Singer Mangli : మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. ఈసారి ఏం చేసిందంటే..!

Singer Mangli : ప్రముఖ జానపద గాయని మంగ్లీ చుట్టూ వివాదాలు అస్సలు వీడటం లేదు.

Naresh.k
Published on: 3 Jun 2026 9:31 AM IST
Singer Mangli
X

Singer Mangli : మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. ఈసారి ఏం చేసిందంటే..!

Mangli controversy: ప్రముఖ జానపద గాయని మంగ్లీ చుట్టూ వివాదాలు అస్సలు వీడటం లేదు. ఇటీవలి కాలంలో ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారాలు, అధిక వడ్డీ మోసాల కేసుల వంటి అంశాల్లో ఆమె పేరు సోషల్ మీడియాలో మార్మోగిన సంగతి తెలిసిందే. ఆ వివాదాల సెగ ఇంకా చల్లారకముందే.. ఇప్పుడు ఆమె మెడకు మరో కొత్త వివాదం చుట్టుకుంది. తెలంగాణ సాయుధ పోరాట వీరుల త్యాగాలకు ప్రతీకగా నిలిచే ఒక ఎమోషనల్ సాంగ్‌ను మంగ్లీ పాడిన విధానంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..?

తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నిజాం నిరంకుశత్వానికి, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజాకవి గూడ అంజయ్య రాసిన అద్భుతమైన పాట "బండెనుక బండి గట్టి.. పదహారు బండ్లు గట్టి". 'మా భూమి' సినిమా ద్వారా ప్రజల్లోకి వెళ్లిన ఈ పాట.. తెలంగాణ సమాజంలో ఒక పెద్ద ఉద్యమ స్ఫూర్తిని రగిల్చింది. ప్రతి తెలంగాణ బిడ్డ గుండెను కదిలించే పెయిన్, ఎమోషన్ ఈ పాటలో ఉన్నాయి. అయితే, కొద్దికాలం క్రితం జరిగిన ఒక స్టేజ్ ప్రోగ్రామ్‌లో మంగ్లీ ఈ పాటను ఆలపించారు. కాకపోతే, ఆ పాట వెనుకున్న అమరవీరుల త్యాగాలను, ఎమోషన్‌ను పక్కనబెట్టి.. ఏదో క్లబ్బుల్లో, పబ్బుల్లో పాడే ఐటెం సాంగ్ తరహాలో డ్యాన్స్ చేస్తూ, ఊగిపోతూ పాడటం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

తెలంగాణ ఫార్మేషన్ డే వేళ తెరపైకి..

నిజానికి ఈ ప్రోగ్రామ్ కాస్త పాతదే అయినప్పటికీ.. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ వీడియోను నెటిజన్లు మరోసారి సోషల్ మీడియా వేదికగా తెరపైకి తెచ్చారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ పాట వెనకున్న అమరవీరుల రక్తం కనిపిస్తుంటే.. ఈమెకు ఆ గంతులు ఏంటి? ఆ వెటకారపు నవ్వులు ఏంటి? అంటూ నెటిజన్లు మంగ్లీపై విరుచుకుపడుతున్నారు.

తెలంగాణ ఉద్యమ చరిత్రను, పాటల ప్రాధాన్యతను అవమానించేలా ప్రవర్తించినందుకు గానూ.. మంగ్లీ తక్షణమే తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. వరుస వివాదాలతో సతమతమవుతున్న మంగ్లీ.. ఈ తాజా వివాదంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story