Chandralekha: భారతదేశంలో తొలి ఖరీదైన సినిమా ఇదే... 1948లోనే 30 లక్షలు వెచ్చించి
భారతీయ చలనచిత్ర చరిత్రను 'చంద్రలేఖ'కు ముందు, ఆ తర్వాత అని విభజించవచ్చు. నేడు వందల కోట్లు వెచ్చించి తీస్తున్న పాన్ ఇండియా సినిమాలకు అసలైన పునాది రాయి 1948లోనే పడింది.
Chandralekha: భారతీయ చలనచిత్ర చరిత్రను 'చంద్రలేఖ'కు ముందు, ఆ తర్వాత అని విభజించవచ్చు. నేడు వందల కోట్లు వెచ్చించి తీస్తున్న పాన్ ఇండియా సినిమాలకు అసలైన పునాది రాయి 1948లోనే పడింది. మద్రాసు నగరం వేసవి సెగలతో అల్లాడుతున్న వేళ.. వెల్లింగ్టన్ థియేటర్ ముందు కిలోమీటర్ల మేర బారులు తీరిన జనం ఒక కొత్త చరిత్రకు సాక్ష్యంగా నిలిచారు. అదే జెమినీ స్టూడియోస్ నిర్మించిన 'చంద్రలేఖ'. లేడీ ఓరియంటెడ్ గా వచ్చిన ఈ సినిమా ఆరోజుల్లో భారీ సంచలనం సృష్టించింది. తమిళ, తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ వెర్షన్‌లో అమెరికా, జపాన్, స్వీడన్ వంటి దేశాల్లో కూడా విడుదలై విజయం సాధించింది.
వాసన్ సాహసం.. 30 లక్షల భారీ వ్యయం
1940- 50 దశకంలో ఒక సినిమా తీయడానికి 2 రెంచి 3 లక్షల వరకు ఖర్చు చేసేవారు. అంతకు మించి బడ్జెట్ అంటే సాధ్యం కాదు. కానీ, జెమినీ సంస్థ అధినేత ఎస్ఎస్ వాసన్ చంద్రలేఖ చిత్రం కోసం ఏకంగా 30 లక్షల రూపాయలు వెచ్చించి సినిమాను నిర్మించారు. అప్పట్లో 30 లక్షలు అంటే ఇప్పుడు 500 కోట్లని చెప్పవచ్చు. అంతేకాదు, ఈ సినిమా ప్రచారం కోసమే రూ. 10 లక్షలు ఖర్చు చేశారంటే ఏ స్థాయిలో ప్రచారం చేశారో అర్థం చేసుకోవచ్చు. భారీ పోస్టర్లు, పాట పుస్తకాలు, పత్రికల్లో కవర్‌పేజీలు ఇలా సినిమాను ఏ విధంగా ప్రచారం చేసుకోవచ్చో ఆ విధంగా చేశారు.
ఐదేళ్ల శ్రమ.. అద్భుతమైన నాణ్యత
సినిమా బడ్జెట్ ఒకెత్తైతే... నిర్మాణం మరో ఎత్తు. సినిమా నిర్మాణం కోసం ఏకంగా ఐదేళ్లు తీసుకున్నారు. కథ నచ్చకపోతే తీసిన సీన్లను పక్కన పెట్టి మరీ మళ్లీ చిత్రీకరించేవారు. రాజకుమారి చంద్రలేఖగా నటిస్తే, రంజన్ విలన్‌గా నటించారు. ఇక ఇందులో ఎం కె రాథ హీరోగా నటించారు. అప్పట్లో ఈ సినిమా జానపద చిత్రాల్లో విజువల్ వండర్‌గా నిలిచింది. ఈ సినిమాలో అన్నింటికన్నా ముఖ్యమైనది డ్రమ్ డ్యాన్స్. ఇది భారతీయ చలనచిత్ర రంగంలో ఓ అద్భుతం అని చెప్పాలి. ఇందులో మొత్తం 200 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. వీరికి సుమారు 6 నెలలపాటు శిక్షణ ఇచ్చారు. చంద్రలేఖ తమిళ సినిమా అయినా... తెలుగులో కూడా సూపర్ హిట్టయింది. విజయవాడలోని మారుతి థియేటర్లో తమిళ తెలుగు వ్యాఖ్యాతల సహకారంతో 25 వారాల పాటు సినిమా ఆడి రికార్డు సృష్టించింది. సినిమా అర్థం కాకున్నా భారీ విజయం సొంతం చేసుకుంది అంటే విజువల్స్ ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
అంతర్జాతీయ ఖ్యాతి
'చంద్రలేఖ' కేవలం తెలుగు, తమిళంలోనే కాదు... దీనిని హిందీలోకి అనువదించి ఉత్తరాదిలోనూ భారీ విజయాన్ని సాధించారు. ఆ తర్వాత ఇంగ్లీష్, జపనీస్ వంటి విదేశీ భాషల్లోకి అనువదించి అమెరికా, జపాన్ వంటి దేశాల్లో ప్రదర్శించారు. ఒక రకంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశం నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిన మొదటి సినిమా ఇదే. ఈ చిత్రం ద్వారానే మద్రాసులో హిందీ సినిమాల నిర్మాణానికి, భారీ బడ్జెట్ చిత్రాలకు బాటలు పడ్డాయి. నేటికీ సినీ ప్రేమికులు 'చంద్రలేఖ'ను ఒక అపురూప కళాఖండంగానే భావిస్తారు. ఈ సినిమాకు ముందు మంగమ్మ శపథం, బాలనాగమ్మ తదితర సూపర్ హిట్ సినిమాల ద్వారా 40 లక్షల రూపాయల వరకు లాభాలు ఆర్జించింది జెమినీ సంస్థ. ఇలా వచ్చిన లాభాలతో చంద్రలేఖ చిత్రాన్ని నిర్మించింది జెమినీ సంస్థ.




