H S Keerthana IAS Story: రీల్‌ లైఫ్‌లో హీరోయిన్‌...రియల్‌ లైఫ్‌లో కలెక్టర్‌

H S Keerthana IAS Story: సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒకసారి ముఖానికి రంగులు వేసుకుంటే... ఆ రంగులను వదిలి వెళ్లిపోవాలనిపించదు.

Balachander
Published on: 20 April 2026 12:21 PM IST
H S Keerthana IAS Story: రీల్‌ లైఫ్‌లో హీరోయిన్‌...రియల్‌ లైఫ్‌లో కలెక్టర్‌
X

H S Keerthana IAS Story: సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒకసారి ముఖానికి రంగులు వేసుకుంటే... ఆ రంగులను వదిలి వెళ్లిపోవాలనిపించదు. కానీ, కొందరు మాత్రం సినిమా లైఫ్‌ కంటే కెరీర్‌లో తాము సాధించాలని అనుకున్న గమ్యస్థానమే ముఖ్యమని భావిస్తారు. సినీ రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగినా... తమ లక్ష్యాన్ని మాత్రం మర్చిపోరు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు హెచ్‌ ఎస్‌ కీర్తన ఒకరు. బాలనటిగా ఆరంగ్రేటం చేసి 32 సినిమాల్లో నటించి, 48 టీవీ షోలతో అలరించిన కీర్తన అనూహ్యంగా ఆ ప్రపంచాన్ని వదిలి... దేశ సేవకు అంకితమైంది.

బాలనటిగా తిరుగులేని ప్రయాణం

'కర్పుర్దా గొంబే' సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన కీర్తన, తన నటనతో అతి తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకుంది. ‘గంగ-యమున’, ‘హబ్బా’, ‘లేడీ కమిషనర్’ వంటి దాదాపు 32 చిత్రాల్లో నటించి మెప్పించింది. వెండితెరపైనే కాదు, బుల్లితెరపై కూడా ఆమె ప్రయాణం సాఫీగా సాగింది. సుమారు 48 టీవీ షోలలో పాల్గొని కన్నడ ప్రేక్షకులకు ఇంటి ఆడపడుచులా మారిపోయింది. ఇన్ని చిత్రాల్లో నటించిన ఎవరైనా నటిగా తన స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని చూస్తారు. నటన ద్వారా వచ్చిన డబ్బుతో వ్యాపారం చేయాలని చూస్తారు. ఇంకా చెప్పాలంటే రాజకీయంగా కూడా తమ జాతకాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటారు. కానీ, కీర్తన అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంది. తన నిర్ణయం తప్పుకాదని నిరూపించింది.

ఐఏఎస్ కల.. ఆరో ప్రయత్నంలో విజయం

కీర్తన సినీ కెరీర్‌ టాప్‌గేర్‌లో ఉండగానే అనూహ్యంగా సినిమా జీవితానికి స్వస్తి పలికింది. తన కల సివిల్‌ సర్వీస్‌ కావడంతో... ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే 2011లో కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌ పరీక్షరాసి కర్ణాటక ప్రభుత్వ జాబ్‌ సంపాదించింది. రెండేళ్లపాటు అధికారిగా పనిచేసింది. అయితే, చిన్ననాటి కల ఐఏఎస్‌ కావడం. ఎలాగైనా దాన్ని సాధించాలని కంకణం కట్టుకుంది. ఒకసారి రెండు సార్లు రాసిన వారికి తెలియకుండానే ఆసక్తి తగ్గిపోతుంది. కానీ, ఐదు ప్రయత్నాలు వరసగా చేసినా తనలో ఏమాత్రం ఆసక్తి తగ్గలేదు. పరీక్షల్లో ఫెయిల్‌ అయిన ప్రతిసారి తనలోని లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగింది. ఆరో ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షల్లో 167వ ర్యాంక్‌ సాధించింది. ప్రస్తుతం కీర్తన కర్ణాటకలోని మాండ్య జిల్లాలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోంది.

నటన తరువాత చాలా మంది రాజకీయాల్లోకి వస్తే... కీర్తన చదువును ఆయుధంగా చేసుకొని దేశం గర్వించే స్థాయికి ఎదిగింది. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా, మళ్లీ మళ్లీ ప్రయత్నించి లక్ష్యాన్ని ముద్దాడడం ఆమెలోని గొప్ప గుణం. రీల్ లైఫ్ హీరోయిన్‌గా అందరినీ అలరించిన కీర్తన, ఇప్పుడు రియల్ లైఫ్ కలెక్టర్‌గా సామాన్యుల కష్టాలను తీరుస్తోంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story