Nani's The Paradise Review: నాని మాస్ జాతర..బొమ్మ దద్దరిల్లింది ..!
Nani's The Paradise Review: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' మూవీ పూర్తి రివ్యూ.
Nani's The Paradise Review: నాని మాస్ జాతర..బొమ్మ దద్దరిల్లింది ..!
Nani's The Paradise Review: నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ అనగానే ‘దసరా’ సృష్టించిన ప్రభంజనం గుర్తుకొస్తుంది. అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ, ట్రైలర్ లేకుండానే కేవలం గ్లింప్స్, పాటలతో భారీ బజ్‌ను క్రియేట్ చేసిన చిత్రం ‘ది ప్యారడైజ్’. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త మాస్ యాక్షన్ అనుభూతిని పంచుతూ అదరగొడుతోంది. ఈరోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.
కథ
హైదరాబాద్‌కు ఆనుకుని ఉండే 'ప్యారడైజ్' ప్రాంతంలో నివసించే సవారీ జాతి ప్రజల ఉనికి, పోరాటమే ఈ సినిమా ప్రధానాంశం. స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న ఘనమైన చరిత్ర ఆ జాతికి ఉన్నప్పటికీ.. స్వతంత్ర భారతంలో వారికి కనీస గుర్తింపు, ఓటు హక్కు, ప్రభుత్వ రక్షణ ఉండవు. వీరికి గుర్తింపు రాకుండా శికంజ్ మాలిక్ (మోహన్ బాబు) అడుగడుగునా అడ్డుపడుతుంటాడు. అసలు సవారీ జాతిపై శికంజ్కి ఉన్న పగ ఏంటి? ఆ జాతిలో పుట్టిన జడల్ (నాని) తన ప్రజల గుర్తింపు కోసం ఎలాంటి పోరాటం చేశాడు? అన్నదే ఈ పవర్ఫుల్ యాక్షన్ డ్రామా.
విశ్లేషణ
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ కథను ఒక రెవల్యూషనరీ యాక్షన్ డ్రామాగా, మదర్ సెంటిమెంట్‌ను జోడించి ఉత్కంఠభరితంగా మలిచాడు. సవారీ జాతి చరిత్రను పరిచయం చేస్తూ సాగే ప్రారంభ సన్నివేశాలు, సమ్మక్క (సోనాలి కులకర్ణి) పోరాటం, నాని జైలుకు వెళ్లడం.. ఇలా ఫస్ట్ హాఫ్ అంతా చాలా గ్రిప్పింగ్‌గా సాగుతుంది. జైలు నుంచి వచ్చిన హీరో, విలన్ల మధ్య నెలకొన్న వైరం ఇంటర్వెల్ బ్యాంగ్‌తో తారాస్థాయికి చేరుకుని సెకండాఫ్‌పై భారీ అంచనాలను పెంచుతుంది. ద్వితీయార్థంలో స్వయం ప్రతిపత్తి గల రాజ్యం అనే పాయింట్ కాస్త వాస్తవానికి దూరంగా, సినిమాటిక్‌గా అనిపించినా.. దర్శకుడు డిజైన్ చేసిన రోమాలు నిక్కబొడుచుకునే యాక్షన్ సన్నివేశాలు, బలమైన ఎమోషన్ ఆ లోటును కవర్ చేసి ప్రేక్షకులను కుర్చీలకు కట్టేస్తాయి.
నటీనటుల ఫర్మామెన్స్
ఈ సినిమాలో నాని విశ్వరూపం చూపించాడు. పూర్తిస్థాయి మాస్, రస్టిక్ యాక్షన్ పాత్రలో అదరగొట్టాడు. పక్కా తెలంగాణ యాసలో నాని చెప్పే డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్‌లలో అతను పడిన కష్టం స్క్రీన్ మీద అద్భుతంగా పండింది. థియేటర్లలో విజిల్స్ వేయించిన స్పెషల్ అట్రాక్షన్ ఈ పాత్ర. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని గుర్తుకు తెచ్చేలా ప్రియదర్శి మేకోవర్, మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. పవర్ఫుల్ విలనిజంతో, తనదైన స్క్రీన్ ప్రజెన్స్‌తో సినిమాకు గంభీరత్వాన్ని తీసుకొచ్చారు. సుబ్బు పాత్రలో కయాదు లోహార్ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఆమె బ్యాక్‌స్టోరీ ఆసక్తికరంగా ఉంది. సమ్మక్కగా సోనాలి కులకర్ణి హుందాగా నటించగా, 'బిర్యానీ' అనే కొత్త రకమైన పాత్రలో సంపూర్ణేష్ బాబు సర్ ప్రైజ్ చేశారు. లాయర్‌గా సత్యరాజ్, తనికెళ్ల భరణి తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు
సినిమాకు మరో ప్రధాన బలం అనిరుధ్ రవిచందర్ సంగీతం. ‘ఆయా షేర్’, ‘ఏష నాగుల కట్ట’ పాటలు థియేటర్లలో మాస్ జాతరను తలపిస్తాయి. తనదైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో అనిరుధ్ యాక్షన్ సీన్స్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లాడు. సవారీ జాతి కోసం క్రియేట్ చేసిన ప్రపంచాన్ని కెమెరామెన్ రా అండ్ రస్టిక్ విజువల్స్‌తో కళ్లకు కట్టాడు. ఎడిటింగ్‌లో చిన్న చిన్న జంప్స్ ఉన్నప్పటికీ, ఉన్నతమైన నిర్మాణ విలువలు సినిమాను ఒక విజువల్ వండర్లా నిలబెట్టాయి.
ప్లస్ పాయింట్స్
నాని అద్భుతమైన పెర్ఫార్మెన్స్
ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్
అనిరుధ్ మ్యూజిక్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
యాక్షన్ సీక్వెన్సెస్
ప్రియదర్శి క్యారెక్టరైజేషన్, నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
సెకండాఫ్‌లో అక్కడక్కడా కాస్త ల్యాగ్
కన్విన్సింగ్‌గా అనిపించని కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు
మాస్ ప్రేక్షకులకు ‘ది ప్యారడైజ్’ ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా. గుర్తింపు కోసం ఒక జాతి చేసే పోరాటాన్ని కమర్షియల్ హంగులతో, బలమైన ఎమోషన్స్‌తో తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. నాని యాక్షన్ అవతార్, శ్రీకాంత్ ఓదెల టేకింగ్, అనిరుధ్ మ్యూజిక్ అన్నీ కలిసి ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్ బస్టర్‌గా నిలబెట్టాయి. యాక్షన్, ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే ప్రతి ఒక్కరూ థియేటర్లలో కచ్చితంగా ఎంజాయ్ చేసే పక్కా పైసా వసూల్ చిత్రమిది.
Rating:3/5




