Kanchukota Movie: కంచుకోటలో సరిలేరు నీకెవ్వరూ... దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం

1967లో వచ్చిన కంచుకోట సినిమాలోని ‘సరిలేరు నీకెవ్వరూ’ పాట ప్రత్యేకమనే చెప్పాలి. ఒకే పాటలో రెండు భిన్న స్వభావాలను చూపించిన దర్శకుడి ప్రతిభ, క్లైమాక్స్ షాట్ వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం.

Balachander
Published on: 15 Aug 2026 2:48 PM IST
Kanchukota Movie: కంచుకోటలో సరిలేరు నీకెవ్వరూ... దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం
X

Kanchukota Movie: తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్ చిత్రాలకు కొదవు లేదు. అందులో 1967లో విడుదలైన 'కంచుకోట' చిత్రం ఒకణిరత్నం. సాధారణంగా పాతకాలపు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ అంటే ఎల్.ఆర్. ఈశ్వరి గొంతు, తెరపై జ్యోతిలక్ష్మి లేదా జయమాలిని వంటి నర్తకీమణుల క్లబ్ డ్యాన్సులు, ద్వంద్వార్థాల సాహిత్యం గుర్తుకు వస్తాయి. అప్పట్లో కుటుంబ సమేతంగా చూడటానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండేవి. కానీ, కంచుకోట చిత్రంలోని 'సరిలేరు నీకెవ్వరూ...' పాట మాత్రం పూర్తి భిన్నమైనది. కేవలం సాహిత్యంతోనే కాకుండా, దర్శకత్వ ప్రతిభతో ఒకే పాటలో ఇద్దరి భిన్నమైన ప్రవర్తనలను కళ్లకు కట్టిన తీరు ఆనాటి సినీ మహామహుల ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనం.

ఒకే పాట ... రెండు విరుద్ధ స్వభావాలు

ఈ చిత్రంలో మహారాజుగా నాగయ్య నటించగా, ఆయన తమ్ముడిగా ఉదయకుమార్ నటించారు. అన్న ఎంతటి ధర్మపరుడో, ఉదాత్త గుణవంతుడో... తమ్ముడు అంతటి వ్యసనపరుడు, స్త్రీలోలుడు. ఈ ఇద్దరి విరుద్ధ మనస్తత్వాలను ఒకే వేదికపై, ఒకే పాట ద్వారా వర్ణించడం ఈ పాటలోని అసలైన విశేషం. కవి రాసిన పల్లవిలోనే ఇద్దరి భావాలు స్పష్టంగా కనిపిస్తాయి. "సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకరా..." అనే మొదటి వాక్యం ధర్మపరుడైన మహారాజు నాగయ్యను ఉద్దేశించి గౌరవంగా పాడేది. తర్వాతి వాక్యమైన "సరిలేరు నీకెవ్వరూ రతిరాజ సుందరా..." అనేది వ్యసనాల్లో తేలియాడే తమ్ముడు ఉదయకుమార్‌ను ఉద్దేశించి పాడేది. చరణాలలో కూడా కవి విరుద్ధ భావాలను ఎంతో అర్థవంతంగా అమర్చారు.

దర్శకత్వ వైభవం ... సంభ్రమాశ్చర్యపరిచే క్లైమాక్స్ షాట్

పాట చూడని వారికి ఇందులో ఉన్న విశేషం కేవలం కాగితం మీద చదివితే అర్థం కాకపోవచ్చు. కానీ తెరపై చూస్తుంటే నృత్య వైభవం, భావుకత కలగలిసి ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. ముఖ్యంగా ఈ పాట చివరి సన్నివేశం దర్శకుడి అపారమైన ప్రతిభకు అద్దం పడుతుంది. పాట చివరి ఘట్టంలో మద్యం మత్తులో తూలుతున్న తమ్ముడు "నీదు పాదాల సాక్షిగా... నీవే దిక్కు, నీవే రక్ష" అంటూ ఆవేశంతో వేశ్య కాళ్లపై పడటానికి సిద్ధపడతాడు. అప్పటికే నాట్యశాలకు మహారాజు ప్రవేశిస్తాడు. మహారాజును చూసి భయంతో ఆ వేశ్య పక్కకు తప్పుకుంటుంది. మద్యం మత్తులో ఉన్న తమ్ముడు వేశ్య కాళ్లపై పడుతున్నాననుకుని, పక్కనే నిలబడిన సొంత అన్న కాళ్లపై పడతాడు. ఒకే ఒక్క షాట్‌తో తమ్ముడి పతనాన్ని, అన్న పట్ల ఉండాల్సిన గౌరవాన్ని, కాలం ఆడే విచిత్ర నాటకాన్ని ఎంతో సహజంగా, అర్థవంతంగా చిత్రీకరించడం నాటి దర్శకుల మేధస్సుకు నిదర్శనం. ద్వంద్వార్థాలు లేకుండా ఒక ఐటెమ్ సాంగ్‌ను ఇంతటి కళాత్మకంగా, సందేశాత్మకంగా మలచడం నిజంగా అద్భుతం!

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story