Jaws Movie: స్పీల్‌బర్గ్‌ జాస్‌ మాయాజాలం... షార్క్‌ కనిపించకుండానే గంటసేపు ఉత్కంఠ

హాలీవుడ్‌లో సూపర్‌ హిట్టైన సినిమాల్లో జాస్‌ కూడా ఒకటి. ఈ సినిమా బంపర్‌ హిట్‌ కావడం వెనుక దర్శకుడు స్పీల్‌బర్గ్‌ దర్శకత్వ ప్రతిభ అపారం అని చెప్పాలి. ప్రయోగాత్మకంగా తీసిన జాస్‌ సంచలన విజయం ఎందుకు సాధించిందో తెలుసుకుందాం.

Balachander
Published on: 11 Aug 2026 1:26 PM IST
Jaws Movie: స్పీల్‌బర్గ్‌ జాస్‌ మాయాజాలం... షార్క్‌ కనిపించకుండానే గంటసేపు ఉత్కంఠ
X

Jaws Movie: హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకువచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'జాస్'. 1975లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ సినిమా చరిత్రలోనే సరికొత్త సంచలనానికి తెరతీసింది. అప్పటికి ఇంకా పెద్దగా గుర్తింపు లేని దర్శకుడిగా ఉన్న స్పీల్‌బర్గ్, ఏకంగా రాకాసి చేపను తెరపై సరిగ్గా చూపించకుండానే కేవలం కథనం, కెమెరా పనితనం, నేపథ్య సంగీతంతో ప్రేక్షకులను గంటసేపు భయంతో వణికించారు. ఈ సినిమా విజయంతోనే హాలీవుడ్‌లో నేటికీ కొనసాగుతున్న మోన్‌స్టర్, విపత్తు సినిమాల ట్రెండ్ ప్రారంభమైంది.

అమిటీ ద్వీపంలో సముద్ర వేట

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జూలై 4న జరుపుకోవడానికి సిద్ధమవుతున్న అమిటీ ద్వీపంలో పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు. సరిగ్గా అదే సమయంలో బీచ్‌లో ఈతకు వెళ్లిన ఒక యువతి 'గ్రేట్ వైట్ షార్క్' దాడిలో మరణిస్తుంది. ఊరి పోలీస్ అధికారి బ్రాడీ బీచ్‌ను మూసివేయాలని కోరినా, ఆదాయం పోతుందనే భయంతో మేయర్ అంగీకరించడు. మరో బాలుడు కూడా ఆ చేపకు బలికావడంతో, చివరకు ఆ షార్క్‌ను చంపిన వారికి బహుమతి ప్రకటిస్తారు. లాభం లేదనుకుని పోలీస్ బ్రాడీ, సముద్ర శాస్త్రవేత్త, అనుభవజ్ఞుడైన జాలరి ఈ ముగ్గురూ కలిసి ఒక చిన్న పడవలో సముద్రంలోకి వేటకు వెళ్తారు. ఆ ప్రయాణంలో ఎదురైన భయాందోళనలు, జాలరి మరణం, బ్రాడీ తెలివితో ఆ చేపను పేల్చేయడమే ఈ చిత్ర కథాంశం.

హాలీవుడ్ మాస్టర్ మాయాజాలం...

ప్రఖ్యాత దర్శకుడు ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ చెప్పినట్టు "బల్ల కింద బాంబు ఉండి పేలితే అది ఆశ్చర్యం, అదే బాంబు ఉండి పేలకుండా ఉన్నంతసేపు ప్రేక్షకుడిలో కలిగేదే ఉత్కంఠ" అనే మాటలను ఆయన చెప్పిన సూత్రాన్ని స్పీల్‌బర్గ్ ఈ సూత్రాన్ని అక్షరాలా అమలు చేశారు. సినిమా మొదటి గంట పాటు షార్క్ శరీరాన్ని ఎక్కడా చూపించలేదు. కేవలం సముద్రపు అడుగున కెమెరా కదులుతున్నప్పుడు వచ్చే ఒక ప్రత్యేక నేపథ్య సంగీతం ద్వారానే ఆ ప్రమాదాన్ని సూచించారు. రెండున్నర గంటల ఈ సినిమాలో ఆ మెకానికల్ ప్లాస్టిక్ చేప కనిపించేది కేవలం 15 నిమిషాలు మాత్రమే. కానీ, ఆ 15 నిమిషాల చేపను చూడటం కోసం ప్రేక్షకులు గంటకు పైగా థియేటర్లో సీట్లకు అతుక్కుపోయి కూర్చొని ఉన్నారంటేనే ఆశ్చర్యం. ఇలా గంటపాటు ఉత్కంఠ భరితంగా కథను చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా విజయానికి ఉత్కంఠతే ప్రధాన కారణం. ఇక ఈ సినిమా విజయం తర్వాతే హాలీవుడ్‌లో అనకొండ, గాడ్జిల్లా, అలిగేటర్, డైనోసార్ వంటి అనేక జంతువుల ఆధారిత రోమాంచిత చిత్రాలు వరుసగా పుట్టుకొచ్చాయి.

పర్యావరణంపై పడిన ప్రతికూల ప్రభావం

సినిమాపరంగా 'జాస్' గొప్ప విజయం సాధించినప్పటికీ, నిజజీవితంలో 'గ్రేట్ వైట్ షార్క్' జాతికి ఇది కోలుకోలేని దెబ్బ తీసింది. సాధారణంగా మానవులు షార్క్ ఆహార జాబితాలో ఉండరు. కానీ ఈ సినిమా తెచ్చిన విపరీతమైన భయం కారణంగా, ప్రపంచవ్యాప్తంగా వీటిని విచ్చలవిడిగా వేటాడటం ప్రారంభించి, చివరికి ఈ జీవులను అంతరించిపోయే ప్రమాదంలో పడేశారు. ఏది ఏమైనా, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఒక బెంచ్‌మార్క్‌గా 'జాస్' నేటికీ సినీ ప్రియులను అలరిస్తూనే ఉంది. ఈ సినిమా యూట్యూబ్‌లో కనిపించినపుడు వెంటనే చూసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ సినిమా క్లిప్పింగులను కూడా తెగ చూసేస్తుంటారు ప్రేక్షకులు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story