NTR Raju Peda Movie: ఇలాంటి పాత్రలు ఎన్టీఆర్‌కే సాధ్యం...చిరిగిన చొక్కా..చెదిరిన జుట్టు సినిమా అంతా ఇంతే
నటుడికి నటన ముఖ్యం... నటనకు అవకాశం దొరికితే పరకాయ ప్రవేశం చేసి నటించే వ్యక్తి ఎన్టీఆర్. రాజు పేద సినిమాలో డీ గ్లామర్ పాత్రలో కూడా అదరహో అనిపించారు ఎన్టీఆర్.
NTR Raju Peda Movie: ఎన్టీఆర్ అంటే మనందరికీ రాముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, రాజకుమారుడు, విక్రమాదిత్యుడు, శ్రీకృష్ణదేవరాయలతో పాటు సామాజిక చిత్రాల్లో కూడా అందంగా, కలల రాకుమారుడిగా కనిపిస్తాడు. ఎన్టీఆర్‌కు అందమే ఆయన్ను సినీ రంగంలో టాప్ హీరోగా నిలబెట్టింది. నటుడిగా ఎన్నో సినిమాలు చేసినా ఆయన కెరీర్‌లో అత్యంత డీగ్లామర్ రోల్ పోషించిన సినిమాలు చాలా తక్కువ. అందులోనూ ఓ సినిమాలో ఆయన డీ గ్లామర్ రోల్ ఎంతగా ఉంటుందంటే సినిమా అంతా చిరిగిన చొక్కాతో నల్లగా మారిన ముఖంతో చెదిరిన జుట్టుతో ఓ అనాకారిగా కనిపిస్తాడు. అప్పటి వరకు ఎంతో అందంగా ఉండే ఎన్టీఆర్ ఒక్కసారిగా అనాకారిగా కనిపించడంతో ప్రేక్షకులు తట్టుకోలేకపోయారు. కానీ, సినిమాకు మంచి మార్కులే వేశారు. ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా.
ప్రయోగమే కానీ...
సినిమా ఇండస్ట్రీలో ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. అయితే ఆ ప్రయోగాలు దాదాపుగా అప్పుడే వచ్చిన హీరోలు లేదా కమెడీయన్‌లపై చేస్తుంటారు. స్టార్ హీరోతో ప్రయోగం చేస్తే మార్కెట్ దెబ్బతింటుందని భయం. కానీ, ఎన్టీఆర్ ప్రయోగాలకు ఎప్పుడు వెనకడుగు వేయలేదు. ఎదురుచెప్పలేదు. క్యారెక్టర్ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా ఎన్టీఆర్ సదా సిద్దంగా ఉండేవాడు. ఇలాంటి వైవిధ్యభరితమైన పాత్రతో కూడిన కథ ఒకటి ఎన్టీఆర్ దగ్గరకు వచ్చింది. మరో మాట మాట్లాడకుండా ఎన్టీఆర్ ఓకే చేశాడు. ఆ సినిమానే రాజు పేద. ఇందులో పేదవాడి పాత్రను ఎన్టీఆర్ పోషించాడు. ఎంత పేదవాడంటే ఆయనకు సినిమా మొత్తం మీద ఒకటే డ్రస్. అదీ నల్లగా మురికిపట్టిపోయి ఉంటుంది. ముఖం నల్లగా మారిపోతుంది. జుట్టు రేగినట్టు ఉంటుంది. పేదవాడిగా చూపించవచ్చు. కానీ, మరీ ఇంత పేదరికం చూపించాలా అని చాలా మంది ఆరోజుల్లో మండిపడ్డారు కూడా.
అనాకారి పాత్ర...అదిరిపోయిన నటన
బి ఏ సుబ్బారావు దర్శకత్వంలో ఇంగ్లీషులో వచ్చిన ది ప్రిన్స్ అండ్ పాపర్ నవలను తెలుగులో రాజుపేద సినిమాగా తీశారు. గొప్ప వాళ్లకు, పేదవాళ్లకు ఉన్న తేడాలు, అడ్డంకులు, వారితో వచ్చే సమస్యలను చక్కగా చూపించారు. అయితే, 1954కి వచ్చేసరికి ఎన్టీఆర్ స్టార్ హీరోగా అవతరించారు. ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఉంటోంది. అలాంటి సమయంలో ఇలాంటి ప్రయోగం అంటే ఏ హీరో కూడా ఒప్పుకోడు. కానీ, ఎన్టీఆర్ వెంటనే సినిమా చేసేందుకు ఓకే చేశాడు. సినిమా విడుదలయ్యాక ఎన్టీఆర్ పాత్రను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. బాబోయ్ ఏంటీ రోల్ అని భయపడ్డారు. జబర్థస్త్ కామెడీలో చెప్పినట్టుగా మేమంత పేదవాళ్లమంటే...పే...పే..పే... పేదవాళ్లం అని చెప్పినట్టుగా సినిమా మొత్తం మీద ఒక్కటే డ్రస్ అంటే ఆశ్చర్యమే కదా. అలాంటి అనాకారి పాత్రలో కూడా ఎన్టీఆర్ మెప్పించాడంటే అర్థం చేసుకోవచ్చు. నటనకు స్కోప్ ఉండాలేగాని ఎలాంటి పాత్ర అయినా చేయగలనని నిరూపించాడు ఎన్టీఆర్.




