James Bond: జేమ్స్‌బాండ్‌ సినిమాల్లో 00కి అర్థమేంటో తెలుసా?

జేమ్స్‌బాండ్‌ను 007 అని ఎందుకు పిలుస్తారు? ఇందులోని రెండు సున్నాలు, 7కి ఉన్న అసలు అర్థమేంటి? MI6, లైసెన్స్‌ టు కిల్‌, బాండ్‌ సినిమాల వెనుక ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

Balachander
Published on: 15 Sept 2026 3:45 PM IST
James Bond: జేమ్స్‌బాండ్‌ సినిమాల్లో 00కి అర్థమేంటో తెలుసా?
X

James Bond: జేమ్స్‌బాండ్‌ సినిమా మొదలయ్యే ముందు తెరపై కనిపించే ఆ చిన్న వృత్తాకారపు దృశ్యం, వెనుక వినిపించే ప్రత్యేకమైన మ్యూజిక్‌.. వెంటనే బాండ్‌ తుపాకీతో నిలబడటం.. ఇవన్నీ కలిస్తే చాలు, ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఒకే పేరు గుర్తుకొస్తుంది.. 007. అయితే బాండ్‌ను 007 అని ఎందుకు పిలుస్తారు? ఆ రెండు సున్నాలు, చివర్లో ఉన్న 7కి అసలు అర్థమేంటి? ఇదే జేమ్స్‌బాండ్‌ కథలో ఆసక్తికరమైన విషయం.

బాండ్‌ సృష్టికర్త

జేమ్స్‌బాండ్‌ పాత్రను సృష్టించిన రచయిత ఇయాన్‌ ఫ్లెమింగ్‌ రెండో ప్రపంచయుద్ధాన్ని దగ్గరగా చూసిన వ్యక్తి. యుద్ధ సమయంలో జర్నలిస్టుగా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత బ్యాంకింగ్‌ రంగంలోకి వెళ్లారు. అనంతరం నేవీలో రియర్‌ అడ్మిరల్‌కు పీఏగా, లెఫ్టినెంట్‌ కమాండర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. యుద్ధ అనుభవాలు, గూఢచర్య ప్రపంచంపై ఆయనకు ఉన్న పరిజ్ఞానం తర్వాత జేమ్స్‌బాండ్‌ పాత్రకు బలమైన పునాది అయ్యాయి. 1953లో ఫ్లెమింగ్‌ రాసిన తొలి బాండ్‌ నవల ‘కాసినో రాయల్‌’లో జేమ్స్‌బాండ్‌ మొదటిసారి పాఠకులకు పరిచయమయ్యాడు. ‘జేమ్స్‌ బాండ్‌’ అనే పేరును కూడా ఆయన ఒక అమెరికన్‌ పక్షి శాస్త్రవేత్త పేరు నుంచి తీసుకున్నట్లు చెబుతారు. ఫ్లెమింగ్‌ జీవితంతో ముడిపడిన మరో పేరు ‘గోల్డెన్‌ ఐ’. జమైకాలో ఆయనకు ఉన్న బీచ్‌ హౌస్‌ పేరు అదే.

తొలి బాండ్‌ సినిమా

అయితే నవల నుంచి వెండితెరకు రావడానికి బాండ్‌కు మరో 9 సంవత్సరాలు పట్టింది. 1962లో వచ్చిన తొలి సినిమా ‘డాక్టర్‌ నో’లో షాన్‌ కానరీ బాండ్‌గా నటించాడు. ఇప్పటివరకు అధికారిక బాండ్‌ చిత్రాల పరంపరలో 25 సినిమాలు, బాండ్‌ పాత్రలో 7 మంది నటులు కనిపించారు. షాన్‌ కానరీ, డేవిడ్‌ నివెన్‌, జార్జ్‌ లజెన్‌బీ, రోజర్‌ మూర్‌, తిమోతీ డాల్టన్‌, పియర్స్‌ బ్రాస్నన్‌, డేనియల్‌ క్రేగ్‌ తమదైన శైలిలో బాండ్‌ను తెరపై ఆవిష్కరించారు. వీరిలో రోజర్‌ మూర్‌ అత్యధికంగా 7 సార్లు బాండ్‌గా కనిపించారు. అయితే ప్రేక్షకుల అనుభూతి విషయంలో ప్రతి బాండ్‌ ఒకేలా ఉండదు. షాన్‌ కానరీ బాండ్‌ అంటే క్లాసిక్‌ ఆకర్షణ గుర్తుకొస్తుంది. రోజర్‌ మూర్‌ సినిమాల్లో సరదా, వినోదం ఎక్కువగా కనిపిస్తుంది. డేనియల్‌ క్రేగ్‌ మాత్రం బాండ్‌ను మరింత సీరియస్‌గా, భావోద్వేగాలతో కూడిన పాత్రగా చూపించాడు.

