K Malathi tragic life story: ఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌కు ధీటుగా రాణించి... రేకుల షెడ్డులో అనాథలా మరణించిన హీరోయిన్‌

K Malathi tragic life story: సినీ రంగుల ప్రపంచంలో ఒక వెలుగు వెలిగి, పాతాళభైరవి వంటి అద్భుత చిత్రాల్లో ఎన్టీఆర్ సరసన నటించిన నటి కే. మాలతి జీవితం అత్యంత విషాదకరంగా ముగిసింది.

Balachander
Published on: 18 April 2026 11:33 AM IST
K Malathi tragic life story
X

K Malathi tragic life story

K Malathi tragic life story: సినీ రంగుల ప్రపంచంలో ఒక వెలుగు వెలిగి, పాతాళభైరవి వంటి అద్భుత చిత్రాల్లో ఎన్టీఆర్ సరసన నటించిన నటి కే. మాలతి జీవితం అత్యంత విషాదకరంగా ముగిసింది. చివరి రోజుల్లో తిండికి లేక, ఒక రేకుల షెడ్డులో అనాథలా ప్రాణాలు వదిలిన ఆమె కథ వింటే ఎవరి హృదయమైనా ద్రవిస్తుంది. తెలియకుండానే కన్నీటి చుక్కలు రాలిపడతాయి.

పాతాళభైరవి 'ఇందుమతి' నుంచి అనాథగా

సినీ రంగం ఎప్పుడూ ఓ మాయాజాలమే. ఆ రంగంలోని ఎత్తుపల్లాలను గమనిస్తూ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తేనే చివరి వరకు నిలబడగలం. విజయం సాధించగలం. ఒక్కసారిగా వచ్చిన విజయం చాలా కాలం నిలబడదు. నటి కే మాలతి విషయంలోనూ ఇదే జరిగింది. తెలుగు సినిమా స్వర్ణయుగంలో కే మాలతి అంటే ఓ సంచలనం. 1951లో విడుదలైన పాతాళభైరవి సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. రాజకుమారి ఇందుమతి పాత్రలో ఆమె అభినయం అజరామరం. అప్పట్లో ఆమె ఎన్టీఆర్, ఎస్వీఆర్ వంటి దిగ్గజాలకు దీటుగా రెమ్యునరేషన్ అందుకునేవారు. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనడానికి మాలతి జీవితమే ఒక నిలువుటద్దం.

విలాసాల నుండి విధి వంచన వరకు

విజయం మన దగ్గరకు వస్తుంది అంటే దానికి తగినట్టుగా సిద్దంగా ఉండాలి. సంపాదన, ఖర్చుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఒక్కసారిగా వచ్చిన గుర్తింపుతో సంపాదన పెరిగింది. వచ్చిపడిన సంపాదనను ఏం చేయాలో తెలియక, ఆర్థిక క్రమశిక్షణ లేక వచ్చినదానిని వచ్చినట్టుగా ఇష్టమొచ్చినట్టుగా ఖర్చు చేసింది. ఇదే ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టాయి. కథానాయికగా మంచి పేరు తెచ్చుకున్న మాలతి ఆ తరువాతి కాలంలో చిన్నపాత్రలు చేయవలసి వచ్చింది. అద సమయంలో ఆమె భర్త వీరాచారి మరణంతో మాలతి మానసికంగా, ఆర్థికంగా కుంగిపోయింది. 1979లో వచ్చిన 'శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం' ఆమె ఆఖరి చిత్రం.

రేకుల షెడ్డులో శేషజీవితం...అనాథలా మరణం

సినిమా అవకాశాలు లేక, ఆత్మీయులు దూరమై.. హైదరాబాద్‌లోని కాచిగూడ ప్రాంతంలో ఒక సినిమా థియేటర్ పక్కన ఉన్న రేకుల షెడ్డులో ఆమె తలదాచుకున్నారు. తాను ఒకప్పటి స్టార్ హీరోయిన్ అన్న విషయం ఎవరికీ తెలియనివ్వలేదు. సమీపంలోని దేవాలయ ప్రసాదమే ఆమెకు ప్రాణాధారమైంది. దిక్కుతోచని స్థితిలో అనాథలా రేకుల షెడ్డులో జీవితాన్ని వెళ్లదీస్తున్న మాలతిపై ప్రకృతి పగబట్టింది. 1979 నవంబర్ 25న వీచిన ఈదురు గాలులకు పక్కనే ఉన్న థియేటర్ గోడ కూలి ఆమె నివసిస్తున్న షెడ్డుపై పడింది. తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించే లోపే మరణించారు. ఆమె చనిపోయిన తర్వాత షెడ్డులోని ఒక పాత ట్రంకు పెట్టెలో ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోలు, ఆమె కన్నీటి గాథను తెలిపే డైరీ లభించడంతోనే.. ఆమె 'పాతాళభైరవి' మాలతి అని లోకానికి తెలిసింది.

వెండితెరపై మెరిసే తారల జీవితాల వెనుక ఎన్ని చీకటి కోణాలు ఉంటాయో మాలతి కథ చెబుతుంది. అంతులేని సంపద ఉన్నప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే, కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పుడు విలువలని కాపాడుకోకపోతే.. చివరి అంకం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ఉదంతం మనకు ఒక పాఠంలా మిగిలిపోయింది. అందుకే నేటితరం తారలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. ఆర్థిక క్రమశిక్షణతో మేలైన జీవితాన్ని గడుపుతున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story