Govinda: వరుస సినిమాలతో రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో గోవిందా!
Govinda: సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా మళ్లీ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమయ్యారు.
Govinda: వరుస సినిమాలతో రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో గోవిందా!
Govinda: సుదీర్ఘ విరామం తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా మళ్లీ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమయ్యారు. ‘రూప’, ‘దునియాదారి’ అనే రెండు కొత్త చిత్రాలతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాల్లో గోవిందాతో పాటు కొత్త నటి రాణి స్వర్ణకర్ నటించనున్నారు. విశేషమేమిటంటే, ఈ రెండు సినిమాలను గోవిందా స్వయంగా నిర్మిస్తుండటం.
యువతను లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ చిత్రాల గురించి ఆయన ప్రెస్ మీట్‌లో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. 2019లో వచ్చిన ‘రంగీలా రాజా’ తర్వాత గోవిందా నటించిన సినిమాలు పెద్దగా లేకపోవడంతో, ఆయన ఫ్యాన్స్ ఈ కమ్ బ్యాక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
యువత కోసమే ఈ రెండు సినిమాలు
ఈ కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ గోవిందా, “నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. త్వరలోనే మొత్తం తారాగణాన్ని ప్రకటించబోతున్నాం. ఉత్తరప్రదేశ్ , మహారాష్ట్ర నుండి చాలా మంది కొత్త నటులను మీరు చూడబోతున్నారు. ‘రూప’, ‘దునియాదారి’ రెండు కూడా పూర్తిగా భిన్నమైన సినిమాలు, వీటిని ముఖ్యంగా యువత కోసం రూపొందిస్తున్నాం.
నేటి యువత ఎన్నో ఆశలతో అడుగు పెడతారు, కానీ ఒక్కోసారి దారి తప్పుతుంటారు. అటువంటి వారికి సరైన మార్గదర్శకత్వాన్ని, జీవితంలోని వాస్తవాలను ఈ సినిమాల ద్వారా చూపిస్తాను. యువత ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో, తమ మూలాలకు కట్టుబడి ఉండాలి,” అని పేర్కొన్నారు.
నిజాయితీయే నా బలం
తన నటనా శైలి , వ్యక్తిగత జీవితంపై స్పందిస్తూ గోవిందా, “నేను సినిమాల్లో పనిచేస్తున్నప్పుడు, నేను ఎలా ఇక్కడికి వచ్చానా అని ప్రపంచం ఆశ్చర్యపోతుంది. నాకు దేనికీ భయం లేదు. నేను నిజాన్ని చెప్పడానికి ఏమాత్రం వెనుకాడను. ఏం జరగబోతుందో నాకు ముందే తెలుస్తుంది. నేను నిజం చెబితే కొందరు నమ్మరు, నా గురించి తప్పుగా మాట్లాడుతుంటారు, అయినా సరే నేను నా దారిలో వెళ్తాను,” అని ఆయన తనదైన శైలిలో స్పందించారు.
గోవిందా ప్రయాణం: ఎడమొహం పెడమొహంగా సినిమాలు
గోవిందా చివరిసారిగా 2019లో ‘రంగీలా రాజా’ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. అయితే, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. 2022లో ‘నామ్ థా కన్హయ్యాలాల్’ అనే డాక్యుమెంటరీలో కనిపించినప్పటికీ, ఫీచర్ ఫిల్మ్స్‌కు ఆయన ఏడేళ్లుగా దూరంగా ఉన్నారు.
గతంలో ‘ఫ్రైడే’, ‘ఆ గయా హీరో’, ‘హ్యాపీ ఎండింగ్’, ‘కిల్ దిల్’ వంటి చిత్రాల్లో ఆయన నటించారు. ఇప్పుడు ఆయన భార్య సునీత , కుమారుడు యశ్వర్థన్ అహుజా కూడా సినిమా రంగంలోకి అడుగుపెడుతుండటం విశేషం. ఏక్తా కపూర్ నిర్మించే చిత్రాల ద్వారా వారు పరిచయం కానున్నారు.




