Mani Ratnam vs SS Rajamouli: మణిరత్నం, రాజమౌళికి ఉన్న తేడా ఇదే...
మణిరత్నం, రాజమౌళి ఇద్దరూ మేటి దర్శకులే. మణిరత్నం కేవలం సినిమాపై మాత్రమే దృష్టిసారిస్తే..రాజమౌళి కమర్షియల్ హంగులతో సినిమాను రూపొందిస్తారు.
Mani Ratnam vs SS Rajamouli: సినిమా అంటే కేవలం ఒక అద్భుతమైన కళ మాత్రమే కాదు... అది వందల కోట్ల రూపాయల పెట్టుబడితో కూడిన ఒక మహా వ్యాపారం. ఈ సూత్రాన్ని సరిగ్గా వంటబట్టించుకున్న దర్శకుడే ఇండస్ట్రీని ఏలగలడు. భారతీయ సినీ రంగంలో 24 క్రాఫ్ట్స్ పైనా పట్టున్న లెజెండరీ దర్శకుడు మణిరత్నం క్రియేటివిటీ విషయంలో శంకర్ కంటే ఒక అడుగు ముందే ఉంటారు. కానీ, ఆయన తన సినిమాలను పక్కా ఆర్టిస్టిక్‌గా తీస్తారే తప్ప, అది బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుందనే విషయంలో ఎప్పుడూ ఒకరిపై ఆధారపడాల్సి వచ్చేది. సరిగ్గా ఇక్కడే టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి రూటే వేరు. సినిమా అనుకున్న క్షణం నుండే దాని మార్కెటింగ్, బిజినెస్ వాల్యూస్, ప్రేక్షకుల నాడిని పట్టుకోవడంలో రాజమౌళి ఒక పక్కా కమర్షియల్ బిజినెస్ జీనియస్. ఈ ఇద్దరి ఆలోచనా విధానంలో ఉన్న ఆ చిన్న తేడాయే వారి కెరీర్ గ్రాఫ్‌లను శాసించింది.
మణిరత్నం వెనుక ‘జీవీ’ హస్తం.. ఆ తర్వాత మారిన సమీకరణాలు
1980వ దశకంలో మణిరత్నం కెరీర్ పీక్స్‌లో సాగడానికి ప్రధాన కారణం ఆయన సోదరుడు జి.వీ. చార్టెడ్ అకౌంటెంట్ చదివిన జీవీకి సినిమా ఫైనాన్స్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ రంగాలపై అపారమైన పట్టుండేది. మణిరత్నం తీసే కథలలో ఏది ఆడుతుంది, ఏది పోతుంది అని ఒక పక్కా క్రిటిక్‌లా విశ్లేషించేవారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు దాదాపు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే, 'ఇరువర్' సినిమా సమయంలో ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మణిరత్నం ‘మద్రాస్ టాకీస్’ బ్యానర్‌ను ఒంటరిగా ప్రారంభించారు. ఆ తర్వాత వచ్చిన 'సఖి', 'నవాబ్' మినహా ఆయన తీసిన చాలా సినిమాలు కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. దురదృష్టవశాత్తూ, 2003లో జీవీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత మణిరత్నానికి సరైన కమర్షియల్ గైడెన్స్ కరువైంది.
రాజమౌళి సక్సెస్ ఫార్ములా ... క్రియేటివిటీ ప్లస్ కమర్షియల్ మార్కెట్
మణిరత్నం టాలెంట్‌ను ఎవరూ శంకించలేరు. కానీ, నేటి తరం దర్శకులకు ఎస్.ఎస్. రాజమౌళి ఒక టెక్స్ట్‌బుక్‌లా కనిపిస్తారు. రాజమౌళి ఒక కథను అనుకున్న తర్వాత, దానిని ఎక్కడ మార్కెట్ చేయాలి, ఎంత బడ్జెట్ పెట్టాలి, ప్రేక్షకుడిని 2 గంటల 30 నిమిషాల పాటు ఎలా కూర్చోబెట్టాలి అనే బిజినెస్ ప్లాన్‌ను ముందే సిద్ధం చేసుకుంటారు. సినిమా ఎంత అద్భుతంగా తీసినా థియేటర్లకు జనాలు రాకపోతే ప్రొడ్యూసర్ మునిగిపోతాడు. రాజమౌళి తన సినిమాల్లో విజువల్ గ్రాండ్‌నెస్ ఎంత చూపిస్తారో, కలెక్షన్ల విషయంలోనూ అంతే పక్కాగా ఉంటారు. మణిరత్నంలా కేవలం అద్భుతమైన కళాఖండాలు తీస్తే సరిపోదు... రాజమౌళిలా కమర్షియల్‌గా ఆలోచించి, సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే తెలివి కూడా ఉండాలని నేటితరం సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.




