Tollywood: 'పెద్ది' వ్యాఖ్యలతో జాన్వీ కపూర్‌కు తెలుగులో ఛాన్సులు తగ్గాయా? ఆసక్తికర విషయాలు..

Tollywood: దేవర, పెద్ది సినిమాల తర్వాత జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు ఫిల్మ్‌మేకర్లకు నచ్చలేదని, దీంతో ఆమెకు తెలుగులో ఛాన్సులు రావడం లేదని జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది.

Ravi
By Ravi
Published on: 10 Nov 2026 12:38 PM IST
Tollywood
X

Tollywood: 'పెద్ది' వ్యాఖ్యలతో జాన్వీ కపూర్‌కు తెలుగులో ఛాన్సులు తగ్గాయా? ఆసక్తికర విషయాలు..

Tollywood: హిందీలో జాన్వీ కపూర్‌కు పెద్ద హిట్లు లేవు. ఆమె నటించిన చాలా సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. తెలుగులో ఆమె రెండు సినిమాలు చేశారు. అవి 'దేవర', 'పెద్ది'. రెండు సినిమాల్లోనూ గ్లామరస్ పాత్రలు, పాటలకే ఆమెను పరిమితం చేశారని విమర్శలు వచ్చాయి. ఈ సినిమాలు విడుదలైన తర్వాత ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు తెలుగు ఫిల్మ్‌మేకర్లకు నచ్చలేదని, దీంతో ఇప్పుడు ఆమెకు తెలుగులో అవకాశాలు రావడం లేదని టాక్ వినిపిస్తోంది.

'దేవర: పార్ట్ 1' 2024లో విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ కూడా నటించారు. జాన్వీ కెరీర్‌లో ఇదే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా. అయితే ఈ చిత్రంలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదని విమర్శకులు పేర్కొన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' జూన్ 4, 2026న విడుదలైంది. ఇందులో జాన్వీ అచ్చియమ్మ పాత్రలో కనిపించారు.

'పెద్ది' విడుదల తర్వాత ఆమె పాత్రను చూపించిన తీరుపై ప్రేక్షకులు విమర్శలు చేశారు. ఈ వివాదంపై అక్టోబర్ 28న ప్రసారమైన 'కాఫీ విత్ కరణ్ 9'లో వరుణ్ ధావన్‌తో కలిసి పాల్గొన్న జాన్వీ స్పందించారు. సినిమాలో ఆబ్జెక్టిఫికేషన్ తీవ్రంగా ఉందని, ఆ షూటింగ్ ఒక రకంగా 'వేధింపులాంటి అనుభవం' అని అన్నారు. 'ఆ అవమాన భారాన్ని ఎప్పటికీ మోస్తాను' అని చెప్పిన ఆమె, తాను ఇంకా బలంగా ప్రశ్నించి ఉండాల్సిందని పేర్కొన్నారు. దక్షిణాదిలో అరుదుగా మాత్రమే పూర్తి బౌండ్ స్క్రిప్ట్ ఉంటుందని కూడా ఆమె వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ జరిగింది. పాత్ర గురించి తెలిసి సినిమా ఒప్పుకున్నాక ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారని కొందరు నెటిజన్లు అడిగారు. జాన్వీ తర్వాత టీమ్ ఫీడ్‌బ్యాక్ తీసుకుని, ఇటీవల ఒక తమిళ ఇంటర్వ్యూలో తటస్థంగా మాట్లాడారని ఆ రిపోర్ట్ పేర్కొంది. ఇదే సమయంలో రాధికా ఆప్టే, రెజీనా కూడా తెలుగు సినిమాపై వ్యాఖ్యలు చేయడంతో నార్త్-సౌత్ చర్చ తీవ్రమైంది. నిర్మాత SKN వంటివారు ఇండస్ట్రీ గౌరవాన్ని కాపాడాలంటూ స్పందించారు.

తెలుగు నిర్మాతలు, దర్శకులు ఆమె రెమ్యూనరేషన్, డిమాండ్లకు అంగీకరించారని, ఆమెను గ్లామరస్ పాత్రలో చూపించాలనుకున్నారని, ఆ విషయం ఆమెకూ తెలుసని ఆ రిపోర్ట్ చెబుతోంది. ఇంటర్వ్యూలు, టాక్ షోల్లో ఆమె జాగ్రత్తగా మాట్లాడి ఉండాల్సిందని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఏ తెలుగు ఫిల్మ్‌మేకర్ కూడా తమ ప్రాజెక్టుల కోసం జాన్వీని పరిగణించడం లేదని, ఆమెకు తెలుగులో తలుపులు మూసుకుపోయాయని ఆ రిపోర్ట్ పేర్కొంది. అయితే ఈ విషయంపై జాన్వీ కపూర్ లేదా తెలుగు నిర్మాతల నుంచి అధికారిక స్పందన మాత్రం ఇప్పటివరకు రాలేదు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.