Naga Babu: మీకు సెన్స్ ఉందా? పిఠాపురం జనసేన నేతలపై నిప్పులు చేరిగిన నాగబాబు
Naga Babu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడు నాగబాబు క్లారిటీ ఇచ్చారు.
Naga Babu
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై అటు కుటుంబ సభ్యులు, ఇటు అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తాజాగా ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పవన్ హెల్త్ అప్‌డేట్‌ను అధికారికంగా వెల్లడించారు. అయితే, ఈ క్రమంలో పిఠాపురం జనసేన నేతలపై నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్, వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.నాగబాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. మరో నాలుగైదు రోజుల నుండి వారం రోజుల్లోపు ఆయన తిరిగి తన విధుల్లో చేరుతారని స్పష్టం చేశారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, తన తమ్ముడు సాధారణ స్థితికి రావడానికి ఒక వారం పట్టొచ్చని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
నేతలపై నాగబాబు ఆగ్రహం
పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ అంతర్గత అంశాలపై చర్చించేందుకు నాగబాబు గురువారం స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సమస్యలు, ఫైవ్ మ్యాన్ కమిటీ పనితీరుపై నేతలు ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. కాపు కార్పొరేషన్, కళ్యాణ మండపం వంటి డిమాండ్లను నాగబాబు ముందు ఉంచారు.సొంత నియోజకవర్గం కోసం అహర్నిశలు శ్రమిస్తూ, అనారోగ్యంతో బాధపడుతున్న నేత గురించి ఎవరూ ప్రస్తావించకపోవడంతో నాగబాబు సహనం కోల్పోయారు. మీకు అసలు కొంచమైనా సెన్స్ ఉందా? నియోజకవర్గం కోసం ఆయన ఇంత కష్టపడుతుంటే, పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఎలా ఉందని ఒక్కడైనా అడిగారా? నేను ఇక్కడికి వివాదాలు మాట్లాడటానికి రాలేదు అని నాగబాబు ఘాటుగా మందలించారు.దీంతో ఖంగుతిన్న నేతలు, వెంటనే తమ తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
అభివృద్ధి బాటలో పిఠాపురం
రాజకీయ విమర్శలను పక్కన పెడితే, పిఠాపురం అభివృద్ధిపై నాగబాబు కీలక గణాంకాలను వెల్లడించారు.గడిచిన రెండేళ్లలో పిఠాపురం కోసం సుమారు రూ. 600 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. వర్మ వంటి ఇతర వివాదాస్పద అంశాలపై మాట్లాడటానికి ఆయన నిరాకరించారు.
త్వరలోనే జనసేనాని రీ-ఎంట్రీ
వైద్యుల సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. శస్త్రచికిత్స తర్వాత పూర్తి స్వస్థత చేకూరడానికి కొంత సమయం పడుతుందన్నప్పటికీ, పవన్ తన బాధ్యతల పట్ల ఉన్న చిత్తశుద్ధితో త్వరగానే విధుల్లో చేరాలని నిర్ణయించుకున్నారు. వచ్చే వారం నుండి ఏపీ డిప్యూటీ సీఎం తన అధికారిక కార్యకలాపాల్లో పాల్గొంటారని తెలియడంతో జనసైనికులు, మెగా అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ నాయకుడు ఆరోగ్యంగా తిరిగి రావడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనలు మిన్నంటుతున్నాయి.




