'పెద్ది' వివాదంపై అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు.. క్రియేటివిటీని చంపేస్తున్నారా అంటూ ప్రశ్నల వర్షం!
Anantha Sriram: 'పెద్ది' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ, ఈ సినిమా చుట్టూ జరుగుతున్న ఒక వివాదం మాత్రం నెట్టింట ఇంకా ముదురుతూనే ఉంది.
'పెద్ది' వివాదంపై అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు.. క్రియేటివిటీని చంపేస్తున్నారా అంటూ ప్రశ్నల వర్షం!
Anantha Sriram: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ, ఈ సినిమా చుట్టూ జరుగుతున్న ఒక వివాదం మాత్రం నెట్టింట ఇంకా ముదురుతూనే ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్ జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్ర చిత్రణపై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఈ వివాదంపై స్పందిస్తూ దర్శకుడి సృజనాత్మకతకు మద్దతుగా నిలిచారు.
అచ్చియమ్మ పాత్రపై వివాదం.. క్షమాపణలు చెప్పిన బుచ్చిబాబు
దర్శకుడు బుచ్చిబాబు సన రూపకల్పన చేసిన అచ్చియమ్మ పాత్ర కేవలం గ్లామర్ కోసమే అన్నట్టుగా ఉందని, ఆమె పాత్రకు కథలో సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం ఒక వస్తువులా చూపించారంటూ ఆన్‌లైన్‌లో కొందరు ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై దర్శకుడు బుచ్చిబాబు సన సానుకూలంగా స్పందిస్తూ.. ప్రేక్షకుల మనోభావాలను గౌరవిస్తానని, ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే క్షమాపణలు చెప్తానని ప్రకటించారు. అంతేకాకుండా, ఆడియన్స్‌కు నచ్చని కొన్ని భాగాలను సినిమాలో మార్చబోతున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
దర్శకుడి ఊహకే స్వేచ్ఛ లేకపోతే ఎలా?.. అనంత శ్రీరామ్ ఆగ్రహం
ఆదివారం జరిగిన 'పెద్ది' సినిమా విజయోత్సవ సభలో అనంత శ్రీరామ్ మాట్లాడుతూ, ఈ మార్పులు చేయడంపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ప్రేక్షకుల అభిప్రాయాలను నేరుగా తప్పుబట్టకపోయినా, ప్రజాభిప్రాయానికి భయపడి దర్శకులు తమ కళాత్మక నిర్ణయాలను మార్చుకోవాల్సి రావడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. "ఒక పాత్ర అనేది ఒక రచయిత లేదా దర్శకుడి ఊహ నుంచి పుడుతుంది. సినిమా అనేది పూర్తిగా మేకర్స్ ఆలోచనలకు ప్రతిరూపం. ఇప్పుడు సమాజంలో కేవలం కొన్ని పద్ధతుల్లోనే పాత్రలను చూపించాలనే నియమాలు పెట్టడం సరికాదు" అని ఆయన పేర్కొన్నారు.
డిజిటల్ మీడియా పెరిగిన తర్వాత ప్రతి చిన్న విషయానికి దర్శకులు తమ సృజనాత్మకతను సమర్థించుకోవాల్సి రావడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "దర్శకులు తమకు నచ్చినట్టు కనీసం ఊహించుకోలేకపోతే, మనం సృజనాత్మకతను ఖూనీ చేసినట్టే అవుతుంది" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బుచ్చిబాబు క్షమాపణ వెనుక అసలు కారణం ఇదే!
సినిమాల్లో ఆకర్షణ, శృంగారం లేదా ప్రేమను చూపించేటప్పుడు ప్రేక్షకులు ఒక్కోదానికి ఒక్కోలా స్పందిస్తారని, కళకు , అసభ్యతకు మధ్య ఉన్న గీతను ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తారని అనంత శ్రీరామ్ విశ్లేషించారు. బుచ్చిబాబు నెటిజన్ల విమర్శలతో ఏకీభవించి క్షమాపణ చెప్పలేదని, కేవలం ప్రేక్షకుల పట్ల ఉన్న గౌరవం , సున్నితత్వం వల్లే ఆయన ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో బోమన్ ఇరానీ, దివ్యేందు, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అయినప్పటికీ, ఈ క్యారెక్టర్ వివాదం టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.




