MS Raju: ఆ సినిమా డిజాస్టర్‌తో ఫుల్‌గా మందు తాగి.. సొంత ఇల్లు అమ్మేశా!

MS Raju: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు స్ట్రీట్ ఫైటర్ సినిమా పరాజయం తర్వాత తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు వివరించారు.

Ravi
By Ravi
Published on: 29 May 2026 3:50 PM IST
MS Raju
X

MS Raju: ఆ సినిమా డిజాస్టర్‌తో ఫుల్‌గా మందు తాగి.. సొంత ఇల్లు అమ్మేశా!

MS Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో స్టార్ ప్రొడ్యూసర్‌గా ఒక వెలుగు వెలిగిన ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సినిమా రంగంలో విజయాలు ఎంత త్వరగా వస్తాయో, అపజయాలు కూడా అంతే వేగంగా మనల్ని ఒక్కసారిగా కిందకి లాగేస్తాయి అనడానికి ఆయన జీవితమే ఒక పెద్ద ఉదాహరణ. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌లో ఎదుర్కొన్న అతిపెద్ద ఫెయిల్యూర్‌, దాని వల్ల ఎదురైన ఇబ్బందుల గురించి ఎంఎస్ రాజు వివరించారు.

కోడి రామకృష్ణతో చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో, అప్పట్లో ఎంఎస్ రాజు చాలా ఉత్సాహంతో ఉండేవారు. ఆ రెండు హిట్స్ ఇచ్చిన ఊపులో, ప్రముఖ డైరెక్టర్ బి. గోపాల్‌తో విజయశాంతి ప్రధాన పాత్రలో 'స్ట్రీట్ ఫైటర్' అనే సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టారు. అయితే వరుస విజయాలు సాధించామనే అతివిశ్వాసంతో ఆ సినిమా బడ్జెట్ విషయంలో ఆయన అస్సలు సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. సినిమా మరింత గ్రాండ్‌గా ఉండాలని ప్రతి చిన్న దానికి ఇష్టం వచ్చినట్లు భారీగా ఖర్చు చేశారు. యాక్షన్ సీన్స్ కోసం పెద్ద ఎత్తున గుర్రాలు, ఇతర హంగులు పెట్టి అనవసరంగా బడ్జెట్‌ను విపరీతంగా పెంచేశారు. సరిగ్గా ఆ సమయంలోనే బి. గోపాల్ కొన్ని విషయాల్లో ఇది కరెక్ట్ కాదేమో అని జడ్జిమెంట్ ఇచ్చినా, వరుస హిట్స్ మూడ్‌లో ఉండటం వల్ల ఎంఎస్ రాజు ఆయన మాటలను పెద్దగా పట్టించుకోలేదు.

తీరా ఆ సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద అది అతి పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవడం, పైగా సినిమా అస్సలు ఆడకపోవడంతో ఎంఎస్ రాజుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. ఆ దెబ్బతో ఆయన పూర్తిగా కృంగిపోయారు. ఓ పార్టీలో ఇద్దరు అగ్ర నిర్మాతలు మాట్లాడిన మాటలకు బాధపడి, ఆ రోజు ఎక్కువగా మద్యం సేవించినట్లు ఎంఎస్ రాజు గుర్తు చేసుకున్నారు. సొంత ఇంటిని కూడా అప్పుల వల్ల వెంటనే అమ్మేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఒక్క సినిమా ఫెయిల్యూర్ తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక పెద్ద గుణపాఠం నేర్పిందని ఆయన స్పష్టం చేశారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story