K Malathi: చేసింది తక్కవ సినిమాలే అయినా... అలనాటి ఆ హీరోయిన్ ఇప్పటికీ గుర్తుంటుంది... ఎందుకంటే
తెలుగు సినిమా రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కె మాలతి. సినీ రంగంలో చేసింది కొన్ని సినిమాలే అయినా... చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాల్లో నటించి మెప్పించారు.
K Malathi: దాదాపు 80 ఏళ్లకు పైబడిన తెలుగు సినిమా ప్రస్థానంలో ఎందరో కథానాయికలు వచ్చి వెళ్లారు. కానీ, కొద్ది సినిమాలతోనే వెండితెరపై చెరగని ముద్ర వేసిన నటీమణులు కొందరే ఉంటారు. ఆ అరుదైన జాబితాలో అగ్రస్థానంలో నిలిచే పేరు 'కె. మాలతి'. నాటి పౌరాణిక, జానపద చిత్రాల శకంలో తన విశిష్టమైన అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారామె.
మాలతి ప్రస్థానం
1926లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించిన మాలతి, చిన్నతనంలోనే సంగీతం, నాటకరంగాలపై మక్కువ పెంచుకున్నారు. 1940లో 'సుమంగళి' చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించినప్పటికీ, 1942లో వచ్చిన 'భక్త పోతన' ఆమె కెరీర్‌కు తొలి పెద్ద మలుపుగా నిలిచింది. అందులో శ్రీనాథుని కుమార్తెగా ఆమె కనబరిచిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 1949లో వెలువడిన 'గుణసుందరి కథ' చిత్రం మాలతిలోని గాయనిని కూడా వెలుగులోకి తెచ్చింది. నాటి రోజుల్లో సొంతంగా పాటలు పాడుకునే నటీమణుల్లో ఆమె ఒకరిగా నిలిచారు. మాలతి సినీ ప్రస్థానంలో అత్యున్నత ఘట్టం 1951లో రూపుదిద్దుకున్న 'పాతాళ భైరవి'. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు సరసన 'ఇందుమతి' రాకుమారిగా ఆమె చేసిన అద్భుత నటన తెలుగు సినీ చరిత్రలోనే ఒక మైలురాయి. ఈ ఒక్క చిత్రంతో ఆమె ప్రజాదరణ శిఖరాగ్రానికి చేరింది.
నటనలో వైవిద్యం మాలతి సొంతం
నటిగా మాలతి వైవిధ్యాన్ని నిరూపించిన అంశం ఆమె పాత్రల ఎంపిక. 1951లో 'పాతాళ భైరవి'లో ఎన్టీఆర్‌కు జోడీగా కథానాయికగా నటించిన ఆమె, కేవలం ఎనిమిదేళ్ల వ్యవధిలోనే, అంటే 1959లో వచ్చిన 'దైవబలం' చిత్రంలో అదే ఎన్టీఆర్‌కు తల్లి పాత్రను పోషించడం ఆమె వృత్తిపరమైన అంకితభావానికి నిదర్శనం. అయితే, 1954లో కన్నడ రసలింగం రాజ్‌కుమార్‌తో కలిసి నటించిన 'కాళహస్తి మహాత్మ్యం' ఆమె చివరి కథానాయిక చిత్రం. ఆ తర్వాత 'అల్లాద్దీన్ అద్భుత దీపం', 'పెళ్లి కానుక', 'మర్యాద రామన్న' వంటి పలు చిత్రాల్లో సహాయ పాత్రల్లో అలరించారు. చివరిగా 1979లో 'శ్రీ వెంకటేశ్వర కళ్యాణం' చిత్రంలో నటించి, దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణానికి స్వస్తి పలికారు. పరిమిత సంఖ్యలోనే సినిమాలు చేసినా, పాత్ర ఏదైనా సరే అందులో జీవించడం మాలతికి ఉన్న ప్రత్యేకత. నాటి స్వర్ణయుగ చిత్రాల తీపి గుర్తుగా ఆమె తెలుగు కళామతల్లి ఒడిలో ఎప్పటికీ చిరస్మరణీయురాలుగానే ఉండిపోయింది.



