NTR: ఎన్టీఆర్ నోట బాలకష్ణ డైలాగ్..స్టేడియం హోరెత్తిపోయింది
NTR: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ వేడుకలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సందడి.
NTR: ఎన్టీఆర్ నోట బాలకష్ణ డైలాగ్..స్టేడియం హోరెత్తిపోయింది
NTR: టాలీవుడ్, శాండల్ వుడ్, మాలీవుడ్ అనే తేడా లేకుండా ఇండియన్ సినిమా అంతా గర్వించదగ్గ అగ్ర హీరోల కలయిక హైదరాబాద్‌లో అద్భుతాన్ని సృష్టించింది. మలయాళ వర్సటైల్ నటుడు, తన అద్భుత నటనతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఫహద్ ఫాజిల్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’.
హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసి అభిమానులకు పూనకాలు తెప్పించారు. ఇటీవల చేతికి సర్జరీ జరిగి పూర్తిగా కోలుకున్న తారక్.. ఈ ఈవెంట్‌లో పూర్తి ఎనర్జీతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. త్వరలోనే తన మోస్ట్ అవేటెడ్ సినిమా ‘డ్రాగన్’ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు ఆయన స్పష్టం చేయడం ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్ ఇచ్చింది.
వేదికపై ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నటుడిగా తాను మనస్ఫూర్తిగా ఇష్టపడే, గౌరవించే అతికొద్ది మంది కళాకారుల్లో ఫహద్ ఫాజిల్ ముందు వరుసలో ఉంటారని కొనియాడారు. కోవిడ్ సమయంలో థియేటర్లు మూతపడి అందరం ఇళ్లకే పరిమితమైనప్పుడు.. ఫహద్ నటించిన సినిమాలు మాకు ఎంతో మానసిక ఉపశమనాన్నిచ్చాయి. ‘బెంగళూరు డేస్’ సినిమా నుంచి ఆయన నటనను గమనిస్తున్నాను. ఆయనొక అసాధారణ నటుడు. ఈ చిత్రంతో తెలుగులో ఫహద్‌కు ఒక లీడ్ హీరోగా భారీ విజయం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఎన్టీఆర్ ఆకాంక్షించారు.
ఈ వేదికపై తన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. సరిగ్గా 2000 నవంబర్‌లో తన తొలి చిత్రం ‘నిన్ను చూడాలని’ ప్రారంభోత్సవానికి ఒక్కడినే వెళ్లిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. ఆనాడు తన పక్కన కుటుంబ సభ్యులు లేరనే చిన్న బాధ ఉండేదని, కానీ కాలక్రమేణా ప్రేక్షకులు, అభిమానులే తన కుటుంబంగా మారారని తెలిపారు.
అదేవిధంగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సంగీత మాంత్రికుడు ఎం.ఎం. కీరవాణి కుటుంబం తనకు దేవుడిచ్చిన సొంత కుటుంబంలాంటిదని చెప్పారు. ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా విడుదలై పాతికేళ్లు పూర్తయిన ఈ ప్రత్యేక సందర్భంలో.. అదే వేదికపై జక్కన్న రాజమౌళితో కలిసి నిలబడటం తన జీవితంలో మరువలేని మధుర క్షణమని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ చిత్రంతో నిర్మాతగా కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్న ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ గురించి మాట్లాడుతూ.. కార్తికేయను తన సొంత తమ్ముడిగా భావిస్తానని చెప్పారు. ‘బాహుబలి’, ‘ఆర్జేఆర్’ సినిమాల సమయంలో కార్తికేయ చూపిన బాధ్యత, అందించిన సహాయాన్ని తారక్ గుర్తుచేసుకున్నారు. తన కష్టసుఖాల్లో తోడుగా నిలిచే తమ్ముడు కార్తికేయ ఈ సినిమాతో నిర్మాతగా ఘన విజయం సాధించాలని దీవించారు. అలాగే ఈ చిత్ర దర్శకుడు శశాంక్ పట్టుదలను మెచ్చుకున్నారు.
చివర్లో తారక్ తనదైన స్టైల్‌లో చివరగా మైక్ అందుకున్న ఎన్టీఆర్.. ఎవరినీ ట్రబుల్ చేయకండి.. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్.. ఇఫ్ యు ట్రబుల్ ది ట్రబుల్.. ది ట్రబుల్ విల్ ట్రబుల్ యూ అంటూ చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. తారక్ రాకతో ఈ ప్రీ-రిలీజ్ వేడుక చిత్ర యూనిట్‌కు మాత్రమే కాకుండా, ప్రేక్షకులకు కూడా జీవితాంతం గుర్తుండిపోయే అద్భుత జ్ఞాపకంగా మిగిలింది.




