Dolby Cinema: ప్రపంచంలోనే తొలి సింగిల్ స్క్రీన్ డాల్బీ థియేటర్ హైదరాబాద్‌లో..!
హైదరాబాద్‌లో ప్రపంచంలోనే తొలి సింగిల్ స్క్రీన్ డాల్బీ సినిమా రాబోతోంది. జీడిమెట్లలో కొత్త థియేటర్ నిర్మాణం వేగంగా సాగుతోంది.
Dolby Cinema : హైదరాబాద్ నగరంలో సినీప్రియులకు మరో సరికొత్త అనుభవం అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే తొలి ‘సింగిల్ స్క్రీన్’ డాల్బీ సినిమా థియేటర్‌ను నగరంలో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు వేగంగా సాగుతున్నాయి.
ఇటీవల అల్లూ సినిమాస్ డాల్బీ సినిమా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌పై దృష్టి సారించారు. జీడిమెట్లలో ఉన్న రంగా థియేటర్‌లో మైత్రి మూవీ మేకర్స్ వాటా సంపాదించి, దాన్ని ఆధునీకరించే పనులు ప్రారంభించారు. ఈ థియేటర్‌లో అత్యాధునిక డాల్బీ సినిమా స్క్రీన్‌ను ఏర్పాటు చేయనున్నారు.
సుమారు 635 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ థియేటర్ నిర్మాణానికి దాదాపు రూ.13–14 కోట్ల వరకు ఖర్చు అవుతుందని సమాచారం. బాలానగర్‌లోని విమల్ థియేటర్‌పై మైత్రి పెట్టుబడితో పోలిస్తే ఇది రెండింతలు అధికం. ప్రస్తుతం విమల్ థియేటర్ హైదరాబాద్‌లోని బెస్ట్ సింగిల్ స్క్రీన్ థియేటర్‌గా గుర్తింపు పొందింది.
ఈ కొత్త డాల్బీ సినిమా స్క్రీన్ పరిమాణం అల్లూ సినిమాస్ కంటే కొంచెం చిన్నదైనా, సింగిల్ స్క్రీన్ థియేటర్‌గా ఇది భారీగా ఉండనుంది. పూర్తి స్పెసిఫికేషన్లు త్వరలో ప్రకటించనున్నారు.
థియేటర్‌లో అత్యుత్తమ ఇంటీరియర్స్, సౌకర్యవంతమైన సీటింగ్, విస్తృత పార్కింగ్, ఫుడ్ అండ్ బేవరేజ్ కౌంటర్లు గ్రౌండ్ మరియు ఫస్ట్ ఫ్లోర్లలో ఏర్పాటు చేయనున్నారు. జీడిమెట్ల, కూకట్‌పల్లి, సూరారం, కంపల్లి, బాలానగర్ ప్రాంతాల సినీప్రియులకు ఈ థియేటర్ ప్రధాన కేంద్రంగా మారనుంది.
ఈ ఏడాది చివరికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి. అదనంగా, దిల్‌సుఖ్‌నగర్‌లోని గంగా థియేటర్‌ను కూడా మైత్రి ఆధునీకరించే పనులు చేపట్టింది. అది బాలానగర్ విమల్ థియేటర్ మాదిరిగానే రూపుదిద్దుకోనుంది.