భారత్‌లోనూ ఆదరణ

భారత్‌తో బాండ్‌కు ఉన్న అనుబంధం కూడా ప్రత్యేకమే. ‘ఆక్టోపస్సీ’ సినిమా ఇందుకు మంచి ఉదాహరణ. ఇందులో కబీర్‌ బేడీ విలన్‌ బాడీగార్డ్‌గా నటించగా, టెన్నిస్‌ దిగ్గజం విజయ్‌ అమృత్‌రాజ్‌ బ్రిటిష్‌ ఏజెన్సీకి మిత్రుడిగా కనిపించారు. ఉదయ్‌పూర్‌లోని మాన్‌సూన్‌ ప్యాలెస్‌, లేక్‌ ప్యాలెస్‌, జగ్‌ మందిర్‌, శివ్‌ నివాస్‌ ప్యాలెస్‌ వంటి ప్రదేశాలు సినిమాలో కీలకంగా కనిపించాయి. అయితే ఆటోరిక్షా ఛేజ్‌లో కనిపించే ఉదయ్‌పూర్‌ మార్కెట్‌లోని చాలా దృశ్యాలు లండన్‌లోని పైన్‌వుడ్‌ స్టూడియోలో వేసిన సెట్లలో చిత్రీకరించారు.

బాండ్‌ సినిమాలకు హీరోతో పాటు మరో ఆకర్షణ కూడా ఉంది.. క్యూ బ్రాంచ్‌. బాండ్‌కు అవసరమైన విచిత్రమైన గ్యాడ్జెట్లను అందించే విభాగం అది. బూటులో కత్తి, వాచీలో బాంబు, పెన్నులో గన్‌, రిమోట్‌ కంట్రోల్‌తో నడిచే కారు.. అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో పోలిస్తే ఇవన్నీ ప్రేక్షకులకు ఊహకు అందని వస్తువుల్లా అనిపించేవి.

ఇక బాండ్‌ థీమ్‌ మ్యూజిక్‌ కూడా ఒక ప్రత్యేక గుర్తింపు. మాంటీ నోమాన్‌ రూపొందించిన థీమ్‌కు జాన్‌ బారీ సంగీతం అందించడంతో ఆ ఎలక్ట్రిక్‌ గిటార్‌ శబ్దం బాండ్‌ సినిమాలకు శాశ్వత సంతకంగా మారింది. ప్రతి సినిమాలో టైటిల్స్‌తో వచ్చే కొత్త పాటలు, తెరపై కనిపించే కళాత్మక దృశ్యాలు, వెనుక కదిలే మహిళల నీడలు.. ఇవన్నీ కలిసి అప్పటి ప్రేక్షకులకు బాండ్‌ సినిమాలను ఒక ప్రత్యేక మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మార్చాయి.

00 అంటే అర్థం ఇదే

ఇప్పుడు అసలు ప్రశ్నకు వస్తే.. 007లో 00 అంటే ‘లైసెన్స్‌ టు కిల్‌’. అంటే బ్రిటిష్‌ గూఢచార సంస్థలో అవసరమైనప్పుడు హత్య చేయడానికి ప్రత్యేక అనుమతి పొందిన ఏజెంట్లను ‘00’ విభాగంగా చూపిస్తారు. బాండ్‌ ఆ విభాగంలో ఏడో ఏజెంట్‌, అందుకే 007. 006, 009 వంటి ఇతర ఏజెంట్ల ప్రస్తావన కూడా బాండ్‌ కథల్లో కనిపిస్తుంది. బాండ్‌ పనిచేసే సంస్థను సినిమాల్లో MI6గా పిలుస్తారు. ఇది బ్రిటన్‌ విదేశీ గూఢచార వ్యవస్థ అయిన SIS. ఇతర దేశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, భద్రతకు సంబంధించిన ముప్పులను గుర్తించడం, అవసరమైనప్పుడు రహస్య కార్యకలాపాలు నిర్వహించడం ఈ సంస్థకు సంబంధించిన ప్రధాన అంశాలు. అందుకే జేమ్స్‌బాండ్‌ కేవలం ఒక సినిమా హీరో కాదు. యుద్ధం, గూఢచర్యం, సాంకేతికత, అందం, యాక్షన్‌, వినోదం అన్నింటినీ కలిపి దాదాపు 7 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఒక సినిమా బ్రాండ్‌. 007లోని రెండు సున్నాల వెనుక ఉన్న ‘లైసెన్స్‌ టు కిల్‌’ కథ.. బాండ్‌ ప్రపంచాన్ని మరింత ఆసక్తికరంగా మార్చే చిన్న కానీ కీలకమైన వివరమే.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.