Kajal Aggarwal: భర్తతో బ్రేకప్.. ఇతరులతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీలో ఊహించని ట్విస్ట్

కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లూతో ప్రేమలో పడిన తర్వాత విడిపోయిన విషయాన్ని తాజాగా వెల్లడించింది. స్నేహితుల పెళ్లిలో పరిచయమైన వీరిద్దరూ కొన్నేళ్లు ప్రేమించుకుని, ఆ తర్వాత విడిపోయి ఇతరులతో డేటింగ్ చేశారు.

CR Reddy
Published on: 16 Nov 2026 9:35 AM IST
Kajal Aggarwal, Gautam Kitchlu
X

Kajal Aggarwal, Gautam Kitchlu

Kajal Aggarwal: టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కాజల్ అగర్వాల్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. భర్త గౌతమ్ కిచ్లూతో తన ప్రేమ ప్రయాణం మొదట్లో అనుకున్నంత సాఫీగా సాగలేదని వెల్లడించింది. ఇద్దరూ ఒకప్పుడు విడిపోయారని, ఆ తర్వాత ఇతరులతో డేటింగ్ చేసినట్లు చెప్పింది. అయితే చివరికి తమ బంధం విలువ తెలుసుకుని మళ్లీ ఒక్కటయ్యామని వివరించింది.

స్నేహితుల పెళ్లిలో పరిచయం

హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ తన ప్రేమకథ గురించి మాట్లాడింది. ఓ స్నేహితుడి పెళ్లిలో ఉమ్మడి స్నేహితుల ద్వారా గౌతమ్ పరిచయమయ్యాడని చెప్పింది. సుమారు 13 ఏళ్ల క్రితమే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందని వెల్లడించింది. కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత ఇద్దరూ విడిపోయారు. అయినప్పటికీ స్నేహితులుగా కొనసాగారు. ఆ సమయంలో ఇద్దరూ వేర్వేరు వ్యక్తులతో డేటింగ్ చేసినట్లు కాజల్ తెలిపింది.

లాక్‌డౌన్‌లో మారిన ఆలోచనలు

విడిపోయిన తర్వాత కూడా ఒకరి జీవితంలో మరొకరు ముఖ్యమైన వ్యక్తులుగానే ఉన్నారని కాజల్ చెప్పింది. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో తమ ఆలోచనలు మారాయని వివరించింది. అప్పటివరకు పని, వృత్తిపరమైన బాధ్యతలతో బిజీగా ఉండేవాళ్లమని, లాక్‌డౌన్ సమయంలో వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టే అవకాశం దొరికిందని తెలిపింది. కొన్ని వారాల పాటు కలుసుకోలేకపోవడంతో ఒకరితో ఒకరు ఉండాలనే కోరిక ఎంత బలంగా ఉందో అర్థమైందని చెప్పింది.

పెళ్లి చేసుకో.. లేదంటే గుడ్‌బై

మళ్లీ కలిసిన తర్వాత ఈసారి తమ బంధంపై స్పష్టత ఉండాలని కాజల్ భావించిందట. గౌతమ్‌తో మాట్లాడుతూ.. 'ఈసారి పెళ్లి చేసుకో.. లేదంటే గుడ్‌బై' అని తేల్చి చెప్పినట్లు నవ్వుతూ గుర్తు చేసుకుంది. అప్పటికే ఒకరినొకరు ఎన్నో ఏళ్లుగా తెలుసుకోవడంతో కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదని భావించామని చెప్పింది. 2020 జూన్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. అదే ఏడాది అక్టోబర్ 30న ముంబైలో కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

2022లో తల్లిదండ్రులుగా ప్రమోషన్..

కరోనా ఆంక్షల సమయంలోనే తమ పెళ్లి వేడుకను నిరాడంబరంగా నిర్వహించుకున్నామని కాజల్ తెలిపింది. పెళ్లైన కొంతకాలానికే తమ జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలైందని చెప్పింది. 2022 జనవరిలో గర్భం దాల్చిన విషయాన్ని ప్రకటించిన ఈ జంట.. అదే ఏడాది ఏప్రిల్ 19న కుమారుడు నీల్‌కు జన్మనిచ్చింది. ఇటీవల 'రామాయణం'లో రావణుడి భార్య మండోదరి పాత్రలో కనిపించిన కాజల్.. తాజా ఇంటర్వ్యూలో తన ప్రేమ, పెళ్లి ప్రయాణాన్ని పంచుకోవడంతో ఈ విషయాలు మరోసారి చర్చకు వచ్చాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.