Tamannaah: తమన్నాకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు

Madras High Court: సినీ స్టార్లకు గ్లామర్ ఎంత ముఖ్యమో, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ కూడా అంతే ముఖ్యం.

Naresh.k
Published on: 17 April 2026 10:49 AM IST
Tamannaah
X

Tamannaah

Madras High Court: సినీ స్టార్లకు గ్లామర్ ఎంత ముఖ్యమో, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ కూడా అంతే ముఖ్యం. కానీ, కొన్నిసార్లు ఈ ప్రకటనలే కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న తమన్నా భాటియా, ఒక ప్రముఖ సబ్బుల కంపెనీతో సాగించిన సుదీర్ఘ న్యాయ పోరాటంలో ఓటమి చవిచూశారు.

ఈ వివాదం ఈనాటిది కాదు, సరిగ్గా 2008లో మొదలైంది. అప్పట్లో తమన్నా 'హ్యాపీ డేస్' వంటి సినిమాలతో టాప్ గేర్‌లో దూసుకుపోతున్నారు. ఆమె క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పవర్ సోప్స్ అనే సంస్థ ఆమెతో ఒప్పందం చేసుకుంది. 2009 అక్టోబర్ వరకు మాత్రమే ఆమె ఫోటోలను వాడుకోవాలి. గడువు ముగిసిన తర్వాత కూడా సదరు కంపెనీ తన ఫోటోలను ప్రచారానికి వాడుకుందని, దీనివల్ల తనకు రావాల్సిన ఇతర బ్రాండ్ అవకాశాలు దెబ్బతిన్నాయని తమన్నా ఆరోపించారు. ఇందుకు పరిహారంగా రూ. 1 కోటి చెల్లించాలని 2010లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

కోర్టు ఏమంది?

ఈ కేసు విచారణలో తమన్నా సమర్పించిన ఆధారాలు సరిపోవని న్యాయస్థానం అభిప్రాయపడింది. తమన్నా చూపించిన సబ్బు కవర్లపై బ్యాచ్ నంబర్లు లేదా తయారీ తేదీలు స్పష్టంగా లేవని, అవి గడువు ముగిసిన తర్వాతే తయారయ్యాయని నిరూపించలేకపోయారని కోర్టు పేర్కొంది. గతంలో సింగిల్ బెంచ్ ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆమెకు జరిమానా కూడా విధించింది. తాజాగా జస్టిస్ పి. వేల్మురుగన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ కూడా పాత తీర్పునే సమర్థించింది. దీంతో 15 ఏళ్ల పోరాటం తమన్నాకు నిరాశను మిగిల్చింది.

గ్లామర్ నుంచి..

కోర్టు కేసులు ఎలా ఉన్నా, తమన్నా తన రెండు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు. 2005లో 'శ్రీ' సినిమాతో మొదలైన ప్రయాణం.. 'హ్యాపీ డేస్', '100% లవ్' చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా మార్చేసింది. రాజమౌళి విజువల్ వండర్ 'బాహుబలి'లో అవంతికగా అంతర్జాతీయ గుర్తింపు పొందారు. 'సైరా'లో లక్ష్మిగా, 'ఓదేల 2'లో శివశక్తిగా తనలోని నటిని కొత్తగా ఆవిష్కరించారు. హీరోయిన్‌గానే కాకుండా, స్పెషల్ సాంగ్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. 'కావాలయ్య' వంటి పాటలతో నేటికీ ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు.

సినిమా రంగంలో ఇలాంటి చట్టపరమైన చిక్కులు ఎదురవ్వడం సహజమే అయినా, 15 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ తీర్పు తమన్నా అభిమానులను కాస్త ఆందోళనకు గురిచేసింది. అయితే, ఈ మిల్కీ బ్యూటీ మాత్రం తన పని తాను చేసుకుంటూ ఓటీటీలు, సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.

Naresh.k

Naresh.k

Next Story