iBomma: ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది.. మరో రవి పుట్టుకొచ్చాడా.? అసలేం జరిగిందంటే.?
iBomma: తెలుగు సినీ పరిశ్రమను మరోసారి పైరసీ భయపెడుతోంది.
iBomma: ఐబొమ్మ మళ్లీ వచ్చేసింది.. మరో రవి పుట్టుకొచ్చాడా.? అసలేం జరిగిందంటే.?
Ibomma: తెలుగు సినీ పరిశ్రమను మరోసారి పైరసీ భయపెడుతోంది. కొంతకాలంగా కనిపించకుండా ఉన్న ‘ఐబొమ్మ’, ‘బప్పం టీవీ’ వంటి అక్రమ మూవీ స్ట్రీమింగ్ వెబ్‌సైట్లు మళ్లీ ఇంటర్నెట్‌లో యాక్టివ్ కావడం షాక్‌కి గురి చేస్తోంది. కొత్త వెబ్‌సిరీస్‌లు, సినిమాలు గంటల వ్యవధిలోనే ఈ సైట్లలో దర్శనమిస్తుండటంతో సినీ వర్గాలు షాక్‌కు గురవుతున్నాయి.
అరెస్ట్ తర్వాత మళ్లీ తెరపైకి వచ్చిన ఐబొమ్మ
కొన్ని నెలల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఐబొమ్మ వ్యవహారానికి సంబంధించి కీలక వ్యక్తిగా భావించిన రవిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ పైరసీ నెట్‌వర్క్‌కు పూర్తిగా చెక్ పడిందని పరిశ్రమ భావించింది. అయితే ఇటీవల అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. దేశందాటిపోవద్దని కోర్టు సైతం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఐబొమ్మ దర్శనమివ్వడం విస్మయానికి గురి చేస్తోంది. కొత్త డొమైన్లు, మిర్రర్ లింకులు, వేరే సర్వర్లతో ఐబొమ్మ మళ్లీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. దీనితో పాటు ‘బప్పం టీవీ’, ‘మూవీ రూల్జ్’ వంటి పాత పైరసీ ప్లాట్‌ఫాంలు కూడా మళ్లీ వేగంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. బెయిల్ పై ఉన్న రవి ఈ పని చేయడానికి ధైర్యం చేయడని.. మరో రవి పుట్టుకొచ్చినట్లు అనుమానాలు వస్తున్నాయి.
కొత్త డొమైన్లు..
సైబర్ పోలీసులు ఒక లింక్‌ను బ్లాక్ చేస్తే.. వెంటనే మరో కొత్త వెబ్ అడ్రస్‌తో ఈ సైట్లు మళ్లీ వస్తున్నాయి. ఇదే ఇప్పుడు విచారణ అధికారులకు పెద్ద సవాలుగా మారింది. టెక్నికల్‌గా ట్రేస్ చేయకుండా ఉండేందుకు విదేశీ సర్వర్లు, ప్రాక్సీ నెట్‌వర్క్‌లు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ వెబ్‌సైట్ల వెనుక మళ్లీ అదే గ్యాంగ్ ఉందా? లేక ఐబొమ్మ పేరును ఉపయోగిస్తూ మరో కొత్త నెట్‌వర్క్ రంగంలోకి దిగిందా? అనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే రవి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాతే సైట్లు మళ్లీ యాక్టివ్ కావడం అనుమానాలకు తావిస్తోంది.
కొత్త సినిమాలకు భారీ నష్టం
పైరసీ వల్ల నిర్మాతలకు తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్ల రూపంలో లీక్ అవుతున్నాయి. దీంతో థియేటర్ కలెక్షన్లు తగ్గిపోవడంతో పాటు ఓటీటీ డీల్స్‌పై కూడా ప్రభావం పడుతోంది. చిన్న సినిమాల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లకుండా ఈ అక్రమ సైట్లలో సినిమాలు చూస్తుండటంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ యాంటీ పైరసీ విభాగం పలు ఫిర్యాదులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.




