Vijay: 'జన నాయగన్' ఫస్ట్ డే కలెక్షన్స్.. అక్కడే తేడా కొట్టింది..!
Vijay: దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం 'జన నాయగన్' ప్రపంచవ్యాప్తంగా ₹80 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది.
Vijay: 'జన నాయగన్' ఫస్ట్ డే కలెక్షన్స్.. అక్కడే తేడా కొట్టింది..!
Jana Nayagan: కోలివుడ్ మాస్ ఐకాన్ దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కావడం, అనేక వాయిదాలు, అడ్డంకుల తర్వాత థియేటర్లలోకి రావడంతో 'జన నాయగన్' సినిమాపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అనుకున్నట్లుగానే ఈ పొలిటికల్ అండ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే సరికొత్త రికార్డులను తిరగరాసింది. తొలి రోజు టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
కోలీవుడ్‌లో ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. తమిళనాడులో మొదటి రోజే 28 నుంచి 30 కోట్ల రూపాయల గ్రాస్ సాధించే దిశగా పయనిస్తోంది. కర్ణాటకలోనూ విజయ్ మాస్ స్టామినాకి తగ్గట్టు డబుల్ డిజిట్ కలెక్షన్లు దాటడం ఖాయంగా కనిపిస్తుండగా, కేరళలో సైతం ఓపెనింగ్స్ అదిరిపోయాయి.
దేశవ్యాప్తంగా చూసుకుంటే తొలిరోజే 50 కోట్లకు పైగా భారీ గ్రాస్ రాబట్టడం ఖాయమైంది. ఇక ఓవర్సీస్‌లోనూ విజయ్ హవా నడుస్తోంది. దాదాపు 3 మిలియన్ డాలర్ల మార్కును అందుకోవడానికి సిద్ధంగా ఉంది. ఓవరాల్‌గా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 80 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్‌ను దున్నుతోంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా కలిస్తే ఈ సంఖ్య మరిన్ని రికార్డులను దాటే అవకాశం ఉంది.
తమిళంలో, ఓవర్సీస్‌లో పరిస్థితి ఇలా ఉంటే... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 'జన నాయగన్' కు తీవ్ర నిరాశే ఎదురైంది. ఇక్కడ విజయ్‌కి మంచి మార్కెట్ ఉన్నప్పటికీ, తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూడటానికి అంతగా ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. మొదటి రోజు తెలుగు డబ్బింగ్ వర్షన్ కేవలం 1.6 నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్‌లోనే ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ కనిపిస్తోంది.
ఈ సినిమాపై తెలుగు ఆడియన్స్ నీళ్లు చల్లడానికి ప్రధాన కారణం 'భగవంత్ కేసరి'. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటించి, సూపర్ హిట్ కొట్టిన 'భగవంత్ కేసరి' చిత్రానికి 'జన నాయగన్' రీమేక్ కావడమే ఇందుకు అసలు కారణం. ఇప్పటికే ఓటీటీలోనూ, టీవీల్లోనూ బాలయ్య మార్క్ 'భగవంత్ కేసరి' మేనియాను, ఆ ఎమోషన్స్‌ను తెలుగు ప్రేక్షకులు పూర్తిగా ఆస్వాదించారు. ఒకసారి చూసి బాగా కనెక్ట్ అయిన కథను, మళ్లీ మరో హీరో డబ్బింగ్ రూపంలో చూడటానికి తెలుగు సినీప్రియులు అస్సలు ఇష్టపడలేదు.
ఒకే కథను మళ్లీ తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపకపోవడంతో తెలుగులో నెగటివ్ టాక్ రావడంతో పాటు థియేటర్ల వద్ద ఆశించిన స్థాయిలో సందడి కనిపించలేదు. తమిళంలో దళపతి విజయ్ కంబ్యాక్, ఫైనల్ మూవీగా 'జన నాయగన్' వసూళ్ల సునామీ సృష్టిస్తున్నప్పటికీ... రీమేక్ ఎఫెక్ట్ వల్ల తెలుగు బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో లేదన్నది మాత్రం వాస్తవం.




