Murali Mohan: అందరిలా పొద్దున్నే ఇడ్లీ, దోశ తినను.. మురళీ మోహన్ హెల్త్ సీక్రెట్స్ వెంటే ఆశ్చర్యపోతారు.!

Murali Mohan: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడిగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న మురళి మోహన్ తన ఫిట్‌నెస్ రహస్యాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Ravi
By Ravi
Published on: 30 July 2026 9:50 PM IST
Murali Mohan
X

Murali Mohan: అందరిలా పొద్దున్నే ఇడ్లీ, దోశ తినను.. మురళీ మోహన్ హెల్త్ సీక్రెట్స్ వెంటే ఆశ్చర్యపోతారు.!

Murali Mohan: టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మురళి మోహన్ ఈ వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా, ఫిట్‌గా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన తన అద్భుతమైన ఆరోగ్య రహస్యాలను, దినచర్యను అభిమానులతో పంచుకున్నారు. తాను ఆరోగ్యంగా ఉండటానికి నిత్యం శారీరక శ్రమను ఎంతో కఠినంగా పాటిస్తానని ఆయన తెలిపారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా 15 వేల అడుగులకు పైగా నడుస్తానని, ఒకేసారి కాకుండా ఉదయం, మధ్యాహ్నం అలాగే రాత్రి పూట ఈ లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటానని వెల్లడించారు. ప్రయాణాలు ఉన్నప్పటికీ తన వాకింగ్ రొటీన్‌ను ఏమాత్రం మిస్ కాకుండా చూసుకుంటానని పేర్కొన్నారు.

అలాగే తన ఆహారపు అలవాట్ల గురించి చెబుతూ, తాను ఉదయం పూట ఎప్పుడూ సాధారణంగా ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లు తిననని స్పష్టం చేశారు. కేవలం సీజనల్ పండ్లు, బొప్పాయి, పుచ్చకాయ లేదా ఆపిల్ వంటి వాటితో పాటు ఒక గ్లాసు రాగి జావను మాత్రమే ఉదయం అల్పాహారంగా తీసుకుంటానని తెలిపారు. మధ్యాహ్నం పూట కూరగాయలు, ఆకుకూరలతో కూడిన సాదా భోజనాన్ని తీసుకుంటానని, రాత్రి పూట ఎంతో తేలికపాటి ఆహారాన్ని మాత్రమే తింటానని చెప్పారు. శరీరాన్ని ఎప్పుడూ ఒకే రకమైన ఆహారానికి అలవాటు చేయకుండా మార్పులు చేస్తుంటానని, అప్పుడే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని నిపుణుల సలహాతో ఈ పద్ధతిని పాటిస్తున్నానని మురళి మోహన్ వివరించారు.

కాగా, లెజెండరీ నటుడు ఎన్టీ రామారావు జీవనశైలి నుండి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని ఆయన గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ ఉదయాన్నే నిద్రలేచి కఠినమైన శారీరక శ్రమ చేసేవారని, ఆయువును, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమశిక్షణ చాలా ముఖ్యమని తెలిపారు. గత 38 సంవత్సరాలుగా తాను క్రమం తప్పకుండా అయ్యప్ప స్వామి మాల ధరిస్తున్నానని, ఆ సమయంలో అన్ని నియమాలను అత్యంత నిష్టగా పాటిస్తానని మురళి మోహన్ భావోద్వేగంతో వెల్లడించారు. శారీరక ఆరోగ్యాన్నే కాకుండా మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ఆధ్యాత్మిక చింతన కూడా ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story