Maro Charitra: చెరిగిపోని చరిత్ర...మరో చరిత్ర
తెలుగు సినీ యవనికపై కొన్ని సినిమాలు కేవలం విజయాలుగా మాత్రమే మిగిలిపోవు, అవి చరిత్రగా మారుతాయి. అలాంటి ఒక దృశ్య కావ్యం 'మరో చరిత్ర'.
Maro Charitra: తెలుగు సినీ యవనికపై కొన్ని సినిమాలు కేవలం విజయాలుగా మాత్రమే మిగిలిపోవు, అవి చరిత్రగా మారుతాయి. అలాంటి ఒక దృశ్య కావ్యం 'మరో చరిత్ర'. దాదాపు 48 ఏళ్ల క్రితం, అంటే 1978 మే నెలలో విడుదలైన ఈ సినిమా, అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. రంగుల చిత్రాల హవా కొనసాగుతున్న ఆ రోజుల్లో, బ్లాక్ అండ్ వైట్లో విడుదలై ఈ స్థాయి సంచలనం సృష్టించడం ఒక అద్భుతం. ప్రేమ విలువను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమాగా గుర్తింపు పొందింది.
కథా వస్తువు - భాషలు వేరైనా.. భావం ఒక్కటే!
ఈ సినిమా ఒక తమిళ అబ్బాయి, ఒక తెలుగు అమ్మాయి మధ్య చిగురించిన స్వచ్ఛమైన ప్రేమకథ. భాషా భేదాలు, కుటుంబాల పట్టింపుల మధ్య వీరి ప్రేమ ఎలా నలిగిపోయింది అనేది దర్శకుడు కె. బాలచందర్ హృద్యంగా ఆవిష్కరించారు. ప్రేమికులిద్దరూ ఏడాది పాటు ఒకరినొకరు చూసుకోకుండా, మాట్లాడుకోకుండా ఉంటేనే పెళ్లికి అంగీకరిస్తామని పెద్దలు పెట్టిన షరతు, ఆ తర్వాత చోటుచేసుకున్న విషాదకర పరిణామాలు ప్రేక్షకుల కళ్లు చెమర్చాయి.
ఇక ఈ సినిమా హైదరాబాద్‌లోని ఓ థియేటర్లో ఏకంగా 556 రోజులు ప్రదర్శితమైంది. ఇదొక రికార్డుగా చెప్పవచ్చు. ఇక 18 కేంద్రాల్లో 200 ఆడిన సినిమాగా కూడా చరిత్రకెక్కింది. అంతేకాదు, ప్రధాన నగరాల్లో ఈ సినిమా 450 రోజులకు పైగా ప్రదర్శించబడి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం మేకర్స్ 161 మందిని స్కీన్ టెస్ట్ కాదని అప్పట్లో పదో తరగతి చదువున్న అభిలాష అనే విద్యార్థిని ఈ సినిమా కోసం ఎంపిక చేశారు. ఈ సినిమాలో అభిలాష పాత్రపేరు సరిత. ఈ సినిమా తరువాత అభిలాష సరితగా మారిపోయారు.
గురుశిష్యుల బంధం
ఈ సినిమా వెనుక ఒక గొప్ప కృతజ్ఞతా భావం ఉంది. 'అంతులేని కథ' విజయంతో కమల్ హాసన్‌కు అప్పట్లో వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ, తనను స్టార్‌ను చేసిన గురువు బాలచందర్ దర్శకత్వంలోనే తెలుగులో హీరోగా పరిచయం కావాలని కమల్ పట్టుబట్టారు. ఆ పట్టుదలే 'మరో చరిత్ర'కు ప్రాణం పోసింది. మెలోడీ బ్రహ్మ ఎం.ఎస్. విశ్వనాథన్ అందించిన సంగీతం, ముఖ్యంగా 'భలే భలే మొగాడివో' వంటి పాటలు నేటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. సినిమా ముగింపు విషాదకరంగా ఉన్నా, అది ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. అందుకే నాలుగు దశాబ్దాలు దాటినా, తెలుగు సినిమా చరిత్రలో 'మరో చరిత్ర' ఒక మైలురాయిగా నిలిచిపోయింది. తెలుగు ప్రేక్షకులకు మరుపురాని చరిత్రగా నిలిచింది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమా విడుదలై 48 ఏళ్లైనా ఇప్పటికీ ఈ సినిమా వెండితెరపై ప్రదర్శితమైతే చాలు... టీవీలకు అతుక్కుపోయే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తికాదు.




