Meena Kumari: సినీతెరపై నవ్వులు పూయించి..జీవితంలో మద్యానికి బానిసై ఆజ్ఞాతవాసం చేసిన నటి ఎవరో తెలుసా?

ఒకప్పుడు దాదాపు 200 సినిమాల్లో నటించి హాస్యనటిగా గుర్తింపు పొందిన మీనాకుమారి జీవితం చివరకు విషాదంగా మారింది. మద్యానికి బానిసై సినిమాలకు దూరమైన ఆమె సినీ ప్రయాణం, చివరి రోజుల గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 31 Oct 2026 5:43 PM IST
Meena Kumari: సినీతెరపై నవ్వులు పూయించి..జీవితంలో మద్యానికి బానిసై ఆజ్ఞాతవాసం చేసిన నటి ఎవరో తెలుసా?
X

Meena Kumari: ఒకప్పుడు ఆమె తెరపై కనిపిస్తే చాలు.. ప్రేక్షకుల్లో నవ్వులు విరబూసేవి. స్టార్ హీరోల సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఆ హాస్యనటి దాదాపు 200 చిత్రాల్లో నటించారు. కానీ కెరీర్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమయంలోనే ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు, మద్యానికి బానిస కావడం ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పాయి. చివరకు సినిమాలకు దూరమై దాదాపు 30 ఏళ్ల పాటు అజ్ఞాతంలో గడిపారు. ఆ నటి మరెవరో కాదు.. అలనాటి తెలుగు హాస్యనటి మీనాకుమారి.

తెనాలి నుంచి మద్రాసు వరకు..

మీనాకుమారి స్వస్థలం తెనాలి. చిన్న వయసులోనే నెల్లూరుకు చెందిన సినీ పంపిణీదారుడు వై. సుబ్బారావుతో ఆమె వివాహం జరిగింది. ఆమెకు సినిమాలపై ఆసక్తి, నటనకు తగిన రూపం ఉండటాన్ని గమనించిన సుబ్బారావు.. నటన, నాట్యంలో శిక్షణ ఇప్పించారు. అనంతరం ఇద్దరూ సినిమా అవకాశాల కోసం మద్రాసుకు వెళ్లారు. 1958లో విడుదలైన 'శ్రీరామాంజనేయ యుద్ధం' చిత్రంతో ఆమె వెండితెర ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత 'సతీ సుకన్య', 'సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి', 'మనోరమ' వంటి సినిమాల్లో నటించారు. విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి మీద పెళ్లి' (1959) ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. 'అన్నాచెల్లెలు' సినిమాలో హీరోయిన్‌గా నటించడం ఆమె కెరీర్‌లో మరో ప్రత్యేకత.

200 సినిమాల్లో హాస్యంతో ప్రత్యేక గుర్తింపు

సినిమా రంగంలో నిలదొక్కుకోవాలనే పట్టుదలతో ప్రారంభంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆమె స్వీకరించారు. చిన్న పాత్రలతో మొదలైన ప్రయాణం క్రమంగా హాస్యనటిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. భాషపై పట్టు సాధించేందుకు నవలలు చదవడం, ఇతర భాషల సినిమాలు చూడటం ద్వారా నటనలో మెళకువలు నేర్చుకున్నారు. ఎన్టీఆర్, దర్శకుడు కె.వి. తిలక్ వంటి ప్రముఖులు ఆమెను ప్రోత్సహించారు. ఎన్టీఆర్ నటించిన అనేక చిత్రాల్లో మీనాకుమారి కనిపించేవారు. అంజిగాడు బాలకృష్ణతో ఆమె జోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పద్మనాభం, రాజబాబు వంటి హాస్యనటులతో కలిసి పనిచేశారు. మొత్తంగా సుమారు 200 చిత్రాల్లో నటించి అప్పటి ప్రేక్షకులకు చేరువయ్యారు.

నిర్మాతగా మారి.. ఆర్థికంగా నష్టపోయి

కెరీర్ మంచి స్థాయిలో ఉన్న సమయంలోనే మీనాకుమారి సొంతంగా సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నారు. 1968 ప్రాంతంలో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ఓ జానపద చిత్రాన్ని ప్రారంభించారు. అయితే కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆర్థిక సమస్యలు ఎదురవడంతో సినిమా ఆగిపోయింది. ఈ ప్రయత్నం ఆమెకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని మిగిల్చింది. ఇదే సమయంలో మద్యానికి అలవాటు పడటం ఆమె వ్యక్తిగత జీవితంతో పాటు సినీ కెరీర్‌పైనా ప్రభావం చూపింది. అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమెకు క్రమంగా పరిశ్రమలో పని లేకుండా పోయింది.

చివరి సినిమా తర్వాత తెరమరుగై..

మీనాకుమారి నటించిన చివరి చిత్రం 'జీవితంలో వసంతం'. 1977లో విడుదలైన ఈ సినిమా తర్వాత ఆమె మళ్లీ వెండితెరపై కనిపించలేదు. దాదాపు మూడు దశాబ్దాల పాటు అజ్ఞాత జీవితాన్ని గడిపారు. చివరకు 2007 ఆగస్టు 13న ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఆమె కుమారుడు నాగరాజు ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు ప్రేక్షకులను నవ్వించిన మీనాకుమారి జీవితం చివరకు విషాదంగా ముగిసింది. ప్రతిభ, గుర్తింపు ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలు కళాకారుల ప్రయాణాన్ని ఎంతగా ప్రభావితం చేస్తాయో ఆమె కథ గుర్తుచేస్తుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.