Mahesh Vitta: తెలుగు ఇండస్ట్రీలో కులపిచ్చి ఎక్కువ.. అందువల్లే ఆ సినిమా ఛాన్సులు పోయాయి..!
Mahesh Vitta: యూట్యూబ్ స్టార్ నుంచి టాలీవుడ్ కమెడియన్‌గా ఎదిగిన మహేష్ విట్టా, తన కెరీర్‌లో ఎదురైన కుల వివక్ష గురించి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Mahesh Vitta: తెలుగు ఇండస్ట్రీలో కులపిచ్చి ఎక్కువ.. అందువల్లే ఆ సినిమా ఛాన్సులు పోయాయి..!
Tollywood Caste Politics: యూట్యూబ్‌లో తనదైన రాయలసీమ యాసతో మెప్పించి, ఆపై బిగ్ బాస్'వంటి షోలతో క్రేజ్ సంపాదించుకున్న మహేష్ విట్టా నేడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే, ఈ స్థాయికి చేరుకోవడం ఆయనకు పూలపాన్పు ఏమీ కాలేదు. వెండితెరపై ఆయన పండించే హాస్యానికి వెనుక ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దర్శకుడు కావాలనుకుంటే..
మహేష్ విట్టా అసలు లక్ష్యం దర్శకత్వం. 2016లో దర్శకుడు తేజ ఆఫీస్‌కు వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం కోరారు. కానీ, మహేష్‌లోని చమత్కారాన్ని గమనించిన తేజ .. దర్శకత్వం కంటే నటనపై దృష్టి పెట్టు, అక్కడ నీకు మంచి భవిష్యత్తు,ఆదాయం రెండూ దక్కుతాయి అని సలహా ఇచ్చారు. ఆ మాటతోనే మహేష్ తన మార్గాన్ని మార్చుకుని నటుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
మోసాలు.. పారితోషకం లేని సినిమాలు
పరిశ్రమలోకి కొత్తగా వచ్చినప్పుడు ఎదురయ్యే ఆర్థిక కష్టాలను మహేష్ కూడా చవిచూశారు. కొన్ని సినిమాలకు అసలు రెమ్యూనరేషన్ అడగకుండానే పనిచేశారు. మరికొన్ని సార్లు, సినిమా పూర్తయిన తర్వాత మాట మార్చి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన వారు కూడా ఉన్నారట. ఇంటర్వ్యూలో మహేష్ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. కేవలం టాలెంట్‌ను చూసి కాకుండా, కులం కారణంగా కూడా తనకు కొన్ని అవకాశాలు దూరమయ్యాయని ఆయన ఆరోపించారు.
ఆడిషన్స్ పూర్తై, పాత్రకు నేను ఫిట్ అవుతానని డేట్లు కూడా ఫిక్స్ చేసిన తర్వాత.. చివరి నిమిషంలో నన్ను తీసేసి వేరే వాళ్లను తీసుకునేవారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ తర్వాత విచారిస్తే, అక్కడ కులం లెక్కలు నడిచాయని తెలిసింది. అలాంటి అనుభవం నా ఒక్కడికే కాదు, చాలా మందికి ఎదురైంది అని మహేష్ వాపోయారు. ఎన్ని అవమానాలు ఎదురైనా, అవకాశాలు చేజారినా కుంగిపోకుండా తనపై తాను నమ్మకంతో ముందడుగు వేశారు మహేష్. ఈ స్థాయికి చేరుకోవడానికి పడ్డ కష్టాలు తనను మరింత దృఢంగా మార్చాయని ఆయన చెప్పుకొచ్చారు. టాలెంట్‌కు తోడు మొండితనం ఉంటేనే సినీ ఇండస్ట్రీలో నిలబడగలమని మహేష్ విట్టా ప్రయాణం నిరూపిస్తోంది.




