H.M. Reddy: ఈ ఫిజిక్స్ మాస్టారే దక్షిణాది సినిమాల్లో మాట పుట్టించాడు
మనం ఈరోజు థియేటర్లలో చూస్తున్న భారీ డైలాగులు, పాటలు, మాటలు ఎలా పుట్టాయో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మాట పుట్టుకకు కారణం ఎవరో మీకు తెలుసా?
H.M. Reddy: ఈరోజు మనం థియేటర్లలో చూస్తున్న భారీ డైలాగులు, కళ్లల్లో నీళ్లు తెప్పించే సెంటిమెంట్లు, నవ్వించే కామెడీ.. వీటన్నింటికీ మూలం ఎక్కడో తెలుసా? 1892లో రాయలసీమలోని రాయదుర్గం దగ్గర ఉన్న అక్కంపల్లి అనే చిన్న గ్రామంలో జన్మించిన హనమప్ప మానప్ప రెడ్డి అలియాస్ హెచ్.ఎమ్. రెడ్డి అనే ఒక సాధారణ ఫిజిక్స్ ప్రొఫెసర్ చేతుల్లోనే దక్షిణ భారత టాకీ సినిమా ప్రాణం పోసుకుంది. కాలేజీలో విద్యార్థులకు సైన్స్ పాఠాలు చెప్పే ఆ మాస్టారు, ఉద్యోగాన్ని వదిలేసి మరీ వెండితెరకు శబ్దాన్ని పరిచయం చేసి 'ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ టాకీస్'గా చరిత్ర సృష్టించారు. 1931లో ఆయన తీసిన 'కాళిదాసు' చిత్రంతోనే నిశ్శబ్దంగా ఉన్న థియేటర్లలో తెలుగు పద్యం మొదటిసారి వినిపించింది.
గురువుకే సవాల్ విసిరిన శిష్యుడు!
భారత చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే దగ్గర హెచ్.ఎమ్. రెడ్డి అసిస్టెంట్‌గా చేరినప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. "నువ్వు మద్రాస్ వెళ్లి చక్కటి మూకీ సినిమాలు తీయ్" అని ఫాల్కే సలహా ఇస్తే, హెచ్ ఎం రెడ్డి మాత్రం ఎంతో ఆత్మవిశ్వాసంతో.. "గురువుగారూ! మీరు మూకీ తీశారు, కానీ నేను దక్షిణాదికి వెళ్లి ఖచ్చితంగా టాకీ తీసి చూపిస్తాను" అని సవాల్ చేశారు. అన్నట్టుగానే 1931 అక్టోబర్ 31న 'కాళిదాసు' సినిమాను విడుదల చేసి ఆ మాట నిలబెట్టుకున్నారు. ఆ రోజుల్లో థియేటర్లలో బొమ్మలు మాట్లాడటం చూసి జనం పిచ్చెక్కిపోయి, "వెండితెరపై మనుషులు మాట్లాడుతున్నారురా!" అంటూ వింతగా మాట్లాడుకున్నారు. చప్పట్లతో థియేటర్లలో హోరెత్తించారు.
శబ్దం కోసం అర్ధరాత్రి పోరాటం!
ఆ కాలంలో ఇప్పటిలా అధునాతన రికార్డింగ్ స్టూడియోలు లేవు. రోడ్లపై తిరిగే వాహనాల శబ్దాలు, సముద్రపు హోరు రికార్డింగ్‌కు అంతరాయం కలిగించకుండా ఉండడం కోసం హెచ్.ఎమ్. రెడ్డి ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. మద్రాస్ రోడ్లన్నీ పూర్తిగా నిర్మానుష్యంగా మారే అర్ధరాత్రి 2 గంటల సమయంలో, నిశ్శబ్ద వాతావరణంలో నటీనటులతో డైలాగులు, పద్యాలు రికార్డ్ చేసేవారు. అలాగే, తొలి తెలుగు టాకీ కాళిదాసు చిత్రంలో నాయిక లక్ష్మీరాజ్యం పాట పాడటానికి భయపడితే.. "నువ్వు పాడకపోతే తెలుగు సినిమా పుట్టదు తల్లి" అని ఎమోషనల్‌గా ఒప్పించి మరీ పాడించారు.
సినీ సామ్రాజ్యానికి పునాది
హెచ్.ఎమ్. రెడ్డి గారు కేవలం ఒక రంగానికే పరిమితం కాలేదు. ఒకే సెట్‌లో, ఒకే నెగెటివ్‌తో 1931లో మొదటి తెలుగు, తమిళ టాకీలను, ఆ తర్వాత 1934లో మొదటి కన్నడ టాకీ 'భక్త ధ్రువ'ను తెరకెక్కించారు. అంతేకాదు, ఆయన స్థాపించిన 'రోహిణి పిక్చర్స్' స్టూడియోలోనే ఎల్.వి. ప్రసాద్, బి.ఎన్. రెడ్డి వంటి మహామహులు తయారయ్యారు. చివరికి మన విశ్వనటచక్రవర్తి ఎన్టీఆర్ 'మన దేశం' సినిమా ద్వారా మొదటి బ్రేక్ ఇచ్చింది కూడా ఈయనే!
ఇంతటి ఘనచరిత్ర కలిగిన మన రాయలసీమ తాతకు ఈరోజు మనం ఇస్తున్న గౌరవం ఎంత? ముంబైలో ఫాల్కే పేరు మీద అవార్డులు, రోడ్లు ఉన్నాయి. కానీ, దక్షిణాది ఇండస్ట్రీకి ప్రాణం పోసిన ఈ తెలుగువాడికి కనీసం గుర్తింపు కూడా ఇవ్వలేకపోయాం. ఇప్పటికైనా ఈ నిజమైన సినిమా దేవుడి కథను మన తరువాతి తరాలకు అందించి, ఆయన కీర్తిని కాపాడుకుందాం. ఇలాంటి వారు చేసిన కృషి వలనే నేడు సినిమా ఇండస్ట్రీ కోటాను కోట్లు వసూలు చేయగలిగే సినిమాలను తీయగలుగుతున్నారు.




