Jani master: మొత్తం జానీ మాస్టర్ భార్యే చేశారా..? ట్విస్ట్ ఇచ్చిన బాధితురాలు
Jani master: జానీ మాస్టర్ భార్య సుమలతా దేవి ఏకపక్ష నిర్ణయాలపై తెలుగు డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో తీవ్ర వివాదం రేగింది..
Jani master: మొత్తం జానీ మాస్టర్ భార్యే చేశారా..? ట్విస్ట్ ఇచ్చిన బాధితురాలు
Sekhar master: టాలీవుడ్ కొరియోగ్రఫీ వర్గాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ, హైడ్రామా నెలకొంది. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, జానీ మాస్టర్ భార్య సుమలతా దేవి ఏకపక్ష నిర్ణయాలపై అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఏకంగా 10 మంది డ్యాన్సర్లు తమ పదవులకు, అసోసియేషన్‌కు రాజీనామా చేయడం చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారమే రేపుతోంది. గతేడాది డిసెంబర్‌లో ఎంతో ఘనంగా ప్రమాణ స్వీకారం చేసి, అసోసియేషన్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సుమలత చుట్టూ ఇప్పుడు వివాదాలు చుట్టుముట్టాయి.
డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో రేగిన ఈ చిచ్చుకు ప్రధాన కారణం బై-ఎలక్షన్ నిర్వహణేనని తెలుస్తోంది. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. ఫెడరేషన్ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా, సుమలత తన సొంత నిర్ణయంతో బై-ఎలక్షన్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏకపక్ష ధోరణి నచ్చని కమిటీ సభ్యులు, డ్యాన్సర్లు ఆమెపై తిరుగుబావుటా ఎగరేశారు. ఈ క్రమంలోనే 10 మంది కీలక సభ్యులు రాజీనామా లేఖలు సమర్పించారు.
ఈ వివాదం కేవలం రాజీనామాలతోనే ఆగలేదు. అసోసియేషన్ వేదికగా టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాలు రెండు గ్రూపులుగా విడిపోయినట్లు తెలుస్తోంది. సుమలత నిర్ణయాలను సమర్థిస్తూ ఒక వర్గం, వ్యతిరేకిస్తూ మరో వర్గం పరస్పరం తీవ్ర వాగ్వాదానికి దిగాయి. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కాస్తా హద్దులు దాటడంతో.. చివరకు ఈ పంచాయితీలోకి పోలీసులు కూడా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది.
ఈ గొడవ, హైడ్రామా జరుగుతున్న సమయంలోనే.. గతంలో జానీ మాస్టర్‌పై ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన బాధితురాలు శ్రేష్టి వర్మ కూడా అక్కడే ఉండటం ఇండస్ట్రీ వర్గాల్లో మరింత చర్చకు దారితీసింది. ఒకప్పుడు సినిమా పాటలకు అదిరిపోయే స్టెప్పులతో అలరించిన డ్యాన్సర్స్ అసోసియేషన్, ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాలతో వార్తల్లోకి ఎక్కింది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ.. ఈ రాజీనామాల పర్వం ఎటు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఫెడరేషన్ పెద్దలు జోక్యం చేసుకుని ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారా? లేక ఈ వివాదం మరింత ముదురుతుందా? అనేది వేచి చూడాలి.




