NTR Rajamouli: ఎన్టీఆర్‌-రాజమౌళి ఆ రిస్క్‌ చేయకుంటే... ఈరోజు ఇండస్ట్రీ మరోలా ఉండేదేమో

ఎన్టీఆర్ - రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘స్టూడెంట్ నెం.1’ సినిమా టాలీవుడ్ చరిత్రను ఎలా మార్చింది? రూ. 1.8 కోట్ల బడ్జెట్ నుండి ఆస్కార్ వరకు సాగిన వారి ప్రయాణంపై ఒక ప్రత్యేక విశ్లేషణ.

Balachander
Published on: 21 May 2026 3:09 PM IST
NTR Rajamouli: ఎన్టీఆర్‌-రాజమౌళి ఆ రిస్క్‌ చేయకుంటే... ఈరోజు ఇండస్ట్రీ మరోలా ఉండేదేమో
X

NTR Rajamouli: తెలుగు సినిమా చరిత్రను ‘బాహుబలికి ముందు.. బాహుబలికి తర్వాత’ అని ఎలాగైతే విభజిస్తామో.. అలాగే టాలీవుడ్ కమర్షియల్ స్టామినాని ‘స్టూడెంట్ నెం.1’కి ముందు, తర్వాత అని కూడా చూడాలేమో! ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్.. ఎస్ఎస్ రాజమౌళి ప్రపంచం గర్వించే దర్శకుడు. కానీ, సరిగ్గా 24 ఏళ్ల క్రితం పరిస్థితి ఇది కాదు. ఒకరికి తాతగారి భారీ వారసత్వం ఇచ్చిన ఒత్తిడి.. మరొకరికి ఎలాగైనా దర్శకుడిగా నిరూపించుకోవాలనే తపన. ఈ ఇద్దరి కలయికలో 2001లో వచ్చిన ‘స్టూడెంట్ నెం.1’ కేవలం ఒక హిట్ సినిమా మాత్రమే కాదు.. టాలీవుడ్ భవిష్యత్తును మార్చేసిన ఒక పెను సంచలనం. ఆ రోజు గనుక ఆ 18 ఏళ్ల కుర్రాడు, ఆ కొత్త దర్శకుడు అంత పెద్ద రిస్క్ చేయకపోయి ఉంటే.. బహుశా ఈరోజు తెలుగు సినిమా గమ్యం మరోలా ఉండేదేమో!

ఒకే పడవలో ఇద్దరు ప్రయాణికులు

స్టూడెంట్ నెం.1 సెట్స్‌పైకి వెళ్లేటప్పటికి రాజమౌళికి కనీసం కెమెరా క్రేన్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియదు. ఈటీవీలో సీరియల్స్ చేసిన అనుభవమే తప్ప, వెండితెరపై మెగాఫోన్ పట్టడం అదే మొదటిసారి. అటు పక్కన హీరో ఎన్టీఆర్ వయసు కేవలం 18 ఏళ్లు. సీనియర్ ఎన్టీఆర్ అనే మూడక్షరాల పేరు మోసే బరువు అంతా ఆ చిన్న వయసులోనే ఆయన భుజాలపై పడింది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణ ఉన్నప్పటికీ, 148 నిమిషాల నిడివి గల ఒక పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాను నడిపించడం ఆ ఇద్దరికీ ఒక అగ్నిపరీక్షే. అప్పటివరకు కేవలం లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలే నడుస్తున్న కాలంలో.. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌కి జైలు శిక్ష అనే ఒక విభిన్నమైన క్రైమ్ ఎలిమెంట్‌ని జోడించి రాఘవేంద్రరావు ఇచ్చిన స్క్రిప్ట్‌ని రాజమౌళి నమ్మారు. ఎలాంటి సేఫ్టీ నెట్ లేకుండా, ఒకరినొకరు నమ్మి ఆ రోజు వారు ఆ అడుగు ముందుకు వేశారు.

బాక్సాఫీస్ లెక్కలు మార్చిన ‘స్టూడెంట్’

అప్పట్లో స్టార్ హీరోల సినిమాలతో పోలిస్తే ‘స్టూడెంట్ నెం.1’ చాలా చిన్న సినిమా. కానీ థియేటర్లలో అది సృష్టించిన ప్రభంజనం మాత్రం చాలా పెద్దది. ఈ సినిమాను కేవలం రూ. 1.8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. వైజాగ్‌లోని ఒక కాలేజీ క్యాంపస్‌ నేపథ్యంలో పరిమితమైన బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించారు. అప్పటి వరకు ఉన్న లవ్‌స్టోరీ, ఫ్యామిలీ డ్రామాలకు భిన్నంగా చేసిన ఈ ప్రయోగం బాక్సాఫీస్‌ వద్ద భారీ సంచలనం సృష్టించింఆఇ. కేవలం 40 ప్రింట్లతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 22 కోట్లు కలెక్ట్‌ చేసి ఇండస్ట్రీని షాక్‌కి గురిచేసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌ అంతటా 50 రోజుల వేడుకను జరుపుకున్న ఈ సినిమా 42 కేంద్రాల్లో వంద రోజులు దిగ్విజయంగా ప్రదర్శించబడింది. కీరవాణి అందించిన సంగీతం, ముఖ్యంగా ‘సక్కుబాయి’ సాంగ్ అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. ఈ విజయం టాలీవుడ్‌కి ఒక కొత్త మాస్ హీరోని, ఒక తిరుగులేని కమర్షియల్ డైరెక్టర్‌ని పరిచయం చేసింది.

ఆ నమ్మకమే ‘ఆర్ఆర్ఆర్’ వరకూ తెచ్చింది!

స్టూడెంట్ నెం.1 ఇచ్చిన ఊపుతోనే ఆ తర్వాత ‘సింహాద్రి’ (2003), ‘యమదొంగ’ (2007) లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత రాజమౌళి ‘బాహుబలి’తో తెలుగు సినిమా ఎల్లలు దాటగా, ఎన్టీఆర్ నటనలో తనను తాను మరింత అద్భుతంగా మలచుకున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి పాత నమ్మకమే మళ్లీ ‘ఆర్ఆర్ఆర్’ రూపంలో ప్రపంచం ముందుకు వచ్చింది. రూ. 1.8 కోట్ల బడ్జెట్‌తో మొదలైన వీరి ప్రయాణం.. రూ. 550 కోట్ల భారీ బడ్జెట్ సినిమా వరకు వెళ్ళింది. ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించేలా చేసింది. టైమ్స్ మ్యాగజైన్ టాప్-100 జాబితాలో రాజమౌళి నిలిచారంటే, దానికి పునాది వైజాగ్ లా కాలేజీలో పడిన ఆ మొదటి అడుగే. ఆ రోజు ఆ రిస్క్ చేయకుంటే, ఈరోజు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా ఈ స్థాయిలో గర్జించేది కాదు అనడంలో ఎలాంటి సందేహం లేదు! గ్లోబల్ స్థాయిలో రాజమౌళి సినిమాలు తీస్తున్నడన్నా...ఎన్టీఆర్‌కి మ్యాన్‌ ఆఫ్‌ ది మాసెస్‌ అనే బిరుదు వచ్చినా దీనంతటికీ ఆ స్టూడెంట్‌ నంబర్‌ 1లో పడిన బీజమనే చెప్పాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story