Mala Sinha Controversy: ఒక్క మాటతో సూపర్‌స్టార్‌ నుంచి జీరోస్థాయికి పడిపోయిన క్రేజీ హీరోయిన్‌

వెండితెరపై వెలుగులీనే తారల జీవితాలు బయటకు కనిపించేటంత అందంగా ఉండవు. ఒక్కోసారి వారు తీసుకునే అనాలోచిత నిర్ణయాలు, ఆడే చిన్న అబద్ధాలు వారి జీవితకాల కీర్తిని బుడిదలో పోసిన పన్నీరు చేస్తాయి.

Balachander
Published on: 11 May 2026 10:11 AM IST
Mala Sinha Controversy:  ఒక్క మాటతో సూపర్‌స్టార్‌ నుంచి జీరోస్థాయికి పడిపోయిన క్రేజీ హీరోయిన్‌
X

Mala Sinha Controversy: వెండితెరపై వెలుగులీనే తారల జీవితాలు బయటకు కనిపించేటంత అందంగా ఉండవు. ఒక్కోసారి వారు తీసుకునే అనాలోచిత నిర్ణయాలు, ఆడే చిన్న అబద్ధాలు వారి జీవితకాల కీర్తిని బుడిదలో పోసిన పన్నీరు చేస్తాయి. సరిగ్గా ఇలాంటి వింతైన, విచారకరమైన సంఘటనే బాలీవుడ్ సీనియర్ నటి మాలా సిన్హా జీవితంలో చోటుచేసుకుంది. కేవలం తన సంపాదనను కాపాడుకోవడం కోసం ఆమె కోర్టులో చెప్పిన ఒక అబద్ధం.. ఆమెను స్టార్‌డమ్ నుంచి పాతాళానికి పడిపోయేలా చేసింది.

హిందీ చిత్రసీమలో 1950, 60వ దశకాల్లో మాలా సిన్హా ఒక వెలుగు వెలిగారు. ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా వంటి దిగ్గజాల సరసన నటించి టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆమెకు డబ్బు పట్ల ఉన్న విపరీతమైన వ్యామోహం, పిసినారితనం ఆమె కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పాయి. డబ్బు పట్ల ప్రేమ ఉండొచ్చుగాని మరీ విపరీతంగా ఉంటే...దాని పర్యావసానం ఎలా ఉంటుందో చెప్పడానికి మాలా సిన్హా జీవితమే ఓ ఉదాహరణ.

ఐటీ దాడులు - బాత్రూంలో బయటపడ్డ డబ్బుల కట్టలు

ఒకానొక సమయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు మాలా సిన్హా నివాసంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులకు ఆమె ఇంటి బాత్రూం గోడల వెనుక దాచిన రూ. 12 లక్షల నగదు లభించింది. ఇప్పటి రోజుల్లో అది చిన్న మొత్తమే కావొచ్చు కానీ, ఆ రోజుల్లో 12 లక్షలు అంటే కొన్ని కోట్ల రూపాయలతో సమానం. ఈ భారీ సొమ్ముకు లెక్క చూపలేక ఆమె చిక్కుల్లో పడ్డారు. కానీ డబ్బుపై ఉన్న వ్యామోహంతో ఆమె చేసిన చిన్న పని మొదటికే మోసం వచ్చింది.

డబ్బు కోసం పరువు పణంగా

ఆ సొమ్ము మొత్తం ప్రభుత్వం జప్తు చేస్తుందని భయపడిన మాలా సిన్హా.. తన తండ్రి, న్యాయవాదుల సలహా మేరకు కోర్టులో ఒక విస్తుపోయే వాంగ్మూలం ఇచ్చారు. ఆ నగదు సినిమాల ద్వారా వచ్చిన నల్లధనం కాదని, తాను వ్యభిచారం ద్వారా సంపాదించానని ఆమె లిఖితపూర్వకంగా కోర్టుకు తెలిపారు. అలా చెబితే అది వ్యక్తిగత సంపాదన కిందకు వస్తుందని, ఆదాయపు పన్ను చట్టాల నుండి తప్పించుకోవచ్చని ఆమె భావించారు. ఇదే ఆమె చేసిన తప్పు.

అభిమానుల దిగ్భ్రాంతి.. కెరీర్ ముగింపు

డబ్బును దక్కించుకోవాలనే తాపత్రయంతో ఆమె ఆడిన ఈ 'అబద్ధం' దేశవ్యాప్తంగా దావానలంలా వ్యాపించింది. వెండితెరపై దేవతలా ఆరాధించిన నటి నోటి నుండి వచ్చిన ఆ మాటను అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. రాత్రికి రాత్రే ఆమె ఇమేజ్‌ జీరో స్థాయికి పడిపోయింది. ఈ వివాదం తరువాత ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. పెద్ద సినిమాల నుంచి తొలగించారు. తోటి నటులు ఆమెతో స్క్రీన్‌ పంచుకోవడానికి నిరాకరించారు. మాలా సిన్హాతో నటిస్తే ఎక్కడ తమ ఇమేజ్‌ దెబ్బతింటుందోనని భయపడ్డారు. కేవలం డబ్బును కాపాడుకోవడానికి పరువును బజారున పెట్టిన హీరోయిన్‌గా మాలా సిన్హా చరిత్రలో నిలిచిపోయారు. మనిషికి డబ్బు సంపాదన ముఖ్యమే కానీ, అంతకంటే వ్యక్తిత్వం ముఖ్యమనే దానిని ఆమె తెలుసుకోలేకపోయారు. సినిమా రంగుల ప్రపంచంలో స్టార్‌ ఇమేజ్‌ ఎంత వేగంగా వస్తుందో... ఎక్కడైనా ఎప్పుడైనా చిన్న తప్పులు చేస్తే అంతే వేగంగా చీకట్లు కమ్ముకుంటాయని కూడా మాలా సిన్హా జీవితం నిరూపించింది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story