Jani Master: శేఖర్ మాస్టర్‌తో విభేదాలు లేవు.. అంతా తప్పుడు ప్రచారం: జానీ మాస్టర్
Jani Master: తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదంపై ప్రెసిడెంట్ సుమలతా దేవి, ఆమె భర్త జానీ మాస్టర్ మీడియా ముందుకు వచ్చారు.
Jani Master: శేఖర్ మాస్టర్‌తో విభేదాలు లేవు.. అంతా తప్పుడు ప్రచారం: జానీ మాస్టర్
Jani Master: తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్‌లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న వివాదాలు, ఆరోపణలపై అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతా దేవి క్లారిటీ ఇచ్చారు. డాన్సర్లకు పారితోషకాల చెల్లింపు, నూతన సభ్యత్వాల విషయంలో ఆమెపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ.. తన భర్త, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌తో కలిసి సోమవారం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు.
మీడియా సమావేశంలో జానీ మాస్టర్ మాట్లాడుతూ.. అసోసియేషన్‌లో జరిగిన అంతర్గత చర్చలపై వస్తున్న వదంతులను తోసిపుచ్చారు. "నిన్న మా యూనియన్ సమస్యలపై చర్చ జరిగింది. అయితే శేఖర్ మాస్టర్ కు, నాకు మధ్య గొడవ జరిగిందని కొన్ని తప్పుడు వార్తలు వచ్చాయి. అందులో ఎలాంటి నిజం లేదు. మేమందరం సోదరులం, యూనియన్ సంక్షేమం కోసమే అందరం కలిసి పని చేస్తున్నాం" అని స్పష్టం చేశారు.
ఈ వివాదాలపై మెగాస్టార్ చిరంజీవి కూడా ఆరా తీశారని జానీ మాస్టర్ వెల్లడించారు. "నేను, శేఖర్ మాస్టర్.. చిరంజీవి గారి షూటింగ్‌లో కలిశాం. పాత పాటల గురించి ఎంతో సరదాగా మాట్లాడుకున్నాం. చిరంజీవి గారే మా అందరికీ స్ఫూర్తి, ఆయన ఎప్పుడూ మా ప్రతిభను ప్రోత్సహిస్తూనే ఉంటారు. శేఖర్ మాస్టర్‌కు ఈ వివాదాలకు ఎలాంటి సంబంధం లేదు" అని తెలిపారు.
అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతా దేవి మాట్లాడుతూ.. 35 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల డాన్సర్స్ అసోసియేషన్‌ను నడపడం అంత సులువు కాదన్నారు. ఏ సమస్య వచ్చినా ప్రెసిడెంట్‌నే బాధ్యులను చేయడం సరికాదన్నారు. యూనియన్‌లో ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు లేవని స్పష్టం చేస్తూ అసలు వివాదానికి గల కారణాలను బయటపెట్టారు.
"గత కార్యవర్గంలోని (మాజీ బాడీ) కొందరు ఇన్‌చార్జ్‌లు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. నిర్మాతల వద్ద డాన్సర్ల పారితోషకం కింద ఒక అమౌంట్ తీసుకుని.. అసోసియేషన్ రికార్డుల్లో మాత్రం తక్కువ అమౌంట్ రాస్తున్నారు. దీనివల్ల సాధారణ డాన్సర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ దారుణాన్ని మేము ప్రశ్నించాం. అవినీతికి పాల్పడిన ఆ ఇద్దరిని మా అసోసియేషన్ కమిటీ నిర్ణయం ప్రకారం సస్పెండ్ చేశాము" అని సుమలత వెల్లడించారు.
సస్పెండ్ అయిన వారికి మద్దతుగా కొందరు సభ్యులు కమిటీకి రాజీనామా చేశారని, ఇప్పుడు వారంతా మళ్లీ కొత్తగా ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని సుమలత తెలిపారు. "జనరల్ బాడీ మీటింగ్ లో మెజారిటీ సభ్యులు కేవలం ఖాళీ అయిన స్థానాలకే ఉప ఎన్నికలు (బై ఎలక్షన్స్) జరపాలని తీర్మానించారు. కానీ ఫెడరేషన్ వారు మాత్రం మొత్తం కార్యవర్గానికి ఎన్నికలు పెట్టాలంటున్నారు, ఇది మా బైలాస్ (నిబంధనావళి) లో లేదు. దీనిపైనే నిన్న సభ్యుల అభిప్రాయం కోసం సీక్రెట్ (రహస్య) ఓటింగ్ నిర్వహించాము. మెజారిటీ సభ్యులు ఉప ఎన్నికలకే మొగ్గు చూపారు. తాము ఫెడరేషన్‌కు వ్యతిరేకం కాదని, ఫెడరేషన్ తమకు కావాలని" ఆమె స్పష్టం చేశారు.




