Kama Sutra Movie Controversy: భారతీయ సినీచరిత్రలో అతిపెద్ద వివాదాన్ని సృష్టించిన సినిమా ఏంటో తెలుసా?

సినిమాలో కథకు తగిన విధంగా శృంగారం ఉండటం వేరు... అసలు శృంగారాన్నే సినిమాగా తీయాలనుకోవడం వేరు. ఈ అంశాన్ని బలంగా చెప్పాలని భావించిన మీరా నాయర్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

Balachander
Published on: 2 July 2026 8:34 AM IST
Kama Sutra Movie Controversy: భారతీయ సినీచరిత్రలో అతిపెద్ద వివాదాన్ని సృష్టించిన సినిమా ఏంటో తెలుసా?
X

Kama Sutra Movie Controversy: భారతీయ సినీ చరిత్రలో ఎన్నో వివాదాస్పద సినిమాలు వచ్చాయి. కానీ, ఒక సినిమా మాత్రం కేవలం ఇక్కడి సమాజాన్నే కాదు, ఏకంగా ప్రభుత్వాన్ని, సెన్సార్ బోర్డును ముప్పతిప్పలు పెట్టింది. ప్రముఖ ఇండో-అమెరికన్ దర్శకురాలు మీరా నాయర్ తెరకెక్కించిన కామసూత్ర: ఎ టేల్ ఆఫ్ లవ్ చిత్రం భారతీయ చలనచిత్ర రంగాన్నే కుదిపేసిన అతిపెద్ద వివాదంగా నిలిచింది. దేశంలో లైంగికత అనే అంశాన్ని నిషిద్ధంగా చూసే రోజుల్లో, ఈ కథను సినిమాగా మార్చడానికి మేకర్స్ ప్రభుత్వ అధికారులను ఎలా బురిడీ కొట్టించారో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

మాయ అండ్ తార పేరుతో దొంగ నాటకం!

భారతదేశంలో ఈ సినిమా షూటింగ్‌కు ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో, దర్శకురాలు మీరా నాయర్ ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. సినిమా అసలు టైటిల్‌ను దాచేసి, కథలోని ఇద్దరు ప్రధాన పాత్రల పేర్లయిన మాయ అండ్ తార అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ ప్రారంభించారు. సాంస్కృతిక సంఘాలు ఈ సినిమాపై ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వ అధికారులు తనిఖీలకు వచ్చేవారు. ఆ సమయంలో మేకర్స్ అసలు సీన్లను దాచేసి, ఇది కేవలం 'ఉత్తరన్' అనే కథ ఆధారంగా పీరియడ్ డ్రామాగా తీస్తున్నట్లు నకిలీ సీన్లు నటించి చూపించేవారు. ఒకవేళ అధికారులకు అసలు విషయం లీక్ అయితే, పని జరగడం కోసం భారీగా లంచాలు ఇచ్చి మేనేజ్ చేసేవారని సమాచారం.

నిలిచిపోయిన విడుదల ... బాక్సాఫీస్ ఫలితం

సినిమా అంతా పూర్తి చేసి సెన్సార్ బోర్డు ముందుకు తెచ్చినప్పుడు అసలు కథ బయటపడింది. దాంతో భారత సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించి, పూర్తిగా బ్యాన్ చేసింది. కేవలం భారతదేశంలోనే కాదు, పొరుగు దేశమైన పాకిస్తాన్‌లోనూ ఈ సినిమాపై నిషేధం విధించారు. 16వ శతాబ్ధానికి చెందిన శృంగార, ప్రేమకథతో తెరకెక్కిన ఈ కామసూత్ర... భారీ వివాదాల నడుమ విదేశాల్లో విడుదలైనప్పటికీ... అక్కడ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను సాధించలేకపోయింది. మీరా నాయర్ కెరీర్‌లోనే ఇదొక బలహీనమైన చిత్రంగా మిగిలిపోయింది.

కళకు, శృంగారానికి మధ్య ఉన్న సన్నని గీతను దాటి, కేవలం వివాదాలతోనే పబ్లిసిటీ సాధించాలనుకున్న ఈ ప్రయత్నం చివరికి సినిమాను థియేటర్ల వరకు కూడా రానివ్వలేకపోయింది. ప్రభుత్వ కళ్లు కప్పి సినిమా తీసినా, ప్రేక్షకుల ముందుకు వచ్చేసరికి చట్టం ముందు మోకరిల్లక తప్పదని ఈ 'కామసూత్ర' వివాదం నిరూపించింది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story