iBomma Ravi: కోర్టుకెక్కిన ఐబొమ్మ రవి..డబ్బులు ఇప్పించాలంటూ

iBomma Ravi: తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, నాంపల్లి కోర్టులో రూ. 3 కోట్ల ఖాతాల పునరుద్ధరణకై ఐబొమ్మ రవి పిటిషన్ దాఖలు చేశారు.

Gagan kumar
Published on: 17 Sept 2026 4:18 PM IST
iBomma Ravi
X

iBomma Ravi: కోర్టుకెక్కిన ఐబొమ్మ రవి..డబ్బులు ఇప్పించాలంటూ

iBomma: ఒకప్పుడు ‘ఐబొమ్మ’ అంటే చాలు.. కొత్త సినిమాలు, హెచ్‌డీ ప్రింట్లు, జీరో ఖర్చుతో ఇంట్లోనే థియేటర్ ఎక్స్‌పీరియన్స్. టాలీవుడ్ ప్రొడ్యూసర్లకు నిద్రలేకుండా చేసిన ఐబొమ్మ మాజీ నిర్వాహకుడు ఇమంది రవి అలియాస్ ఐబొమ్మ రవి పేరు వింటే సినిమా పెద్దలకు సైతం చెమటలు పట్టేవి. అయితే, పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగి జైలుపాలైన రవి.. ఇప్పుడు సరికొత్త విజ్ఞప్తితో వార్తల్లోకి వచ్చారు. సినిమా పైరసీ కేసులో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు తన బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, తన కుటుంబాన్ని పోషించుకోవడం కూడా కష్టంగా మారిందని రవి తాజాగా నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.

నాంపల్లిలోని తొమ్మిదవ అదనపు చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో రవి పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఫ్రీజ్ చేసిన తన బ్యాంక్ ఖాతాల్లో దాదాపు రూ. 3 కోట్లు నిలిచిపోయాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం చేతిలో డబ్బులు లేక ఆర్థికంగా నలిగిపోతున్నానని, అనునిత్యం కుటుంబాన్ని పోషించడానికే ఇబ్బంది పడుతున్నానని పేర్కొన్నారు. కాబట్టి, సదరు స్తంభించిన బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించి తనకు ఊరట కల్పించాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు.

ఐబొమ్మ రవిది విశాఖపట్నం. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌లోకి అడుగుపెట్టిన ఈ కుర్రాడు.. టెక్నాలజీపై ఉన్న పట్టుతో పైరసీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఐబొమ్మ అనే వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి కోట్ల రూపాయలు ఆర్జించాడని విచారణలో తేలింది. విదేశాల్లో తిరుగుతూ సైబర్ క్రైమ్ పోలీసులకు దొరక్కుండా జాగ్రత్తపడిన రవి.. కుటుంబ వివాదాల కారణంగా హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.

కేవలం సినిమా పైరసీయే కాకుండా, ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి పెద్ద మొత్తంలో అక్రమ సంపాదనకు పాల్పడ్డాడనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నాడు. దాదాపు మూడు నెలల పాటు కారాగారంలో గడిపిన రవికి, గతంలో తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఐబొమ్మ రవి నా దగ్గర రూ. 3 కోట్లు ఉన్నాయి కానీ, కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నా అని కోర్టుకెళ్లడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒకప్పుడు నిర్మాతలకు కోట్లలో నష్టం తెచ్చి, ఇప్పుడు జీవనానికి డబ్బులు లేవనడం విధి విచిత్రం అంటూ కొందరు సెటైర్లు వేస్తుంటే.. మరికొందరు కోర్టు ఈ పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది. సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించిన ఆధారాలు, ఈ నిధులు అక్రమ సంపాదన కిందకు వస్తాయా లేదా అన్న అంశాలపై న్యాయస్థానం స్పష్టతనివ్వాల్సి ఉంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.