Hello Brother: హలో బ్రదర్‌ను కాదన్న చిరు... రికార్డులు సృష్టించిన నాగ్‌

Hello Brother: టాలీవుడ్‌ అగ్రతారల్లో ఒకరు అక్కినేని నాగార్జున. నాగ్‌ తన కెరీర్‌లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి మెప్పించారు.

Balachander
Published on: 23 April 2026 1:12 PM IST
Hello Brother
X

Hello Brother

Hello Brother: టాలీవుడ్‌ అగ్రతారల్లో ఒకరు అక్కినేని నాగార్జున. నాగ్‌ తన కెరీర్‌లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి మెప్పించారు. అలాంటి వాటిల్లో ఒకటి హలో బ్రదర్‌. అయితే, ఈ సినిమాలో మొదట హీరోగా నాగార్జునను అనుకోలేదట ఈవీవీ సత్యనారాయణ. ఈ కథను చిరంజీవి కోసం తయారు చేసుకొని ఆయనకు వినిపించారు. కానీ, అప్పటికే డ్యుయల్‌ రోల్‌ సినిమాలు చేసి ఉండటంతో ఈవీవీ కథను చిరంజీవి తిరస్కరించాడు. దీంతో ఈ కథ నాగ్‌ చెంతకు చేరింది. ఎవర్‌గ్రీన్‌ క్లాసిక్‌ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు, 1994లో రిలీజైన ఈ సినిమా ట్రేడ్‌ వర్గాలను ఆశ్చర్యపరిచేలా వసూళ్లు సాధించింది.

చిరంజీవి ఎందుకు నో చెప్పారు?

సినీ ఇండస్ట్రీలో అప్‌కమింగ్‌ డైరెక్టర్‌గా ఎదుగుతున్న ఈవీవీ తయారు చేసుకన్న కవలల పిల్లల కథను చిరంజీవికి చెప్పాడు. కానీ, అప్పటికే చిరంజీవి నకిలీ, ముగ్గురు మొనగాళ్లు వంటి కవలల స్టోరీతో సినిమాలు చేశారు. ఈ సినిమాలు బంపర్‌ హిట్టయ్యాయి. అదే కోణంలో మరో సినిమా అంటే అభిమానులు ఆదరిస్తారా అనే సందేహంతో కథను సున్నితంగా తిరస్కరించారు. ఈవీవీ కథలో బలం, కామెడీ టైమింగ్‌ ఉండటంతో నాగార్జునను అప్రోచ్‌ అయ్యారు. కథ విన్న వెంటనే నాగ్‌ ఓకే చేశారట. మాస్‌ను మెప్పించేలా దేవా, క్లాస్‌ను మెప్పించేలా రాజా పాత్రను తీర్చిదిద్దారు. ఈ రెండు పాత్రల్లో నాగార్జున అదిరిపోయేలా నటించి మెప్పించారు.

అంచనాలు తలకిందులు చేసిన వసూళ్లు

ఈ సినిమా విడుదలకు ముందు 1994లో నాగార్జున నటించిన గోవిందా గోవిందా సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీగా పరాజయం పాలైంది. ఆర్జీవి సినిమా ఫెయిల్‌ కావడంతో ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నాడు నాగ్‌. ఆ సమయంలో వచ్చిన సినిమానే హలో బ్రదర్‌. ఈ సినిమాపై ఎవరికీ ఎటువంటి అంచనాలు లేవు. సక్సెస్‌ ఫెయిల్‌ అని ఆలోచించకుండా సినిమా తీశారు. థియేటర్లో బొమ్మ పడి మొదటి ఆట పూర్తయిన తరువాత అంచనాలు తలక్రిందులయ్యాయి. ఊహించని రెస్పాన్స్‌ వచ్చింది. హైదరాబాద్‌లోని దేవీ థియేటర్లో రోజా పేరుతో ఉన్న రికార్డులను ఈ సినిమా తిరగరాసింది. వరుసగా 120 ఆటలు హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో రికార్డు సృష్టించింది. కేవలం 2.5 కోట్ల బడ్జెత్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. హైదరాబాద్‌లో మాత్రమే కాదు...అటు విజయవాడ అప్సర థియేటర్లో కూడా ఆల్‌టైమ్‌ రికార్డును ఈ సినిమా సొంతం చేసుకుంది.

వినోదమే ప్రధాన బలం

ఈ సినిమా ఈ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం వినోదం. దేవా రాజా పాత్రల మధ్య వచ్చే కన్ఫ్యూజన్‌ డ్రామా. రమ్యకృష్ణ సౌందర్య గ్లామర్‌. బ్రహ్మానందం కామెడీ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. అంతేకాదు, అప్పట్లో టాలీవుడ్‌ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లైన రాజ్‌కోటి సంగీతం సినిమాకు అదనపు బలమైంది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ మధురంగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుంటే ఛానల్‌ మార్చకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా నాటితరంపై ఎంత ఇంపాక్ట్‌ చూపించిందో. ఒకరు వద్దనుకున్న సినిమా మరొకరి జీవితాన్ని ఎలా మార్చిందో చెప్పడానికి హలోబ్రదర్‌ సినిమానే ఓ ఉదాహరణ.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story