Madhubala: ఆ నటి మరణించాక శరీరంపై అత్తరు... ఇప్పుడు ఆ సమాధే లేకుండా పోయిందట
దిగ్గజ నటి మధుబాల మరణం తర్వాత ఆమె తండ్రి నిర్మించిన పాలరాతి సమాధి ఏమైంది? అంత్యక్రియల సమయంలో అత్తరు పోయించిన తండ్రి ప్రేమ, సమాధి తొలగింపు వెనుక ఉన్న విషాద ఘటనలు తెలుసుకుందాం.
Madhubala: వెండితెరపై అందంతో, అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన నటి మధుబాల. ఆమె సినిమాలు, వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటికీ ఎన్నో విషయాలు చర్చకు వస్తుంటాయి. అయితే ఆమె మరణం తర్వాత జరిగిన ఒక సంఘటన మాత్రం హృదయాన్ని కలచివేస్తుంది. కన్న కూతురిపై అపారమైన ప్రేమతో తండ్రి నిర్మించిన పాలరాతి సమాధి చివరకు కనుమరుగైంది. అంతేకాదు.. మధుబాల అంత్యక్రియల సమయంలో ఆమె శరీరంపై, సమాధిలో అత్తరు పోసిన విషయాన్ని తాజాగా ఆమె సోదరి మధుర్ భూషణ్ గుర్తుచేసుకున్నారు.
కూతురి మరణంతో కుంగిపోయిన తండ్రి
మధుబాల 1969 ఫిబ్రవరి 23న కేవలం 36 ఏళ్ల వయసులో గుండె సంబంధిత సమస్యలతో కన్నుమూశారు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తండ్రి అత్వావుల్లా ఖాన్‌కు ఈ మరణం తీరని విషాదాన్ని మిగిల్చింది. మూడు గుండెపోట్లు, పక్షవాతం, తీవ్రమైన మధుమేహం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కుమార్తెను కోల్పోయిన బాధ నుంచి ఆయన బయటపడలేకపోయారు. మధుబాల మరణించిన తర్వాత ప్రతిరోజూ ముంబైలోని జుహు ముస్లిం శ్మశానవాటికకు వెళ్లేవారు. అక్కడ కుమార్తె సమాధి పక్కన కుర్చీలో గంటల తరబడి కూర్చుని గడిపేవారు. తన కూతురిపై ఉన్న ప్రేమను చాటుకునేందుకు సమాధిని ప్రత్యేకంగా పాలరాతితో నిర్మించారు.
అంత్యక్రియల్లో అత్తరు పోయించిన తండ్రి
మధుబాల అంత్యక్రియల సమయంలో జరిగిన ఒక అరుదైన విషయాన్ని ఆమె సోదరి మధుర్ భూషణ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కూతురిని ఖననం చేసే సమయంలో ఆమె శరీరంపై, సమాధి లోపల కూడా తండ్రి పెద్ద మొత్తంలో అత్తరు పోశారట. ఆ సువాసన నెలల తరబడి శ్మశానవాటిక పరిసరాల్లో ఉండిపోయిందని మధుర్ గుర్తుచేసుకున్నారు. సాధారణంగా ముస్లిం అంత్యక్రియల సంప్రదాయాల్లో ఇలాంటి పద్ధతి ఉండదని ఆమె తెలిపారు. అయినప్పటికీ తన కుమార్తెపై ఉన్న ప్రేమతో తండ్రి అలా చేశారని వివరించారు. సమాధి పైభాగంతో పాటు పక్కలను కూడా పాలరాతితో కప్పించారు. సాధారణంగా మట్టితో ఉండే సమాధిని తన కూతురి కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
తండ్రి మరణం తర్వాత సమాధి కూల్చివేత
1975లో అత్వావుల్లా ఖాన్ మరణించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. స్థానిక అధికారులు సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందనే కారణంతో పాలరాతి నిర్మాణాన్ని తొలగించారు. దీంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లినప్పుడు మధుబాల సమాధిని గతంలో ఉన్న రూపంలో గుర్తించడం కూడా కష్టమైంది. 2010లో జుహు ముస్లిం శ్మశానవాటికలో స్థలాభావం కారణంగా పాత సమాధులను తొలగించి, కొత్త ఖననాలకు స్థలం కల్పించే చర్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. మధుబాల, గాయకుడు మహమ్మద్ రఫీ, సంగీత దర్శకుడు నౌషాద్, కవి సాహిర్ లుధియాన్వి వంటి ప్రముఖుల సమాధుల గుర్తులు కూడా తొలగించబడ్డాయి. ఈ పరిణామాలపై మధుర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన తండ్రి ఎంతో శ్రమించి నిర్మించిన సమాధిని చివరకు ఎందుకు తొలగించాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
అభిమానుల జ్ఞాపకాల్లో మాత్రం మధుబాల
మధుబాల సమాధి రూపం మారిపోయినా, ఆమె సినీ ప్రస్థానం మాత్రం చెరిగిపోలేదు. ముగల్-ఏ-ఆజమ్ వంటి చిత్రాలతో భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె అందం, నటన, తెరపై చూపిన భావోద్వేగాలు ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఒకవైపు కుమార్తెను కోల్పోయిన తండ్రి ప్రేమ, మరోవైపు కాలక్రమంలో కనుమరుగైన ఆమె సమాధి.. ఈ రెండు సంఘటనలు మధుబాల జీవితంలోని విషాద కోణాన్ని మరోసారి గుర్తుచేస్తున్నాయి. భౌతికమైన గుర్తులు చెరిగిపోవచ్చు.. కానీ ఒక కళాకారిణి తన నటనతో సంపాదించుకున్న స్థానం మాత్రం తరాలు మారినా నిలిచిపోతుంది.




