Swarna Kamalam: విశ్వనాథుని స్వర్ణకమలం టైటిల్ వెనుక అంత కథ ఉందా?
కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'స్వర్ణకమలం'. ఈ చిత్రం విడుదలై దాదాపు 30 ఏళ్లకు పైగా గడిచినా, ఇప్పటికీ తన ప్రత్యేకతను కోల్పోలేదు.
Swarna Kamalam title meaning
తెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, జీవిత సత్యాలను కూడా బోధిస్తాయి. అలాంటి అపురూప కళాఖండం కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'స్వర్ణకమలం'. ఈ చిత్రం విడుదలై దాదాపు 30 ఏళ్లకు పైగా గడిచినా, ఇప్పటికీ తన ప్రత్యేకతను కోల్పోలేదు. దీనికి కారణం ఆ సినిమా టైటిల్ అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఈ టైటిల్ వెనుక ఉన్న లోతైన అర్ధాన్ని తెలుసుకుందాం.
అవార్డుల కోసం కాదు.. ఆత్మ వికాసం కోసం
ఈ సినిమాకు 'స్వర్ణకమలం' అని పేరు పెట్టినప్పుడు, జాతీయ అవార్డుల కోసమే ఈ పేరు పెట్టారని అప్పట్లో కొందరు విమర్శించారట. కానీ, ఈ టైటిల్ వెనుక ఉన్న అసలైన ఆంతర్యాన్ని దివంగత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక సందర్భంలో అద్భుతంగా వివరించారు.
దర్శకుడు కె విశ్వనాథ్ దృష్టిలో ఈ టైటిల్‌కు ఉన్న అర్థం చాలా గొప్పదని అన్నారు. స్వర్ణకమలం అంటే పువ్వు కాదని, మనిషి ఎదిగే క్రమానికి ప్రతీక అని సిరివెన్నెల పేర్కొన్నారు.
బురదలో విరిసిన స్వర్ణధామం
సరస్సు లోపన బురద ఉంటుంది. ఈ బురద సరస్సులో చేపలు, నత్తగుల్లలు, క్రిమికీటకాలు ఉంటాయి. కానీ, అదు బురద నుంచి దేవతకు ప్రీతిపాత్రమైన పద్మం కూడా వికసిస్తుంది. బురదలో పుట్టినా ఎల్లప్పుడూ ఆ కమలం స్వచ్చంగా, అందంగా ఉంటుంది. లక్ష్మీ, సరస్వతి దేవి కొలువయ్యేది పద్మం పీఠంమీదనే. మనిషి జీవితం కూడా అంతే. పేదరికం, కష్టాలు అనే బురదలో జన్మించినప్పటికీ... అక్కడే ఉండిపోకుండా తన ప్రతిభతో కమలంలా విరబూయాలని, స్వర్ణకమలం లాగా ప్రకాశించాలన్నదే ఈ టైటిల్ ఉద్దేశం. తన పరిధిలను అధికమించి ఆత్మవికాసం సాధించిన రోజే మనిషి స్వర్ణకమలం అవుతాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర ఈ భావాన్ని ప్రతిబింబిస్తుంది. సహజంగా తనలో ఉన్న నాట్యప్రతిభను గుర్తించి, దాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతరం సాధన ఎంత ముఖ్యమో ఈ సినిమాలో చూపించారు. ప్రతిభను గుర్తించి దానిని సరైన మార్గంలో నడిపించేందుకు హీరో పాత్రను సృష్టించారు. సరైన మార్గాన్ని చూపినపుడు స్వయంగా ఎదిగేందుకు అవకాశం లభిస్తుంది.
స్వధర్మం - పరధర్మం
ఈ చిత్రంలో మరో ముఖ్యమైన అంశం స్వధర్మం...పరధర్మం. భగవద్గీతలోని "స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః" అనే శ్లోక సారాంశం ఈ కథలో అంతర్లీనంగా ఉంటుంది. తన సహజ సిద్ధమైన నాట్యకళను వదిలేసి, గ్లామర్ ప్రపంచం వైపు వెళ్లాలనుకునే హీరోయిన్‌ను.. హీరో సరైన మార్గంలో నడిపించి ఆమెలోని ప్రతిభను ఆమెకే తెలిసేలా చేస్తాడు. మనిషి తనదైన మార్గంలో పయనించినపుడే నిజమైన గుర్తింపు లభిస్తుంది. యువతిలోని ఆత్మవిశ్వాసాన్ని బయటకు తీసే క్రమంలో వచ్చిన పాటే కొత్తగా రెక్కలొచ్చెనా. ఈ పాట ద్వారా ఆత్మవిశ్వాసం ఎంత బలమైనదో చూపించారు. మనలో ప్రతిభ ఉంటే సరిపోదు. నిరంతరంగా సాధన చేస్తేనే అది లోకానికి వెలుగును ఇస్తుంది. మొత్తంగా చెప్పాలంటే... బుదరను చూసి భయపడకుండా ఆకాశాన్ని చూస్తూ దానికి అందుకోవాలని ప్రయత్నం చేస్తే కమలంలా వికసించవచ్చు. పదిమందికి ఉపయోగపడవచ్చు అన్నది ఇందులోని సారాంశం. ఈ సినిమా వ్యక్తిత్వ వికాసానికి ఓ దర్పణం వంటిది అని విశ్లేషకులు చెబుతున్నారు.




