Gaddar Film Awards 2025: తెలంగాణ కోడలిని రష్మిక కామెంట్స్ వైరల్.. ఏపీపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
Gaddar Film Awards 2025: తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 వేడుక అట్టహాసంగా జరిగాయి.
Gaddar Film Awards 2025: తెలంగాణ కోడలిని రష్మిక కామెంట్స్ వైరల్.. ఏపీపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
Gaddar Film Awards 2025: హైదరాబాద్ వేదికగా జరిగిన 'తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ - 2025' వేడుక కనుల పండువగా సాగింది. కళాకారుల కలల ప్రతిరూపమైన ఈ పురస్కారాల ప్రదానోత్సవం కేవలం ఒక అవార్డుల వేడుకలా కాకుండా, భారతీయ సినిమా దిగ్గజాల సమాగమంగా నిలిచింది. ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో నిర్వహిస్తున్న ఈ వేడుకలో చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున వంటి హేమాహేమీలు పాల్గొని సందడి చేశారు. చాలా ఏళ్ల నిరీక్షణ తర్వాత మళ్లీ అవార్డుల సందడి మొదలవ్వడంతో టాలీవుడ్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో పునర్జీవం పోసుకున్న ఈ అవార్డుల వేడుకలో సినీ ప్రముఖులు తమ మనసులోని మాటను పంచుకున్నారు.
హైదరాబాద్ సినిమాకు కేంద్రం కావాలి: మెగాస్టార్ చిరంజీవి
అవార్డుల వేడుకను తిరిగి ప్రారంభించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి చిరంజీవి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో ఆ దేశం బాగుపడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఆ పరమార్థాన్ని గ్రహించి ఈ వేడుకకు శ్రీకారం చుట్టారు. కే-పాప్, యానిమే సినిమాలు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చాయో, తెలంగాణ కూడా సినిమా రంగంలో అలా ఎదగాలి. హైదరాబాద్‌ను భారతీయ సినిమాకు కేంద్రంగా మార్చే బాధ్యతను భట్టి విక్రమార్క గారికి అప్పగించడం ఆనందంగా ఉంది. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి అక్కడ సినిమాను ప్రోత్సహించాలని కోరుతున్నాను అని చిరంజీవి పేర్కొన్నారు.
తెలంగాణ కోడలిని.. ఆశీర్వదించండి: రష్మిక మందన్న
ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. గర్ల్ ఫ్రెండ్ సినిమాకు గాను ఉత్తమ నటి అవార్డు అందుకున్న ఆమె ఎమోషనల్ అయ్యారు. గతంలో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నాను, కానీ ఈరోజు రాష్ట్ర అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. నన్ను ఇన్నాళ్లూ కూతురిలా ఆదరించారు, ఇప్పుడు తెలంగాణ కోడలిగా మీ ముందుకు వచ్చాను. నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఆమె వ్యాఖ్యానించారు. రష్మిక మాట్లాడుతుండగా విజయ్ దేవరకొండ తల్లి ఆనందంతో భావోద్వేగానికి లోనవ్వడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది.
గద్దర్ ఒక పీపుల్స్ లెజెండ్...
లోకనాయకుడు కమల్ హాసన్ మాట్లాడుతూ.. నేను 16 ఏళ్ల వయసులో అక్కినేని గారి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా హైదరాబాద్ వచ్చాను. గద్దర్ గారికున్న మిలియన్ల మంది అభిమానుల్లో నేను ఒకడిని. ఒక విప్లవ కవి పేరుతో ఈ అవార్డులు ఇవ్వడం చాలా గొప్ప విషయం అన్నారు. పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి తనదైన శైలిలో స్పందిస్తూ.. గద్దర్ గారు అన్నమయ్య, రామదాసు వంటి ప్రజా వాగ్గేయకారుడు. ఆయన పేరు మీద అవార్డులు ఇవ్వడం రేవంత్ రెడ్డి గారి డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయం. కాంతారావు గారి పేరు మీద నాకు అవార్డు రావడం గర్వకారణం. చంద్రబాబు గారు.. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ దూసుకెళ్తున్నారు, మీరు కూడా ఏపీలో నంది అవార్డులు ఇవ్వండి సార్ అంటూ విజ్ఞప్తి చేశారు. మొత్తానికి 2025 గద్దర్ అవార్డుల వేడుక తెలుగు సినిమా వైభవాన్ని చాటిచెప్పింది. సీనియర్లకు గౌరవం, యంగ్ జనరేషన్‌కు ప్రోత్సాహం అందిస్తూ సాగిన ఈ కార్యక్రమం ఇండస్ట్రీలో కొత్త ఊపిరి పోసింది.




