Kajal Aggarwal: ఆఫర్స్ కోసం లొంగిపోవద్దు.. తొలిసారి నోరు విప్పిన కాజల్ అగర్వాల్

Kajal Aggarwal: "నటి కాజల్ అగర్వాల్ తన 20 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు.

Naresh.k
Published on: 5 July 2026 12:27 PM IST
Kajal Aggarwal
X

Kajal Aggarwal: ఆఫర్స్ కోసం లొంగిపోవద్దు.. తొలిసారి నోరు విప్పిన కాజల్ అగర్వాల్

Kajal Aggarwal Interview: చిత్ర పరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాలుగా తన నటనతో, చందమామ లాంటి అందంతో కోట్ల మంది ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు కాజల్ అగర్వాల్ . టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. త్వరలోనే ‘ది ఇండియా స్టోరీ’ అనే ఓ విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, కాజల్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, కెరీర్ తొలినాళ్లలో ఎదురైన బాడీ షేమింగ్ సవాళ్లు , బికినీ సీన్స్‌పై నో చెప్పడం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

గ్లామర్ ప్రపంచంలో ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా నిలబడాలంటే కొన్నిసార్లు నిర్మొహమాటంగా నో చెప్పడం నేర్చుకోవాలని కాజల్ నేటి తరం నటీనటులకు సూచించారు. ప్రతీ అవకాశానికి తల ఊపాల్సిన అవసరం లేదని, మన మనసుకు నచ్చని పనిని ధైర్యంగా వదిలేయాలని చెప్పారు. సినిమా ఎంత పెద్దదైనా, అవకాశం ఎంత గొప్పదైనా నా వ్యక్తిగత పరిమితులను నేను ఎప్పుడూ దాటలేదు. నాకు అసౌకర్యం కలిగించే ఏ పాత్రను నేను అంగీకరించలేదు. ఉదాహరణకు, తెరపై బికినీ ధరించడం లేదా హద్దులు దాటిన ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించడం నాకు అస్సలు నచ్చదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. అందుకే అలాంటి సీన్స్ ఉన్నప్పుడు క్షమించండి, నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాలేను అని సూటిగా ముఖం మీదే చెప్పేదాన్ని.

తాను పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాటి రోజులను గుర్తు చేసుకుంటూ.. రెండు దశాబ్దాల క్రితం సినిమా ప్రపంచం చాలా భిన్నంగా ఉండేది. అప్పట్లో నేటిలా సోషల్ మీడియా విమర్శల జోరు లేదు. కానీ, నటీనటుల శారీరక రూపురేఖలకు సంబంధించిన కొన్ని కఠినమైన నియమాలు ఉండేవి. కెరీర్ తొలినాళ్లలో కొంతమంది దర్శకులు నా లుక్ మార్చుకోవాలని పదే పదే ఒత్తిడి తెచ్చేవారు. కొన్ని ప్రాజెక్టుల కోసం బరువు పెరగాలని, మరికొన్ని సినిమాల కోసం బరువు తగ్గాలని షరతులు పెట్టేవారు అని కాజల్ వివరించారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో యువ నటులపై ఒత్తిడి అనూహ్యంగా పెరిగిపోయిందని, నిరంతరం వారు ఎదుర్కొనే ట్రోలింగ్, విమర్శలు చూస్తుంటే తనకు చాలా జాలేస్తుందని కాజల్ ఆవేదన వ్యక్తం చేశారు. తన రాబోయే చిత్రం 'ది ఇండియా స్టోరీ' గురించి కాజల్ మాట్లాడుతూ, ఈ సినిమా కేవలం ఒక కమర్షియల్ కథ మాత్రమే కాదని, సమాజంలో ఒక ముఖ్యమైన మార్పుకు నాంది అని పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్ట్ కోసం చేసిన రీసెర్చ్ వల్ల మన దేశంలో ఆహార భద్రతకు సంబంధించిన ఎన్నో నగ్న సత్యాలు తనకు తెలిశాయని ఆమె వెల్లడించారు. ఈ సినిమా స్క్రిప్ట్ చదివిన తర్వాత, ఆ ప్రభావంతో తన వ్యక్తిగత, కుటుంబ జీవనశైలిలో కూడా ఆహారాన్ని వృథా చేయకుండా పలు మార్పులు చేసుకున్నట్లు చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఇంతటి సున్నితమైన అంశంపై ఈ చిత్రం ద్వారా సమాజంలో మంచి అవగాహన వస్తుందని కాజల్ బలంగా నమ్ముతున్నారు.

ఒక ఆఫర్ మనకు నచ్చినట్లు జరిగితే ఓకే, ఒకవేళ అది చేజారితే అంతకంటే మంచి అవకాశం మనకోసం ఎదురుచూస్తోందని భావించాలి అంటూ కాజల్ చెప్పిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో హైలైట్‌గా మారాయి. రెండు దశాబ్దాలు గడిచినా క్రేజ్ తగ్గని ఈ చందమామ.. 'ది ఇండియా స్టోరీ'తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story