Manchu Manoj: ఐదేళ్ల నిరీక్షణకు ప్రతిఫలం.. మౌనికను ప్రశంసిస్తూ మనోజ్ ఎమోషనల్ పోస్ట్
Manchu Manoj: తన భార్య మౌనిక వ్యాపార ప్రయాణంపై నటుడు మంచు మనోజ్ ప్రశంసల వర్షం కురిపించారు.
Manchu Manoj: ఐదేళ్ల నిరీక్షణకు ప్రతిఫలం.. మౌనికను ప్రశంసిస్తూ మనోజ్ ఎమోషనల్ పోస్ట్
Manchu Manoj: తన భార్య మౌనిక వ్యాపార ప్రయాణంపై నటుడు మంచు మనోజ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఐదేళ్లుగా ‘నమస్తే వరల్డ్’ (Namaste World) స్టార్టప్ సంస్థ కోసం ఆమె చేసిన అవిశ్రాంత కృషి ఇప్పుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. విశాఖ వేదికగా జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఈ సంస్థకు కీలక ఒప్పందం (MoU) కుదరడంపై సంతోషం వ్యక్తం చేస్తూ మనోజ్ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
‘‘మౌనికా.. నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. ఐదేళ్లుగా పట్టుదలతో నువ్వు చేసిన కష్టమే మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది. 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాం. తిరుపతిలో మన తొలి ఎంఓయూ కుదిరిన కేవలం మూడు వారాల్లోనే ఈ ఘనత సాధించాం. మనల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన ఘనత ముమ్మాటికీ నీదే’’ అని మంచు మనోజ్ తన భార్యను కొనియాడారు.
తమ భవిష్యత్ ప్రణాళికలను మనోజ్ వివరిస్తూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని కళాకారులు, నేత కార్మికులు, చేనేత రంగంలోని మహిళలతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. వారి అద్భుతమైన కళను, మన భారతదేశ కథలను బొమ్మలు, యానిమేషన్, సినిమాలు, ఏఐ (AI), రోబోటిక్స్ ద్వారా నేటి తరం పిల్లలకు చేరువ చేయాలనేది మా ఆలోచన’’ అని తెలిపారు.
తన కష్టకాలంలో అండగా నిలిచిన అభిమానులకు మంచు మనోజ్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. తన భార్యకు ఎప్పుడూ అండగా నిలుస్తూ.. తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. ‘‘చేయాల్సింది ఇంకా చాలా ఉంది. మౌనిక పక్కన నిలబడి నా వంతు కృషి చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అని రాసుకొచ్చారు. కాగా, విశాఖ సీఐఐ సదస్సులో ‘నమస్తే వరల్డ్’ స్టార్టప్ సంస్థ ఏపీలో రూ. 36 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.




