Mutyala Muggu: మీకు పాటలంటే ఇష్టమా...ఈ పాట వినండి మైమరచిపోతారు...అర్ధం తెలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు

తెలుగు సినిమా ఆణిముత్యాల్లో ఒకటైన ముత్యాలముగ్గు సినిమాలోని ఈ పాట ఇప్పటికీ మ్యూజిక్‌ లవర్స్‌ని ఆకట్టుకుంటోంది. పాట వినడానికి ఎంత బాగుంటుందో అర్ధం తెలుసుకుంటే మరింత బాగుంటుంది.

Balachander
Published on: 30 Jun 2026 8:41 AM IST
Mutyala Muggu: మీకు పాటలంటే ఇష్టమా...ఈ పాట వినండి మైమరచిపోతారు...అర్ధం తెలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు
X

Mutyala Muggu: తెలుగు సినిమా పాటల్లో కొన్ని కాలక్షేపానికి వస్తే, మరికొన్ని కాలం దాటి నిలిచిపోతాయి. కేవలం కమర్షియల్ హంగులతో, ప్లాస్టిక్ పూలలాంటి పదాలతో నేటి పాటలు సాగుతున్నాయనే విమర్శల మధ్య... అక్షరాల్లో అమరత్వాన్ని, భావాల్లో గాఢతను నింపిన అద్భుతమైన గీతం నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. 1975లో బాపు-రమణల సృష్టిగా వచ్చిన క్లాసిక్ చిత్రం 'ముత్యాల ముగ్గు'లోని ఈ పాటను మహాకవి గుంటూరు శేషేంద్రశర్మ రచించారు. పి. సుశీలమ్మ గొంతులో, కె.వి. మహదేవన్ స్వరకల్పనలో ఒలికిన ఈ విరహ వేదన, సామాన్య సినిమా ప్రేక్షకుడి కంటి వెంట నీరు తెప్పించడమే కాకుండా, సాహిత్య ప్రియులను నేటికీ మైమరపిస్తోంది. చేయని తప్పుకు భర్తకు దూరమై, పసిపిల్లలతో ఏకాకిగా జీవిస్తున్న హీరోయిన్‌.. తనను చూడటానికి వచ్చి కూడా గుర్తుపట్టకుండా వెళ్ళిపోతున్న భర్తను దూరం నుంచి చూస్తూ వగచే సందర్భంలో వచ్చే దృశ్యకావ్యం ఇది. ఈ పాటలోని ప్రతి పదం ఒక రంగుల రాట్నంలా తిరుగుతూ శ్రోతలను ఆలోచనల్లో ముంచెత్తుతుంది.

తోట, వేణువు, అడవి ...అమూర్త పదాల వెనుక అద్భుత భావాలు

మొదటి చరణంలోనే కవి వాడిన ఉపమానాలు దిమ్మతిరిగేలా చేస్తాయి. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది... కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది అనడంలో... ఇక్కడ నిదురిస్తున్న 'తోట' అంటే నాయిక శూన్యమైన మనసు. ఆ మనసులోకి వచ్చిన 'పాట' ఆమె భర్త జ్ఞాపకం. దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది... శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది అంటూ భర్త సాంగత్యం ఆమె జీవితానికి తెచ్చిన వెలుగును, సంగీతాన్ని గుర్తుచేస్తారు. ఎండిపోయిన నాయిక జీవితాన్ని ఆకురాలు అడవితో పోల్చి, భర్త రాకను 'ఆమని' దయచేయడంతో ముడిపెట్టడం కవి శేషేంద్ర శర్మ కలం సత్తాకు నిదర్శనం.

గుమ్మంలో వేలాడే కోరికలు... నదిని దోచుకెళ్లే నావ

పాట చరమాంకానికి వచ్చేసరికి వేదన మరింత తీవ్రమవుతుంది. విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో... అంటూ తోరణాల్లా వేలాడే నిరాశను గుమ్మంలో నిలబడ్డ నాయిక చూపులతో పోల్చారు. ఇక ఈ పాట మొత్తానికి కిరీటం లాంటి పంక్తి... నది దోచుకుపోతున్న నావను ఆపండి... రేవు బావురుమంటుందని నావకు చెప్పండి. సాధారణంగా నదిలో నావ ప్రయాణిస్తుంది. కానీ ఇక్కడ నావ అయిన భర్త, తనతో పాటు నాయికలోని చైతన్యాన్ని, ఆశ అనే నదిని దోచుకుపోతున్నాడని కవి వర్ణించారు. భర్త వెళ్ళిపోతుంటే ఒడ్డున మిగిలిపోయిన రేవులా తను బావురుమంటున్నానని చెప్పడం గుండెలను పిండేసే అద్భుత ప్రయోగం. దర్శకుడు బాపు అద్భుతమైన లాంగ్ షాట్స్, గోదావరి నదీ తీరం, పడవ ప్రయాణం... వీటన్నిటి నడుమ సాగే ఈ పాట కేవలం వినేది కాదు, అనుభవించాల్సిన ఒక గాఢమైన అనుభూతి. వీలైతే ఒకసారి ముత్యాల ముగ్గు సినిమా చూడండి. ఈ పాటలోని అర్దాన్ని, దృశ్యరూపంలో చూసేందుకు ప్రయత్నించండి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story