Kismet: దేశంలో కోట్లు కాదు కోటి కొల్లగొట్టిన తొలి సినిమా... మొదటి యాంటీ హీరో కూడా మూవీ ఇదే

దేశంలో కోటి రూపాయలు వసూలు చేసిన తొలి సినిమా గురించిన విశేషాలను తెలుసుకుందాం.

Balachander
Published on: 29 May 2026 4:11 PM IST
Kismet: దేశంలో కోట్లు కాదు కోటి కొల్లగొట్టిన తొలి సినిమా... మొదటి యాంటీ హీరో కూడా మూవీ ఇదే
X

Kismet: ఈరోజుల్లో సినిమా ద్వారా కోటి సంపాదన పెద్ద కష్టం కాదు. ఎంత చిన్న సినిమా అయినా సరే కోటి వసూళ్లు చేయడం పెద్ద ఇబ్బంది కాదు. ఈరోజుల్లో టాప్‌ సినిమా అంటే కనీసం వెయ్యి నుంచి రెండు వేల కోట్లు వసూలు చేస్తున్నాయి. కనీసం యావరేజ్‌ అన్నా రెండు మూడు వందల కోట్లు గ్యారెంటీ. కానీ, సినిమా ఇండస్ట్రీ ఇంత విశాలంగా లేని రోజుల్లో, సినిమా పరిజ్ఞానం గురించి పెద్దగా తెలియని రోజుల్లో ఇంకా చెప్పాలంటే స్వాతంత్య్రం రాని రోజుల్లో రిలీజైన సినిమా కోటి రూపాయలు వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు. బ్రిటీషర్ల నుంచి ఎదురైన సమస్యలను ఎదుర్కొని సినిమా... కథలో అంతర్లీనంగా దేశభక్తిని నింపి కోటి రూపాయలకు పైగా వసూలు సాధించింది. ఆ సినిమా ఏదో కాదు బాలీవుడ్‌లో క్లాసిక్‌గా ముద్రపడిన కిస్మత్‌. ఈ సినిమా 1943లో విడుదలైంది. వెండితెరకు మొదటి యాంటీ హీరోను కూడా పరిచయం చేసింది.

రూ. 2 లక్షల బడ్జెట్.. రూ. 1.65 కోట్ల కలెక్షన్లు

బాంబే టాకీస్‌ బ్యానర్‌లో జ్ఞాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో భారీగా రికార్డులు సృష్టించింది. సినిమా నిర్మాణం కోసం ఆ రోజుల్లోనే 2 లక్షలు ఖర్చు చేశారు. సినిమా నిర్మాణం పూర్తయ్యాక పలు ఇబ్బందులు ఎదుర్కొని 1943లో సినిమాను రిలీజ్‌ చేశారు. ఇలా రిలీజ్‌ చేసిన ఈ సినిమా ఏకంగా రూ. 1.65 కోట్లు వసూలు చేసింది. అంటే పెట్టిన పెట్టుబడికి వందల రెట్లు లాభం ఆర్జించింది ఈ సినిమా. ఈ మూవీ కోల్‌కతాలోని ప్రఖ్యాత రాక్సీ సినిమాస్‌ థియేటర్లో మూడు సంవత్సరాల 8 నెలలపాటు ఆడింది. అదీ హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో. ఈ సినిమా రికార్డు 32 సంవత్సరాల పాటు చెక్కచెదరకుండా ఉండటం విశేషం.

అశోక్ కుమార్ ... భారత తొలి 'యాంటీ హీరో'

1943కి ముందు భారతీయ సినిమాలు వచ్చినా...అందులో హీరో అంటే నీతి, నిజాయితీ, ఆదర్శాలు ఉన్న వ్యక్తులుగానే చూపించారు. కానీ, మొదటిసారి ఈ కిస్మత్‌ ఆ సంప్రదాయాన్ని బద్దలు కొట్టింది. ఇందులో హీరో అశోక్‌ కుమార్‌ జేబుదొంగగా నటించారు. వినూత్నమైన యాంటీ హీరో పాత్రను, అశోక్‌ కుమార్‌ స్టైలిష్‌ నటనకు నాటితరం ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాతో అశోక్‌ కుమార్‌ తొలితరం స్టార్‌ హీరోగా ముద్ర వేసుకున్నారు. ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉండటం విశేషం.

బ్రిటిష్ వారి కళ్లలో దుమ్ము కొట్టిన దేశభక్తి గీతం

ఈ సినిమా కేవలం కమర్షియల్ హిట్ మాత్రమే కాదు, అప్పట్లో జరుగుతున్న స్వాతంత్య్ర ఉద్యమానికి ఒక ఆయుధంగా పనిచేసింది. ఈ చిత్రంలో కవి ప్రదీప్ రాసిన "దూర్ హట్టో ఏ దునియా వాలో హిందుస్తాన్ హమారా హై" అనే పాట బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించింది. బ్రిటీషర్ల పరిపాలన కాలంలో దేశంలోని మీడియా, సినిమాపై విపరీతమైన సెన్సార్‌ ఆంక్షలు ఉన్నాయి. పైగా అది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం కావడంతో పాట రాసిన కవి ప్రదీప్‌ చాకచక్యంగా బ్రిటీష్‌వారికి తాము వ్యతిరేకం కాదు, జర్మని, జపాన్‌ దేశాలకు వ్యతిరేకం అని చెబుతూ ఆయా దేశాలకు వ్యతిరేకంగా కూడా కొన్ని పదాలను జొప్పించారు. కానీ, వాటి అసలు అర్థం బ్రిటీషర్లను తరిమికొట్టండి అనే. ఈ పాటను పూర్తిగా అర్థం చేసుకోలేని బ్రిటీషర్లు పాటపై నిషేధం విధించకుండా అనుమతించారు. కథ కథనంతో పాటు దేశభక్తిని అణువణువున నింపి పాటలు ఉండటంతో సినిమా బంపర్‌ హిట్టయింది. భారతీయ సినిమా చరిత్ర పుటల్లో మరిచిపోలేని మైలురాయిగా నిలిచిపోయింది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story