అయన వల్లే సినిమాల్లోకి వచ్చాను: జయకృష్ణ ఘట్టమనేని
Jaya Krishna Ghattamaneni: ఘట్టమనేని కుటుంబం నుండి టాలీవుడ్‌కి మరో సరికొత్త వారసుడు పరిచయమవుతున్నాడు.
అయన వల్లే సినిమాల్లోకి వచ్చాను: జయకృష్ణ ఘట్టమనేని
Jaya Krishna Ghattamaneni: ఘట్టమనేని కుటుంబం నుండి టాలీవుడ్‌కి మరో సరికొత్త వారసుడు పరిచయమవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ తాజాగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు జయకృష్ణ మరియు హీరోయిన్ రాషా థడాని మొదటిసారి మీడియా ముందుకు వచ్చి ముచ్చటించారు. పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్విని దత్ సమర్పిస్తుండగా.. జూలై 9న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
మూడో తరానికి తోడుగా వైజయంతీ మూవీస్.. జయకృష్ణ ఎమోషనల్!
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో జయకృష్ణ మాట్లాడుతూ అశ్విని దత్‌తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. "మా తాతగారు సూపర్ స్టార్ కృష్ణ గారితో అశ్విని దత్ గారు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు. ఆ తర్వాత మా బాబాయ్ మహేష్ బాబు గారిని ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఆయనే. ఇప్పుడు అదే వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నన్ను ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో లాంచ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని జయకృష్ణ తెలిపాడు.
నేను మా బాబాయ్ మహేష్ బాబుకు ఫ్యాన్‌ని!
తనకు బాబాయ్ మహేష్ బాబు అంటే ప్రాణమని చెప్తూ.. "నేను మా బాబాయ్ మహేష్ బాబు గారికి ఫ్యాన్‌ని. నా ప్రయత్నాలకు ఆయన ఎల్లప్పుడూ సపోర్ట్‌గా నిలిచారు" అని జయకృష్ణ అన్నాడు. అలాగే తన మరో తాతగారు, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు అయిన ఆదిశేషగిరిరావు గారే తను ఇండస్ట్రీలోకి రావడానికి ముఖ్య కారణమని వెల్లడించాడు. చిన్నప్పటి నుండి ఆయనే నన్ను నటన వైపు ప్రోత్సహించారని, ఆయన వల్లే తాను సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.
అజయ్ భూపతి మార్క్.. విలన్‌గా కలెక్షన్ కింగ్!
‘ఆర్‌ఎక్స్ 100’ తో సంచలన విజయం అందుకొని, ఇటీవలే ‘మంగళవారం’ చిత్రంతో మరో డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి.. ఇప్పుడు జయకృష్ణను టాలీవుడ్‌కి ఒక వైవిధ్యమైన కథతో పరిచయం చేస్తున్నాడు. ‘ఉయి అమ్మ’ చార్ట్‌బస్టర్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాషా థడాని ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెడుతోంది. ఇక ఈ సినిమాలో సీనియర్ యాక్టర్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక పవర్‌ఫుల్ నెగటివ్ రోల్‌లో నటిస్తుండటం విశేషం. ఘట్టమనేని వారసత్వాన్ని మోస్తూ వస్తున్న జయకృష్ణ.. జూలై 9న ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.




