Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. బహిష్కరణ వేటు!

Jani Master: జానీ మాస్టర్‌పై తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆల్ ఇండియా స్థాయిలో బహిష్కరణ వేటు వేసింది.

Naresh.k
Published on: 18 July 2026 10:18 AM IST
Jani Master
X

Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. బహిష్కరణ వేటు!

Tollywood: టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ముసురుకున్న వివాదం ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో తీవ్ర సంచలనంగా మారింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆయనపై బహిష్కరణ వేటు వేయగా.. జానీ మాస్టర్ ఏకంగా ఫెడరేషన్ పెద్దలపైనే అవినీతి ఆరోపణలు చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇండస్ట్రీ వర్గాల మధ్య డైలాగ్ వార్ పీక్స్‌కు చేరింది.

ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా, సంస్థ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలపై జానీ మాస్టర్‌ను ఆల్ ఇండియా స్థాయిలో ఫిల్మ్ ఫెడరేషన్ నుండి బహిష్కరిస్తున్నట్లు సంస్థ సంచలన ప్రకటన చేసింది. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో జానీ మాస్టర్ యూనియన్ సభ్యులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని, ఆయన ప్రవర్తన సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని ఫెడరేషన్ పేర్కొంది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై జులై 14న జరిగిన అంతర్గత విచారణకు హాజరుకావాలని షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ, జానీ మాస్టర్ హాజరు కాకపోవడంపై ఫెడరేషన్ పెద్దలు మరింత మండిపడ్డారు.

జానీ మాస్టర్‌పై బహిష్కరణ వేటు వేసిన నేపథ్యంలో, భవిష్యత్తులో ఆయన కొరియోగ్రఫీ చేసే ఏ సినిమాకైనా, ప్రాజెక్టుకైనా ఫెడరేషన్ తరఫున ఎలాంటి సహకారం అందించబోమని యూనియన్ స్పష్టం చేసింది. తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఈ సహాయ నిరాకరణ దేశవ్యాప్తంగా కొనసాగుతుందని ప్రకటించింది. రాబోయే 7 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని, బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

ఫెడరేషన్ జారీ చేసిన షోకాజు నోటీసులకు జానీ మాస్టర్ తాజాగా లేఖ రూపంలో అత్యంత ఘాటుగా స్పందించారు. ఫెడరేషన్ పెద్దల తీరును తప్పుబడుతూ ఆయన లేఖలో పలు సంచలన విషయాలను ప్రస్తావించారు. డ్యాన్సర్స్ యూనియన్ అంతర్గత వ్యవహారాల్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జోక్యం చేసుకోవద్దని జానీ మాస్టర్ తేల్చి చెప్పారు.

యూనియన్‌లో జరిగిన అవినీతి ఆరోపణలపై ఇప్పటికే పలువురిపై చర్యలు తీసుకున్నామని వెల్లడిస్తూ.. ఫెడరేషన్ అసలైన అవినీతిపరులను కాపాడుతోందని ఆయన ప్రత్యారోపణ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డ్యాన్సర్స్ యూనియన్‌కు ఉప ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే జనరల్ బాడీ తీర్మానం చేసిందని ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు.

ఇదే తరుణంలో డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, జానీ మాస్టర్ భార్య అయిన సుమలత తీరుపై కూడా ఫెడరేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అసోసియేషన్‌కు సంబంధించిన జనరల్ బాడీ తీసుకునే నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సూచించింది. వ్యక్తిగత ఎజెండాలను పక్కనబెట్టి, సాధారణ డ్యాన్సర్ల ఉపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ప్రకటన, మరోవైపు ఫెడరేషన్ అవినీతిని టార్గెట్ చేస్తూ జానీ మాస్టర్ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్.. ఈ ఇద్దరి మధ్య వివాదం ఎటు దారితీస్తుందోనని సినిమా ఇండస్ట్రీ వర్గాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story