒక తెలుగు సినిమా చైనా సబ్‌ టైటిల్స్‌తో చైనాలో విడుదలై ఏకంగా 100 రోజులు ఆడి రికార్డు సృష్టించింది ఎన్టీఆర్‌ నటించిన మల్లీశ్వరి.

Balachander
Updated on: 15 May 2026 2:18 PM IST
First Telugu Film in China: 75 ఏళ్ల క్రితమే చైనాలో అడుగుపెట్టి అదరగొట్టిన ఎన్టీఆర్‌ మూవీ
X

First Telugu Film in China: ఒక్క లాంగ్వేజ్‌లో సినిమా రిలీజ్‌ చేస్తే దాని వలన పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. అందుకే పాన్‌ ఇండియా, గ్లోబల్‌ సినిమా అనే ట్యాగ్‌లైన్లు తగిలించి దేశ విదేశాల్లో రిలీజ్‌ చేస్తున్నారు. ఇక రాజమౌళి సినిమాలు చైనా, జపాన్‌ దేశాల్లో వందల కోట్లు వసూలు చేస్తున్నాయి. ఇదంతా ఇప్పుటి ట్రెండ్‌. కానీ, 75 ఏళ్ల క్రితమే సాంకేతిక అంతగా లేని రోజుల్లోనే ఒక తెలుగు సినిమా చైనా సబ్‌ టైటిల్స్‌తో చైనాలో విడుదలై ఏకంగా 100 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఆ సినిమా ఏదో కాదు...ఎన్టీఆర్‌ నటించిన మల్లీశ్వరి.

విజయనగర సామ్రాజ్య నేపథ్యం - అద్భుత కథా గమనం

బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో, వాహిని ప్రొడక్షన్స్ పతాకంపై 1951 డిసెంబర్ 20న విడుదలైన 'మల్లీశ్వరి' తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయి. శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం నాటి సామాజిక వాతావరణాన్ని ఈ సినిమా కళ్లకు కట్టింది. గ్రామీణ శిల్పి నాగరాజు, మేనత్త కూతురు మల్లీశ్వరి చిన్ననాటి స్నేహితులు, ప్రేమికులు. కానీ, మల్లీశ్వరి అందాన్ని చూసి ఆమె తల్లి ఆశపడి, రాయలవారి అంతఃపురానికి పంపిస్తుంది. విరహంతో కుంగిపోయిన నాగరాజు, తన శిల్పకళా నైపుణ్యంతో హంపి నగరంలో ప్రధాన శిల్పిగా ఎదుగుతాడు.


అక్కడ వసంత మండపంలో మల్లీశ్వరి రూపాన్నే శిల్పంగా మలుస్తాడు. ఆ తర్వాత వారి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది, రాయలవారు వారి ప్రేమానురాగాలను ఎలా గుర్తించారనేదే ఈ చిత్ర ఇతివృత్తం. ఈ అందమైన దృశ్యకావ్యంలో 17 పాటలు ఉండగా అందులో 16 పాటలను ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించారు. అప్పట్లో దేశంలోని 13 కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శించబడింది. అంతేకాదు, దేశ సరిహద్దులను దాటి చైనాలో అక్కడి సబ్‌టైటిల్స్‌తో విడుదలై 100 రోజులు ప్రదర్శించబడింది.

సంగీత సాహిత్యాల విందు

సాలూరు రాజేశ్వరరావు అందించిన స్వరాలు ఈ సినిమాను అమరకావ్యంగా మార్చాయి. ‘నెల రాజా వెన్నెల రాజా’, ‘మనసున మల్లెల మాలలు గారే’, ‘అవునా నిజమేనా’ వంటి పాటలు నేటికీ రేడియోల్లో, సంగీత ప్రియుల గుండెల్లో మ్రోగుతూనే ఉన్నాయి. భానుమతి అద్భుత గాత్రం, ఎన్టీఆర్ ఆహార్యం ఈ సినిమాకు ప్రాణప్రతిష్ఠ చేశాయి. సాధారణంగా ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్, గ్రాఫిక్స్ ఉంటేనే సినిమాలు విదేశాలకు వెళ్తున్నాయి. కానీ కేవలం బలమైన కథ, అద్భుతమైన నటన, హృదయాన్ని హత్తుకునే సంగీతం ఉంటే భాషా సరిహద్దులు దాటి ప్రపంచాన్ని గెలవవచ్చని 1951లోనే నిరూపించింది 'మల్లీశ్వరి'. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించబడిన ఈ క్లాసిక్ సినిమా, తెలుగు వారి నైపుణ్యానికి ఎప్పటికీ ఒక గర్వకారణం. ఈరోజుల్లో బాహుబలి, పుష్ప, ధురంధర్‌ వంటి చిత్రాల్లో గ్లోబల్‌ స్థాయిలో విజయవంతం కావడానికి పునాదులు 75 ఏళ్ల క్రితమే పడ్డాయని చెప్పవచ్చు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story