MS Narayana Life Story: తెరపై విరబూసిన ఆ నవ్వుల వెనుక చెరిగిపోని అవమానాలు... వెలకట్టలేని కన్నీళ్లు
పేదరికం, అవమానాలు, ఆకలి మధ్య నుంచి తెలుగు సినీ పరిశ్రమలో 700కు పైగా సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎం.ఎస్. నారాయణ జీవితంలోని తెలియని పోరాట గాథను తెలుసుకుందాం.
MS Narayana Life Story: హీరోగా రాణించడం పెద్ద కష్టం కాదు...కానీ, కమెడీయన్‌గా తెరపై నవ్వులు పూయించాలంటే హాస్యాన్ని గుండెల్లో నింపుకొని ఉండాలి. సందర్భానికి అనుగుణంగా డైలాగ్స్ చెప్పాలి. అదీ ప్రేక్షకులకు నవ్వులు తెప్పించేలా. దానికంటే ప్రత్యేక మ్యానరిజమ్ క్రియేట్ చేసుకోవాలి. ఇలాంటి గుణాలను పుణికిపుచ్చుకొని నవ్వులను పంటను పండించిన నటుడు ఎమ్ ఎస్ నారాయణ. తెరపై ఎందరినో నవ్వుల్లో ముంచెత్తిన ఈ నవ్వుల వెనుక గుండెల్ని పిండేసే పేదరికం, వెలకట్టలేని కన్నీళ్లు, ఎన్నో అవమానాలు దాగున్నాయనే సంగతి చాలా మందికి తెలియదు. నవ్వుల బ్రహ్మ బ్రహ్మానందం 700 సినిమాలు చేయడానికి 20 ఏళ్లు పడితే... ఎమ్ ఎస్ నారాయణ 15 ఏళ్లలోనే 700 చిత్రాల్లో నటించాడు.
చదువు కోసం తండ్రితో యుద్ధం
ఎమ్.ఎస్. నారాయణ గారి బాల్యం ఎంతో దుర్భరంగా గడిచింది. పెద్ద కుటుంబం, కానీ తిండికి లేని పరిస్థితి. రోజుకు ఎవరో ఒకరు పస్తులుండాల్సిందే. బాల్యంలో బక్కపలచగా ఉండే ఎమ్‌ఎస్ పని ఎగ్గొట్టడానికి బడికి వెళ్తున్నాడని తండ్రి భావించేవాడు. ఎప్పుడు బడికి వెళ్లినా బడి నుంచి ఈడ్చుకు వచ్చి పొలంలో పడేసేవాడు. ఎన్నో రోజులు ఇలానే జరిగింది. తండ్రితో రోజూ చదువు విషయంలో యుద్ధం చేశాడు. ఇంట్లో ఎవరూ పస్తులు ఉండకూడదంటే తాను చదువుకోవాలని పట్టుబట్టాడు. తన్నలు తిన్నాడు. అయినా సరే తండ్రి ఒప్పుకునేంత వరకు పట్టువదలలేదు. ఆ పట్టుదలే ఆయన్ను తెలుగు ఉపాధ్యాయుడిని చేసింది. ఆయనలో ఉన్న కళాపిపాసి ఉపాధ్యాయ వృత్తితో ఆగిపోలేదు.
శని, ఆదివారాల మద్రాస్ ప్రయాణం... ఆకలి కేకలు
ఉద్యోగం చేస్తూనే సినిమాపై ఉన్న పిచ్చితో ఎమ్.ఎస్. గారు చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ప్రతి శనివారం రాత్రి మద్రాస్ రైలెక్కడం, ఆదివారమంతా దర్శకుల చుట్టూ కథలతో తిరగడం, మళ్లీ ఆదివారం రాత్రి రైలెక్కి సోమవారం ఉదయానికల్లా స్కూలుకు వచ్చి పాఠాలు చెప్పడం.. ఇలా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆయన అవిశ్రాంతంగా ఈ విధంగా శ్రమించారు. ఒకసారి ఆయన సినిమా ప్రయత్నాల్లో భాగంగా మద్రాసులో ఆరు రోజులు ఉంటే, అందులో కడుపునిండా తిన్నది కేవలం రెండు రోజులే. అయినా సరే ఆయన పట్టు వదల్లేదు. కదలకుండా కూర్చొని పాఠాలు చెప్పుకుంటే జీతం వస్తుంది. జీవితం ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. కానీ, కళాకారుడికి ఒకచోట నిలకడగా ఉండటం సాధ్యమౌతుందా చెప్పండి.
పరుచూరి బ్రదర్స్ సాయం.. వెండితెర అరంగేట్రం
ఎమ్.ఎస్. లోని రచయితను మొదట గుర్తించింది పరుచూరి గోపాలకృష్ణ. ఎమ్.ఎస్. ప్రేమించిన అమ్మాయి 'కళాప్రపూర్ణ'ను దగ్గరుండి పెళ్లి జరిపించింది కూడా ఆయనే. 'పేకాట పాపారావు' వంటి చిత్రాలకు కథా సహకారం అందించిన ఎమ్.ఎస్‌కి , దర్శకుడు రవిరాజా పినిశెట్టి 'ఎమ్.ధర్మరాజు ఎమ్.ఏ', 'పెదరాయుడు' చిత్రాల్లో చిన్న పాత్రలు ఇచ్చారు. ఆ తర్వాత 'రుక్మిణి' సినిమాతో పూర్తి స్థాయి కమెడియన్‌గా ఆయన ప్రస్థానం మొదలైంది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా వరసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన నటించిన దూకుడు సినిమాకు నంది అవార్డు లభించింది. పేదవాడిగా పుట్టడం తప్పుకాదు...కానీ, అందుబాటులో ఉన్న అవకాశాలు, మనలో ఉన్న టాలెంట్‌ను గుర్తించి దానిని సరైన దిశగా అమలు చేస్తే ఎమ్‌ఎస్ నారాయణలా ఎదగొచ్చు.




