Obsession Movie: బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట.. త్వరలోనే ఓటీటీలోకి రానున్న సైకలాజికల్ హారర్ హిట్
Obsession Movie: కర్రీ బార్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ హారర్ చిత్రం 'అబ్సెషన్' ఈ ఏడాది అత్యంత ఊహించని విజయాలలో ఒకటిగా నిలిచింది.
Obsession Movie: బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట.. త్వరలోనే ఓటీటీలోకి రానున్న సైకలాజికల్ హారర్ హిట్
Obsession Movie: కర్రీ బార్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ హారర్ చిత్రం 'అబ్సెషన్' ఈ ఏడాది అత్యంత ఊహించని విజయాలలో ఒకటిగా నిలిచింది. కేవలం $750,000 (సుమారు రూ. 6.2 కోట్లు) బడ్జెట్‌తో రూపొందిన ఈ ఇండిపెండెంట్ హారర్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను సాధించడమే కాకుండా, భారతదేశంలోనూ భారీ ఆదరణ పొందింది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ సినిమా డిజిటల్ విడుదల కోసం సినిమా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జూన్ 30న డిజిటల్ విడుదల
వారాల తరబడి సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. జూన్ 30 నుండి 'అబ్సెషన్' చిత్రం డిజిటల్ కొనుగోలు, రెంట్ ప్రాతిపదికన అందుబాటులోకి రానుంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, ఫండంగో ఎట్ హోమ్ , ఇతర ప్రీమియం వీడియో-ఆన్-డిమాండ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వీక్షించవచ్చు.
అయితే.. ఈ చిత్రాన్ని జూన్ 2నే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేయాలని డిస్ట్రిబ్యూటర్ 'ఫోకస్ ఫీచర్స్' భావించింది. అయితే, థియేటర్లలో టికెట్ల విక్రయాలు విపరీతంగా పెరగడంతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేసి, థియేట్రికల్ రన్‌ను పొడిగించారు. జూన్ 2వ తేదీ ఒక్కరోజే ఈ చిత్రం థియేటర్ల ద్వారా మరో $5.7 మిలియన్లను వసూలు చేయడం విశేషం. అయితే, ఈ జూన్ 30 విడుదల కేవలం రెంట్ లేదా కొనుగోలుకు మాత్రమే వర్తిస్తుంది.. అయితే.. ఉచిత సబ్‌స్క్రిప్షన్ స్ట్రీమింగ్ తేదీని ఇంకా ప్రకటించలేదు.
రికార్డులను బద్దలు కొట్టిన బాక్సాఫీస్ కలెక్షన్లు
ఇటీవలి కాలంలో అత్యంత విజయవంతమైన స్వతంత్ర హారర్ చిత్రాలలో ఒకటిగా 'అబ్సెషన్' రికార్డు సృష్టించింది. హారర్ జానర్‌లో మైలురాళ్లుగా నిలిచిన 'ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్', అలాగే జోర్డాన్ పీలే ఆస్కార్ గెలుచుకున్న 'గెట్ అవుట్' వంటి చిత్రాల ప్రపంచవ్యాప్త వసూళ్లను కూడా ఇది అధిగమించింది. సాధారణంగా సినిమాలు విడుదలైన తర్వాతి వారాల్లో వసూళ్లు తగ్గుతాయి, కానీ ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో వారాంతాల్లో మరింత వృద్ధిని కనబరుస్తూ దూసుకుపోతోంది.
అసలు 'అబ్సెషన్' కథ ఏమిటి?
ఈ చిత్ర కథ బేర్ (బారన్ బెయిలీ) అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఈ పాత్రను మైఖేల్ జాన్‌స్టన్ పోషించారు. బేర్ తన చిన్ననాటి స్నేహితురాలు నిక్కీ (ఇండే నవారెట్)ను అమితంగా ప్రేమిస్తాడు. ఈ క్రమంలో అతనికి కోరికలను తీర్చే ఒక రహస్యమైన, సూపర్ నాచురల్ వస్తువు 'వన్ విష్ విల్లో' లభిస్తుంది. దాని సహాయంతో నిక్కీ తన ప్రేమలో పడాలని బేర్ ఒక కోరిక కోరతాడు.
ఆ కోరిక నెరవేరినట్లే కనిపిస్తుంది కానీ, ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. బేర్ పట్ల నిక్కీ చూపే ప్రేమ క్రమంగా అత్యంత తీవ్రంగా, భయాందోళన కలిగించేలా మారుతుంది. ఒక అందమైన ప్రేమ కథగా మొదలైన వారి జీవితం కాస్తా ఒక భయంకరమైన పీడకలగా రూపాంతరం చెందుతుంది. చివరకు ఈ పరిణామాలు ప్రాణాంతకంగా మారి, కథను ఒక చీకటి మానసిక స్థితిలోకి తీసుకెళ్తాయి.
భారత్‌లో వస్తున్న స్పందనపై దర్శకుడి ఆనందం
ఈ చిత్రానికి భారతదేశంలో వస్తున్న అఖండ ప్రజాదరణపై దర్శకుడు కర్రీ బార్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "అబ్సెషన్ చిత్రం భారతదేశంలో ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను అస్సలు ఊహించలేదు.
నిజానికి ఇది ఎక్కడైనా ఇంతటి ఘనవిజయం సాధిస్తుందని అనుకోలేదు. మనం తీసిన సినిమా విజయవంతం కావాలని, ప్రజలకు కనెక్ట్ అవ్వాలని ప్రతి ఒక్కరూ కలలుకంటారు. కానీ ప్రస్తుతం ఈ చిత్రం సాధిస్తున్న విజయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. చాలా తక్కువ బడ్జెట్‌తో మేము ఈ సినిమా తీశాం, దీనికి ఇంతటి గుర్తింపు రావడం నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది" అని చెప్పుకొచ్చారు.




